పదవులు దండుకుంటూనే ఇదేం ఫిటింగు!

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. అత్యంత వివాదాస్పదంగా గుర్తింపు తెచ్చుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకరు. ఆయనను మించి వివాదాల్లో కూరుకుపోయిన వారు కూడా భారాస టీమ్ లో ఉన్నారు. అయితే అధికార…

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. అత్యంత వివాదాస్పదంగా గుర్తింపు తెచ్చుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకరు. ఆయనను మించి వివాదాల్లో కూరుకుపోయిన వారు కూడా భారాస టీమ్ లో ఉన్నారు. అయితే అధికార పార్టీ మాత్రం వారందరి పట్ల ఒకే రకమైన ఉపేక్ష ధోరణినే అవలంబించింది. 

వారు వివాదాల్లో కూరుకున్నప్పుడు.. చర్యలు తీసుకున్న, కనీసం మందలించిన దాఖలాలు కూడా కనిపించలేదు. కానీ ఎన్నికల సమయం వచ్చేసరికి.. సమయమెరిగి వాత పెడుతున్నట్టుగా.. కేసీఆర్ , తాటికొండ రాజయ్యకు టికెట్ నిరాకరించి.. స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం శ్రీహరిని రంగంలోకి దించారు.

ఆ నాటినుంచి రాజయ్య విపరీతమైన అసంతృప్తితో రగిలిపోతున్నారు. నియోజవకర్గంలో కార్యకర్తల ముందు భోరుభోరున ఏడ్చారు. అంబేద్కర్ బొమ్మ వద్ద ఫ్లోర్ మీద సాగిలపడి ఏడ్చారు. ఇలాంటి చాలా విలాపాలను సాగించారు. ఈ సారి ఎన్నికలకు కాస్త క్లిష్టంగా ఉండడంతో.. అసంతృప్తితో ముఖ్య నాయకులు ఎవ్వరూ పార్టీని వీడిపోకూడదని అనుకున్న భారాస అధిష్ఠానం.. రాజయ్య-శ్రీహరి లను పిలిపించి రాజీ చర్చలు నడిపింది. 

ఈ ఇద్దరు నాయకులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ చిరునవ్వులు చిందించే సన్నివేశాన్ని ఫ్యాబ్రికేట్ చేసి.. సదరు ఫోటోలను మీడియాకు విడుదల చేసింది. అక్కడితో అంతా సమసిపోయినట్టు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ పిమ్మట రాజయ్యకు తాయిలంగా.. రైతుబంధు సమితి ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. కేబినెట్ హోదా ఉన్న పదవి ఇది. రాజయ్య దాన్ని సంతోషంగా అందుకున్నారు.

తాజాగా.. రైంతు బంధు సమితి కార్యాలయంలో ఛైర్మన్ గా ఆయన పదవీ స్వీకార ప్రమాణం కూడా చేశారు. అయితే ఆ సందర్భంలో కూడా తనలోలోపల రగులుతున్న అసంతృప్తిని ఆయన బయటపెట్టడమే తమాషా! ఇప్పటికీ తనకు భారాస టికెట్ పై ఆశ ఉన్నదని, ప్రజాభిమానం తనకే ఉన్నదని.. సర్వేలు , ఇతర నివేదికల ద్వారా ఆ విషయం అధిష్ఠానం గుర్తించి.. తన నిర్ణయం మార్చుకుంటుందనే నమ్మకం ఉంటుందని అనుకుంటున్నట్టు రాజయ్య సన్నాయి నొక్కులు నొక్కారు. 

టికెట్ తిరస్కరణకు గురైనందుకు తాయిలంగా ఒక వైపు కేబినెట్ ర్యాంకు పదవి అందుకుంటూ.. మళ్లీ ఈ ఫిటింగులు ఏంటని పార్టీలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పదవి అందుకున్న తర్వాత కూడా.. నియోజకవర్గంలో కడియంకు అనుకూలంగా రాజయ్య పనిచేయకుండా చేటు చేస్తే దారేంటని అనుమానిస్తున్నారు.