41(ఏ) ను రక్షణ కవచంలా వాడుతున్న టీడీపీ నేతలు!

తప్పు చేయడం, చట్టాన్ని అడ్డగోలుగా రక్షణ కవచంలాగా వాడుకోవడం.. ఇది ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. తెలుగుదేశం నాయకులు ఇలాంటి అడ్డ దారుల్లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. చెలరేగిపోతున్నారు.  Advertisement రాజకీయ…

తప్పు చేయడం, చట్టాన్ని అడ్డగోలుగా రక్షణ కవచంలాగా వాడుకోవడం.. ఇది ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. తెలుగుదేశం నాయకులు ఇలాంటి అడ్డ దారుల్లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. చెలరేగిపోతున్నారు. 

రాజకీయ నేపథ్యం ఉండే కేసుల విషయంలో.. తమ మీద చర్యలు ఉంటాయని భావించినప్పుడు చట్టాన్ని అడ్డగోలుగా వాడుకుంటూ చెలరేగడం ఓకే.. అదే సమయంలో.. నేరాలకు పాల్పడిన సందర్భాల్లో కూడా ఇదే తరహాలో చట్టాన్ని కవచంలాగా వాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, వారు చేస్తున్న తప్పులకు అరెస్టు కాదగిన అనేక కేసుల్లో, అరెస్టు కాకుండా స్వేచ్ఛగా బయటే ఉంటూ చెలరేగుతున్నారంటే.. అందుకు సీఆర్‌పీసీ లోని సెక్షన్ 41ఏ మూలకారణంగా ఉంటోంది. 

తాజా పరిణామాలను గమనిస్తే.. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కోర్టును ఆశ్రయించారు. వారి మీద ఉన్నవేమీ రాజకీయ నేపథ్యం ఉన్న కేసులు కాదు. కక్ష సాధిస్తున్నారని జగన్ మీద నిందలేసి పబ్బం గడుపుకోడానికి అవకాశం కూడా లేదు. భూ వివాదాలకు సంబంధించి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, తమ్ముడు విఖ్యాత్ రెడ్డిల మీద ఆళ్లగడ్డ పోలీసులు కేసులు నమోదు చేశారు. 

భూవివాదాల విషయంలో భూమా అఖిలప్రియ అండ్ కో కు ఎంతటి ట్రాక్ రికార్డు ఉన్నదో అందరికీ తెలుసు. హైదరాబాదులో సినిమా లెవెల్లో ఒక కిడ్నాప్ ప్లాన్ చేసి.. అడ్డంగా దొరికిపోయిన బ్యాచ్ ఇది. ఆళ్లగడ్డలో భూవివాదాల కేసులు నమోదు అయ్యేసరికి.. వారు అసలు ఆ కేసులనే కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారిని అరెస్టు చేయవద్దని, సిఆర్‌పిసి సెక్షన్ 41ఎ ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు పోలీసుల్ని ఆశ్రయించింది. 

తెలుగుదేశం నాయకులకు సెక్షన్ 41ఎ కొత్త కాదు. ముఖ్యమంత్రి జగన్ ను నానా బూతులు తిట్టిన సందర్భాల్లో తన మీద పోలీసు కేసులు నమోదు కాగానే.. అరెస్టు కాకుండా ఉండేందుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా హైకోర్టును ఆశ్రయించి సెక్షన్ 41ఎ ను కవచంలాగా వాడుకుని రక్షణ పొందారు. ఇప్పుడు కూడా అదే ఎపిసోడ్ ఆయన విషయంలో నడుస్తోంది. ఇతర సందర్భాల్లో సీఎంను బూతులు తిట్టిన టీడీపీ పెయిడ్ స్పీకర్ పట్టాభిరాం కూడా.. ఇది సెక్షన్ ఆశ్రయం పొందారు. ఇంతకూ ఏమిటీ సెక్షన్ 41ఏ..??

సెక్షన్ 41(ఏ) ఎలాంటి రక్షణ ఇస్తుందో తెలుసా?

ఎవరి మీదనైతే కేసు నమోదు అయిందో.. వారిని అరెస్టు చేయకుండా ముందు నోటీసులు ఇవ్వాలని ఈ సెక్షన్ 41ఎ ప్రధానంగా చెబుతుంది. వివరాలివీ..

1) ఎవరిమీదనైతే కేసు ఉందో వారిని విచారణకు రావాల్సిందిగా ముందుగా నోటీసు ఇవ్వాలి. అరెస్టు చేయడానికి తగిన సెక్షన్ల కింద నమోదు అయిన కేసుల విషయంలో ఇది కాపాడుతుంది. ఎవరికైతే పోలీసులు అలా నోటీసు ఇస్తారో.. నోటీసులో పోలీసులు పేర్కొన్న నిబంధనల ప్రకారం ఆ వ్యక్తి నడుచుకోవాలి. 

2) కీలకం ఏంటంటే.. నోటీసులోని అంశాలకు అనుగుణంగా సదరు కేసులోని వ్యక్తి నడుచుకున్నంత వరకు అతడిని అరెస్టు చేయడానికి వీల్లేదు. అరెస్టు చేసి తీరాల్సిందే.. అని దర్యాప్తు అధికారి అనుకుంటే.. అలా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో ఖచ్చితంగా కారణాలను రికార్డు చేయాలి. నోటీసులోని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా, విచారణకు సహకరించకపోయినా.. అలాంటప్పుడు మాత్రమే పరిస్థితి అరెస్టు దాకా వెళుతుంది. 

టీడీపీ నాయకులు తమ నోటికొచ్చినదంతా తిట్టేసి, చేయదలచుకున్న నేరాలు చేసేసి.. 41ఎ ద్వారా కోర్టు రక్షణ తీసుకుని అరెస్టు కాకుండా చెలరేగుతున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. చట్టాలను అడ్డదారుల్లో ఇలా వాడుకుంటూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు?