పంతాలు పెరిగిపోతే.. పాలన గుర్తురాదేమో..!

ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో తీర్పులు రావడం కొత్త విషయమేమీ కాదు. కానీ పదే పదే ఒకే విషయంలో పంతాలు, పట్టింపులకు పోయి అసలు విషయాలు పక్కనపెట్టి, కొసరు విషయాల కోసం ప్రభుత్వం తాపత్రయ…

ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో తీర్పులు రావడం కొత్త విషయమేమీ కాదు. కానీ పదే పదే ఒకే విషయంలో పంతాలు, పట్టింపులకు పోయి అసలు విషయాలు పక్కనపెట్టి, కొసరు విషయాల కోసం ప్రభుత్వం తాపత్రయ పడటమే ఇక్కడ వింత, విచిత్రం. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన మహిళా పోలీసుల విషయంలో ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టు అడ్డుకుంటూనే ఉంది. 2500 మంది నియామకాలు పూర్తై రెండేళ్లయ్యాయి. ఇంకా వారు పోలీస్ డిపార్ట్ మెంటా, సచివాలయ ఉద్యోగులేనా అనేది క్లారిటీ లేదు. గాలిలో నిలబెట్టారు.

ఇటు పోలీస్ డిపార్ట్ మెంట్ వారు బందోబస్తు, తనిఖీలకు వినియోగిస్తున్నారు, అటు సచివాలయాల్లోనూ విధులు చేయాల్సి వస్తోంది. ఈ దశలో పోలీసు విభాగంలో కలిపే ప్రత్యేక జీవోలపై కూడా కోర్టు మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇంతకీ మహిళా పోలీసులు అసలు పోలీసులేనా.. వారికి ఆశపెట్టి, కోర్టు తీర్పుల పేరు చెప్పి, అలా వదిలేయడం ఎవరికి మంచిది..? అధికారుల తెలివి ఏమైంది.

పోలీస్ విభాగంలో మహిళలైనా, పురుషులైనా శారీరక దారుఢ్య పరీక్షలు పాసవ్వాల్సిందే. కానీ మహిళా శిశు సంరక్షణ కార్యదర్శుల పేరుతో సచివాలయ పోలీసులుగా రిక్రూట్ అయినవారికి ఇలాంటి పరీక్షలు పెట్టలేదు. కేవలం వారు రాత పరీక్ష ఆధారంగా వచ్చారు. మరి వారిని డిపార్ట్ మెంట్ లో కలిపితే శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించాలా వద్దా. పోనీ ఇకపై శారీరక దారుఢ్య పరీక్షలు లేకుండానే మహిళా పోలీసుల్ని నియమించాలని ప్రభుత్వం అనుకుంది అనుకోండి.

మరి కొత్తగా ఇచ్చిన జీవోల్లో ఇకపై వచ్చేవారికి ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్ష కూడా ఉంటుంది అని చెప్పడం దేనికి. ఇక్కడితో ఈ తప్పుని సరిదిద్దుకుని, ఇకపై తప్పు చేయము అని చెప్పాలనుకుంటున్నారా..? తమ తప్పు తాము ఒప్పేసుకుంటే కోర్టులు చూస్తూ ఎందుకు ఊరుకుంటాయి..? లాజిక్ తీసి కడిగేస్తాయి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నట్టు అర్థమవుతోంది. పోనీ ప్రభుత్వానికి అంత పట్టుదలే ఉంటే.. శారీరక దారుఢ్య పరీక్షల్లో పాసయినవారిని డిపార్ట్ మెంట్లోకి తీసుకుని, మిగతా వారిని.. వారి ఇష్ట ప్రకారం సచివాలయాల పరిధిలోనే ఉంచొచ్చు కదా. దీనిపై కూడా అధికారుల్లో క్లారిటీ లేదు.

పదే పదే కోర్టు ముందు, అదీ ఇంత చిన్న విషయంలో చేతులు కట్టుకుని నిలబడటం ప్రభుత్వానికి మంచిదేనా. 2500 మంది నియామకాల్లోనే ఇన్ని జీవోలతో ఇంత అవస్థ పడుతున్నారే.. ఇలాంటి వాటి వల్ల పాలనపై ప్రభుత్వం దృష్టిపెట్టగలదా..? మహిళా పోలీసులకు జవాబుదారీ ఎవరు..? కోర్టు తీర్పులు ఎలా వచ్చినా, అధికార పక్షానికి చెందిన పత్రికలో తమకి అనుకూల వ్యాఖ్యానాలే రాసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో అవి కూడా ప్రజాభిప్రాయాన్ని మార్చలేవు. ఇలాంటి విషయాల్లో పంతాలు కట్టిపెడితేనే పాలనపై దృష్టి పెట్టే అవకాశముంది.