కులాలు ఇవ్వాళ నిన్న పుట్టినవి కాదు. తెరవెనుక వున్న కులాలు, కుల రాజకీయాలు అన్నీ 1980 దశకంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ముందుకు వచ్చాయి. ఎన్టీఆర్ వస్తూనే తన వర్గానికి టికెట్ లు ఇవ్వడంలో, పదవులు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారు. ఎక్కడెక్కడి వారినో తెచ్చి పదవులు కట్టబెట్టారు. ఆ సామాజిక వర్గం లేని చోట్ల కూడా ఎమ్మెల్యే టికెట్ లు ఇచ్చారు. దాంతో అప్పటి నుంచి కుల రాజకీయాలు నడుస్తూనే వున్నాయి. పెరుగుతూనే వున్నాయి. ఆఖరికి ఇప్పుడు కులం..కులం అని గొంతు చించుకునే పరిస్థితికి చేరుకున్నాయి.
ఇప్పుడు ఆంధ్రలో కమ్మ-రెడ్డి-కాపు-బిసి అనే నాలుగు స్తంభాలాట నడుస్తోంది. బిసిలను దగ్గరకు తీసి, వారికి టికెట్ లు ఇచ్చి, అధికారం అందుకోవడం తెలుగుదేశం పద్దతి అయింది. దాంతో కాపులు కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ రాజకీయాల్లోకి వచ్చాక బిసి లను దగ్గరకు తీయడం ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో బిసి లు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. బిసిలు ఎక్కువగా ఇప్పుడు వైకాపా వైపు వున్నారు. అదే సమయంలో కాపులు మాత్రం అటు జనసేన..వైకాపా…తేదేపా అన్నట్లుగా చీలిపోయారు.
ఒకప్పుడు బ్రాహ్మణానాం అనేకత్వం అనే నానుడి వుండేది. బ్రాహ్మణులకు ఐక్యత వుండదు అని. అది ఏమో కానీ కాపుల్లో అనేకత్వం అనేది మాత్రం పక్కాగా కనిపిస్తోంది. చిరకాలంగా దాదాపుగా ప్రతి కులానికి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వ అవకాశం వచ్చింది కానీ కాపులకు రావడం లేదు. ఓటింగ్ ప్రకారం మంచి సంఖ్యలో వున్నా కూడా కాపులు సిఎమ్ పదవిని అందుకోలేక పోవడానికి కారణం కేవలం వారిలో వున్న అనేేకత్వం అనే చెప్పుకోవాలి.
చిరంజీవి ప్రఙారాజ్యం ప్రారంభిస్తే, కాపులు పెద్ద సంఖ్యలో వున్న ఏరియాలో పోటీ చేసి ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ కు కూడా ఇదే తరహా పరాభవం తప్పలేదు. రాజకీయంగా కాపులు భిన్నమార్గాలు ఎంచుకోవడం వల్లనే వారికి అధికారం దూరం అవుతోంది. ఇది అందరికీ తెలిసిందే. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కాపుల విషయంలో కన్నా బిసి ల విషయంలోనే ఆసక్తిగా వుంది. కాపులు ఎలాగూ ఎక్కువ శాతం జనసేన వైపే మొగ్గుతారని వైకాపా గట్టి నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. అందుకే బిసిలను నమ్ముకుని కాపులను దాదాపు వదలేసింది. కాపులకు చెందిన మంత్రులు వున్నారు వారు ఎన్నో కొన్ని ఓట్లు తెస్తారు. మెగాస్టార్ చిరంజీని దగ్గరకు తీసాం అందువల్ల కొంత బెటర్ అనే ఆలోచన మాత్రం చేస్తన్నట్లు కనిపిస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో భాజపా..తేదేపాలు కాపుల ఓట్ల మీద కన్నేసాయి. పవన్ కళ్యాణ్ భుజం మీద కాపు ఓట్లకు గురిపెట్టాయి. ఇది చూసి వైకాపా లోని కాపు నేతలు పవన్ మీద గుర్రుగా వున్నారు. వారు పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. అలా చెేయకపోతే తమకు వైకాపాలో మనుగడ వుండదని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పవన్ ను ఎవరు గట్టిగా టార్గెట్ చేస్తే వారికే వీరతాడు అని నమ్ముతున్నారు. అందుకే అవకాశం దొరికినపుడల్లా కన్నబాబు, పేర్ని నాని లాంటి వారు పవన్ ను టార్గెట్ చేస్తుంటారు.
నిజానికి గట్టిగా గమనిస్తే, వైకాపా వచ్చిన తరువాత పార్టీ తరపున మాట్లాడేవారిలో రెడ్ల సంఖ్య కనిపించకుండా పోయింది. శ్రీకాంత్ రెడ్డి, సజ్జల లాంటి ఒకరిద్దరు తప్ప వేరే వారు గొంతు ఎత్తరు. వారు కూడా వ్యక్తుల మీద కాకుండా ఇన్ జనరల్ గా సమాధానం చెబుతుంటారు. కానీ కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్లు మాత్రం వ్యక్తులను టార్గెట్ చేయాలనుకున్నపుడు ముందుకు దూకుతున్నారు.
పవన్ కళ్యాణ్ అంటే అస్సలు సరిపడని మంత్రి పేర్ని నాని టాలీవుడ్ లో ఇతర సామాజిక వర్గ జనాలతో. బాగానే మమేకం అవుతున్నారు. తరచు కలిసి బాగానే ముచ్చటిస్తున్నారు అని వార్తలు వినిపిస్తుంటాయి. కానీ చిరంజీవి నేరుగా జగన్ ను కలిస్తే మాత్రం ఆయన చిన్న చిన్న దెప్పుడు మాటలే మాట్లాడారు. పవన్ వకీల్ సాబ్ టైమ్ లో ఏనాటిదో జీవో తెచ్చి రేట్ల తంటాకు శ్రీకారం చుట్టిందే ఆయన. అలాగే మళ్లీ వకీల్ సాబ్ సినిమా వచ్చేవరకు ఆంధ్రలో సినిమా పరిశ్రమకు ఏ ఇబ్బందీ లేదు.
ఇప్పుడు మళ్లీ థియేటర్ల గడబిడ ప్రారంభమైంది. నాగార్ఙున బంగార్రాజు కోసం నిబంధనలు పక్కన పెట్టినా పేర్ని నానికి పట్టలేదు. పవన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆయన విశ్వరూపం చూపిస్తారు. మరి కాపులు మిగిలిన వారికి పలుచన కమ్మంటే ఎందుకు కారు? ఇలాంటి వ్యవహారాలే కదా? కాపులు..కాపులు జుట్టు జుట్టు పట్టుకుంటూ వుంటారు. మిగిలిన వారు వారిని వాడుకుంటూ అధికారం అందుకుంటూ వుంటారు.