అక్రమ సంబంధం.. బ్లాక్ మెయిల్.. ఆత్మహత్య

ఇలాంటి హెడ్డింగ్ చూస్తే ఎవరైనా 'పాపం ఎవరో అమ్మాయి' అనుకుంటాం. కానీ ఇక్కడ రివర్స్ లో జరిగింది. అక్రమ సంబంధంలో మహిళ బ్లాక్ మెయిల్ కు పాల్పడింది. దీంతో సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.…

ఇలాంటి హెడ్డింగ్ చూస్తే ఎవరైనా 'పాపం ఎవరో అమ్మాయి' అనుకుంటాం. కానీ ఇక్కడ రివర్స్ లో జరిగింది. అక్రమ సంబంధంలో మహిళ బ్లాక్ మెయిల్ కు పాల్పడింది. దీంతో సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లాలో జరిగింది ఈ ఘటన.

జిల్లాలోని రాయదుర్గంలో స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతుంటాడు పృధ్వీ. అతడికి దగ్గర్లో ఉన్న ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పృధ్వీకి పెళ్లయింది, ఆ యువతికి కూడా పెళ్లయింది. కానీ ఇద్దరూ కలిశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అయితే ఇక్కడే వ్యవహారం తేడా కొట్టింది.

పృధ్వీతో చనువుగా ఉన్న ఫొటోలు, వీడియోలు అన్నింటినీ సేవ్ చేసింది వివాహిత. చివరికి కాల్ రికార్డింగ్స్ కూడా పెట్టుకుంది. వాటి ఆధారంగా పృథ్విపై బ్లాక్ మెయిల్ కు దిగింది. కొన్ని రోజులు ఓపిక పట్టిన పృథ్వి, ఇక భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు యువతి కూడా రివర్స్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అక్కడితో ఆగని వివాహిత, ఎస్పీని కలిసి కూడా ఈ విషయంపై కంప్లయింట్ చేసింది. దీంతో ఇద్దర్నీ పంచాయతీకి పిలిచారు ఎస్పీ. ఈ క్రమంలో పృథ్వీతో మాట్లాడేందుకు రమ్మంది వివాహిత. కానీ పృథ్వీ కాల్ ఎత్తలేదు. ఓ వ్యక్తిని కూడా పంపించి రమ్మని చెప్పింది. రోజురోజుకు యువతి వేధింపులు ఎక్కువ అవ్వడంతో.. పృథ్వి ఈ విషయాన్ని తన భార్య ముందుంచాడు.

బంధువుల ఇంట్లో పెళ్లికి సిద్ధమౌతున్న పృధ్వి భార్య, భర్తను సముదాయించింది. పెళ్లి తర్వాత వెళ్లి మరోసారి పోలీసుల్ని కలుద్దామని ఓదార్చింది. ఆమె అలా పెళ్లికి వెళ్లగానే, ఇటు పృథ్వి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహిత వేధింపుల వల్లనే తన భర్య ఆత్మహత్యకు పాల్పడ్డాడని, పృధ్వి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.