రూల్స్ రంజన్ ‘నాలో..నేను’

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రూల్స్ రంజన్'. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి…

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రూల్స్ రంజన్'. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నుంచి మొదటి పాట విడుదలైంది.

'నాలో నేనే లేను' లిరికల్ వీడియోని సోమవారం ఉదయం విడుదల చేసింది చిత్ర బృందం. తన ప్రేమను కథానాయకకి చెప్పడం కోసం కథానాయకుడు పడే తపన ఈ పాటలో చూపించారు. కళ్లద్దాలు, నుదుటున బొట్టుతో బుద్ధిమంతుడిలా కనిపిస్తున్న కథానాయకుడు.. నాయికని ఫాలో అవుతూ ఆమె గురించి పాడుకోవడం ఆకట్టుకుంది. లిరికల్ వీడియోలో నాయికలా నాట్యం చేయబోయి కథానాయకుడు కిందపడటం, ఆమె నడిచొస్తుంటే అతను పూలు చల్లడం వంటి సరదా సన్నివేశాలు అలరించాయి. అమ్రిష్ గణేష్ స్వరపరిచిన సంగీతం వినసొంపుగా, ఆహ్లాదకరంగా ఉంది. సంగీతానికి తగ్గట్టుగానే రాంబాబు గోసాల అందించిన సాహిత్యం ఎంతో హాయిగా, స్వచ్ఛంగా ఉంది. అందరికీ అర్ధమయ్యే భాషలో ఎంతో అర్థవంతంగా పాటను రాశారు. ఇక శరత్ సంతోష్ ఎంతో అందంగా పాటను ఆలపించి కట్టిపడేశారు.

'నాలో నేనే లేను' పాట విడుదల సందర్భంగా గీత రచయిత రాంబాబు గోసాల మాట్లాడుతూ.. చాలా అందమైన చిన్న చిన్న పదాలతో తన ప్రేమని కథానాయిక కి తెలియజేయడం కోసం కథానాయకుడు పడే తపన ఈ పాటలో చెప్పాము. సంగీత దర్శకులు అమ్రిష్ గారు చాలా మంచి బాణీ అందించారు. అలాగే గాయకులు శరత్ సంతోష్ చాలా బాగా పాడారు. ఈ పాట పెద్ద హిట్ అవుతుందని అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.

వినోదమే ప్రధానంగా ఈ చిత్రం రూపొందుతోంది. కథానాయకుడు కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు ,ఇమేజ్ కు భిన్నంగా ఈ చిత్రం సరికొత్తగా ఉండటం తో పాటు, పూర్తి స్థాయి వినోద భరిత కథాచిత్రమిది. సగటు సినిమా ప్రేక్షకుడు మనసారా వినోదాన్ని ఆస్వాదించే చిత్రమవుతుంది. ఇందుకు చిత్ర కథ, నాయకా నాయికల పాత్రలు, కథానుగుణంగా సాగే ఇతర ప్రధాన తారాగణం పాత్రలు, సంభాషణలు, సంగీతం ఇలా అన్నీ సమపాళ్లలో చక్కగా కుదిరిన ఓ మంచిత్రం అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు చిత్ర నిర్మాతలు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి, దర్శకుడు రత్నం కృష్ణ.

ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై నెలలో చిత్రాన్ని విడుదల చేయాలన్నది సంకల్పం అని తెలిపారు.