ఏపీ బీజేపీపై క‌ర్నాట‌క ఎఫెక్ట్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. క‌ర్నాట‌క‌లో ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకున్న బీజేపీ… సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై దృష్టి సారిస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌ర్నాట‌క ఎఫెక్ట్ ఏపీ బీజేపీపై కూడా పడిన‌ట్టే క‌నిపిస్తోంది. పొత్తుల‌పై ఏపీ బీజేపీ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. క‌ర్నాట‌క‌లో ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకున్న బీజేపీ… సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై దృష్టి సారిస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌ర్నాట‌క ఎఫెక్ట్ ఏపీ బీజేపీపై కూడా పడిన‌ట్టే క‌నిపిస్తోంది. పొత్తుల‌పై ఏపీ బీజేపీ నేత‌ల మాట తీరులో మార్పు క‌నిపిస్తోంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ కుటుంబ‌, అవినీతి పార్టీల‌తో పొత్తులేంట‌ని లెక్క‌లేకుండా మాట్లాడిన బీజేపీ నేత‌లు, ఇప్పుడు స‌న్నాయి నొక్కులు నొక్క‌డం గ‌మ‌నార్హం.

బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య పొత్తు వుంటుంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ అభిప్రాయాన్ని కూడా ప‌వ‌న్‌క‌ల్యాణే చెప్ప‌డం రాజ‌కీయ చ‌ర్చ‌కు దారి తీసింది. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు ఒకే ర‌కంగా స్పందించ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ వ్య‌తిరేక ఓటు చీల‌కూడ‌ద‌నే ప‌వ‌న్ ప్ర‌తిపాద‌న‌పై సోము, జీవీఎల్ స్పంద‌న‌లు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.

ప‌వ‌న్ ప్ర‌తిపాద‌న‌ల‌ను జాతీయ నాయ‌క‌త్వం దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు ఇద్ద‌రు నేత‌లు వేర్వేరుగా మాట్లాడుతూ చెప్పారు. పొత్తులు పెట్టుకోవాలా? వ‌ద్దా? అనేది జాతీయ నాయ‌క‌త్వ‌మే తుది నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని వారు అన్నారు. కేవ‌లం జాతీయ నాయ‌క‌త్వం ఆదేశాల‌ను మాత్ర‌మే తాము పాటిస్తామ‌ని చెప్ప‌డం విశేషం. ఇంత‌కాలం వైసీపీ, టీడీపీల‌పై దూకుడుగా మాట్లాడిన మాట‌ల నేత‌ల స్వరాల్లో మార్పు రావ‌డం గ‌మ‌నార్హం.

కుటుంబ‌, అవినీతి పార్టీలంటూ మ‌డిక‌ట్టుకుని కూచుంటే అస‌లుకే మోసం వ‌స్తుంద‌ని, కేంద్రంలో అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయానికి వ‌చ్చార‌ని చెబుతున్నారు. అందువ‌ల్లే కేంద్ర నాయ‌క‌త్వంపై భారం మోపి, క్షేత్ర‌స్థాయిలో బీజేపీని బ‌లోపేతం చేసే ప్ర‌య‌త్నాల్లో తామున్నట్టు ఆ పార్టీ నేత‌లు అంటున్నారు.