సుదీర్ఘ పాదయాత్ర చేయాలని నారా లోకేశ్ తలపెట్టిన చాలా మంది అవహేళన చేశారు. సుకుమారంగా పెరిగిన లోకేశ్ మండుటెండలో నడిచేంత సీన్ లేదని విమర్శించిన వాళ్లకు లెక్కలేదు. యువగళం పేరుతో పాదయాత్ర మొదలు పెట్టాలని యువనాయకుడు సంకల్పించారని తెలిసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా, అనవసరంగా సీఎం జగన్‌తో పోటీ పడి పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో అనేక ప్రతికూల కామెంట్స్ మధ్య కుప్పంలో లోకేశ్ యువగళం పేరుతో మొదటి అడుగు పడింది. ఇవాళ్టికి ఆయన పాదయాత్ర 100 రోజులకు చేరింది. శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేపుల క్యాంప్ సైట్ సోమవారం 100వ రోజు పాదయాత్ర మొదటి అడుగు పడింది. 100 వ రోజుకు చేరడాన్ని పురస్కరించుకుని మోతుకూరులో పైలాన్‌ను లోకేశ్ ఆవిష్కరించారు. మరీ ముఖ్యంగా ఇవాళ్టి ప్రత్యేకత ఏమంటే … లోకేశ్‌తో పాటు ఆయన మాతృమూర్తి నారా భువనేశ్వరి నడవడం. పాదయాత్రలో భాగంగా తల్లి షూ లేస్‌ను లోకేశ్ కట్టడం ఆకట్టుకుంది.
100 రోజుల్లో ఆయన 1250 కిలోమీటర్లు నడవడం విశేషం. లోకేశ్ పాదయాత్ర టీడీపీ శ్రేణుల్లో భరోసా నింపింది. నడవలేడేమో అన్న అనుమానాల్ని లోకేశ్ పటాపంచలు చేశారు. నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకుంటారనే విశ్వాసం లోకేశ్‌తో పాటు పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. ముఖ్యంగా లోకేశ్ మధ్యలోనే పాదయాత్ర నిలిపేస్తే, పరువు పోతుందనే భయం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల్లో ఉండింది. తండ్రిలో తన పట్ల భయాన్ని పోగొట్టడం లోకేశ్ సాధించిన మొదటి విజయంగా చెప్పొచ్చు.
ప్రస్తుతం లోకేశ్ నడక వరకూ ఓకే. ఇక నడతను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం హూందాగా వ్యవహరిస్తే సమాజం తప్పక గౌరవిస్తుంది. బాబుకు తానే సరైన రాజకీయ వారసుడిగా లోకేశ్ నిరూపించుకుంటే, పాదయాత్ర లక్ష్యం నెరవేరినట్టే. ఇందుకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశాలున్నాయి.