టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఏపీ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న కరకట్టపై గెస్ట్‌హౌస్‌ను ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్‌మెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని సీఐడీ కోరడం, ప్రభుత్వం వెంటనే స్పందించడం అంతా నాటకీయంగా సాగుతోంది.
కరకట్టపై లింగమనేని రమేశ్ అక్రమంగా గెస్ట్‌హౌస్ కట్టారని, బాబు బినామీ అని వైసీపీ చాలా కాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఉరుములు మెరుపులు లేకుండా పిడుగు పడ్డట్టుగా లింగమనేని గెస్ట్‌హౌస్‌ను ప్రభుత్వం అటాచ్ చేయడం… అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య సాగుతున్న వార్‌కు పరాకాష్టగా చెప్పొచ్చు.
స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్‌ను ఏపీ సర్కార్ అటాచ్ చేయడం కీలక పరిణామమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబును గెస్ట్ హౌస్ నుంచి ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం తర్వాత అడుగులు వేయనున్నట్టు చర్చకు తెరలేచింది.
సీఎంగా చంద్రబాబు, మంత్రిగా నారాయణ ఉన్నప్పుడు పదవులను దుర్వినియోగం చేసి, క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారనే కేసుల నేపథ్యంలో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ప్రభుత్వ వాదన ఏంటంటే… గత చంద్రబాబు ప్రభుత్వం సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో అక్రమాలకు పాల్పడి, అందుకు ప్రతిఫలంగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ దక్కించుకున్నారని చెబుతోంది.
అలాగే ఏపీ సీఐడీ విచారణలో చట్టాలను, కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలింది. లింగమనేని కోసం రాజధానిలో మాస్టర్ ప్లాన్‌ను కూడా మార్చేశారనేది జగన్ ప్రభుత్వ వాదన. అదే విషయాన్ని సీఐడీ కూడా చెబుతోంది. చంద్రబాబు నివాసం వుంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసిన నేపథ్యంలో పరిణామాలు ఎలా వుంటాయోనన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.