ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కింది రాధేశ్యామ్ సినిమా. వచ్చే నెల థియేటర్లలోకి కూడా రాబోతోంది. ఇదొక అందమైన ప్రేమకథ. అది కూడా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో నడిచే వింటేజ్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో ప్రభాస్-పూజాహెగ్డే మధ్య లవ్ సీన్స్ చాలా బాగుంటాయని, యూనిట్ చాన్నాళ్లుగా చెప్పుకొస్తోంది.
సినిమా వాళ్లది కాబట్టి ఆమాత్రం చెప్పుకోవడంలో తప్పులేదనిపిస్తుంది. కానీ ఈరోజు రిలీజైన సాంగ్ చూస్తే మాత్రం అది నిజమేనేమో అనిపిస్తుంది. ప్రభాస్-పూజాహెగ్డే మధ్య తీసిన ఓ మాంటేజ్ సాంగ్ ను ఈరోజు రిలీజ్ చేశారు. 'ఈ రాతలే' అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ ఆడియో పరంగా ఇప్పటికే పెద్ద హిట్టయింది.
ఇప్పుడు వీడియోతో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది. ప్రభాస్, పూజాహెగ్డే ఒకరికొకరు పరిచయం కాకముందే వచ్చే సన్నివేశాలతో తీసిన ఈ మాంటేజ్ సాంగ్.. ఎంతో రిచ్ గా ఉంది. విజువల్స్ చూడగానే ఆకట్టుకుంటున్నాయి. పాట చూసిన ఎవరికైనా ఓ అందమైన అనుభూతి కలుగుతుంది.
ఈ సాంగ్ కు సంబంధించి లిరికల్ వీడియో రిలీజ్ చేసినప్పుడు, గ్రాఫిక్స్ ఉపయోగించారు. అవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఇదొక మాంటేజ్ సాంగ్ అని, ఇంత తొందరగా వీడియో క్లిప్స్ చూపిస్తే సినిమాలో కొంత కథ తెలిసిపోతుందని అప్పుడే వెల్లడించాం. ఇప్పుడు సరిగ్గా విడుదలకు 2 వారాల ముందు ఆ పాట వీడియోను విడుదల చేశారు. అయితే ఇదే పాటలో రివీల్ అవ్వాల్సిన కీలకమైన ఓ సన్నివేశాన్ని మాత్రం చాకచక్యంగా సాంగ్ లో కట్ చేశారు. అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ సినిమాలో చేయి చూసి జాతకాలు చెప్పే విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఇక ప్రేరణ అనే డాక్టర్ పాత్రలో పూజా హెగ్డే కనిపించనుంది. వీళ్లిద్దరూ ఎలా కలుసుకున్నారు. వాళ్ల ప్రేమ, ప్రకృతిని ఎదిరింది ఎలా నిలిచిందనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.