వారాంతం ముగిసింది, కస్టడీ జాతకం తేలిపోయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఇక ఎంత మాత్రం సాధ్యం కాదనే విషయాన్ని ట్రేడ్ తేల్చేసింది. దీంతో నాగచైతన్య కెరీర్ లో కస్టడీ సినిమా ఫ్లాప్ మూవీగా మిగిలిపోనుంది.
మొదటి రోజు ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ మేకర్స్ నమ్మలేదు. శనివారం, ఆదివారం సినిమా పుంజుకుంటుందని బలంగా నమ్మారు. కానీ మేకర్స్ ఆశలు ఆవిరయ్యాయి. శనివారం రోజున కస్టడీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయల షేర్ కూడా దాటలేదు. ఇక నిన్నటి ఆదివారం కూడా ఏపీ, నైజాంలో షేర్ కోటి రూపాయలు దాటలేదు.
ఇక సోమవారం అయిన ఈరోజు, కస్టడీ సినిమాకు బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి. ఆంధ్రా, నైజాం, సీడెడ్ లో ఎక్కడా ఆక్యుపెన్సీ 30-40 శాతం దాటలేదు. ప్రస్తుతం నడుస్తున్న టాక్ తో, ఈ వీకెండ్ వరకు సినిమా నిలబడుతుందనే గ్యారెంటీ లేదు.
అటు ఓవర్సీస్ లో కూడా కస్టడీ పరిస్థితి తీసికట్టుగా తయారైంది. సాధారణంగా నాగచైతన్య నటించిన సినిమాలకు (థ్యాంక్యూ మినహా) ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ లో 4లక్షల డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల మధ్య వసూళ్లు వస్తుంటాయి. కానీ మొదటి వారాంతం కస్టడీ, రెండున్నర లక్షల డాలర్లు కూడా రాలేదు.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కింది కస్టడీ సినిమా. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందించారు. సినిమాలో నాగచైతన్య యాక్టింగ్ కు మంచి ప్రశంసలు దక్కాయి, కానీ ఈ సినిమా అతడి కెరీర్ కు బొత్తిగా కలిసిరాలేదు.