మొన్నటివరకు ఓజీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు పవన్ కల్యాణ్. ఆ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే, కొన్ని రోజులు రాజకీయాలకు టైమ్ కేటాయించాడు. కొన్ని పర్యటనలు, మరికొన్ని ప్రసంగాలు ముగించాడు. ఇప్పుడు మరోసారి సినిమాలకు కాల్షీట్లు కేటాయించాడు ఈ హీరో.
ఎప్పట్నుంచో పడుతూలేస్తూ సాగుతున్న హరిహర వీరమల్లు సినిమాను పునఃప్రారంభించబోతున్నాడు పవన్. ప్రస్తుతానికి ఈ సినిమాకు 4 రోజుల కాల్షీట్లు మాత్రం ఇచ్చాడు. ఆ 4 రోజులు ఎప్పుడనేది కూడా ఇంకా చెప్పలేదు. వీలైతే వచ్చేవారం లేదా ఈనెలాఖరుకు వీరమల్లు కోసం 4 రోజులు పని చేయబోతున్నాడు ఈ హీరో.
పవన్ కోసం రామోజీ ఫిలింసిటీలో ఓ సెట్ వేశారు. మొఘల్ కాలాన్ని తలపించేలా నిర్మించిన ఆ ఖరీదైన సెట్ లో, హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ పై ఓ సాంగ్ ను తీయబోతున్నారు. సెట్ వర్క్ దాదాపు పూర్తయింది, యూనిట్ కూడా షూట్ కు రెడీగా ఉంది. పవన్ ఎప్పుడు వస్తే అప్పుడు మొదలుపెడతారు. సినిమాలో ఇంటర్వెల్ కు ముందు ఈ సాంగ్ వస్తుందట.
అటు హరీశ్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ కోసం అన్నీ సిద్ధం చేసుకొని కూర్చున్నాడు. మరోవైపు సుజీత్ కూడా ఓజీ మూవీ కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు. మొన్నటివరకు ముంబయి పరిసర ప్రాంతాల్లో షూట్ చేసిన సుజీత్, ఈసారి హైదరాబాద్ లోనే కొత్త షెడ్యూల్ అనుకుంటున్నాడు.