టీమిండియాకు ఫాస్ట్ బౌల‌ర్ కెప్టెన్ అవుతాడా?

ఒక‌వైపు టీమిండియాకు పూర్తి స్థాయిలో కొత్త కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ కుదురుకోవాల్సి ఉంది. ర‌క‌ర‌కాల మార్పులు చేర్పుల త‌ర్వాత రోహిత్ కు ప‌గ్గాలు ద‌క్కుతున్నాయి. అయితే రోహిత్ వ‌య‌సు రీత్యా చూసుకున్నా.. అత‌డి…

ఒక‌వైపు టీమిండియాకు పూర్తి స్థాయిలో కొత్త కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ కుదురుకోవాల్సి ఉంది. ర‌క‌ర‌కాల మార్పులు చేర్పుల త‌ర్వాత రోహిత్ కు ప‌గ్గాలు ద‌క్కుతున్నాయి. అయితే రోహిత్ వ‌య‌సు రీత్యా చూసుకున్నా.. అత‌డి కెరీర్ మరెన్ని సంవ‌త్స‌రాలు కొన‌సాగుతుంద‌నేది ఒక ధ‌ర్మ‌సందేహం. దీంతో రోహిత్ త‌ర్వాత ఎవ‌రు అనే చ‌ర్చ కూడా ఉంది. 

ఈ అంశంపై మాజీ కెప్టెన్ కొహ్లీ త‌న హ‌యాంలోనే స్పందించాడ‌ట‌. రోహిత్ కు కెప్టెన్సీ వ‌ద్ద‌ని, త‌న క‌న్నా వ‌య‌సులో పెద్ద‌వాడైన రోహిత్ క‌న్నా, త‌న కన్నా చిన్న వ‌య‌సు ఆట‌గాడికి కెప్టెన్సీ ఇవ్వాలంటూ కొహ్లీ బీసీసీఐ పై అప్ప‌ట్లోనే ఒత్తిడి తెచ్చాడ‌ట‌. అయితే బోర్డు మాత్రం రోహిత్ వైపుకే మొగ్గు చూపింది.

ఇక రోహిత్ త‌ర్వాత ఎవ‌ర‌నే అంశంలో కేఎల్ రాహుల్ పేరు వినిపించినా, రాహుల్ కు అవ‌కాశం ద‌క్కిన‌ప్పుడు వ‌ర‌స‌గా ఓట‌ములే ఎదుర‌య్యాయి. ఇక మ‌రో యువ ఆట‌గాడు పంత్ పేరు కూడా కెప్టెన్సీ విష‌యంలో వినిపిస్తోంది. రోహిత్ కు కాకుండా పంత్ కు టెస్ట్ కెప్టెన్సీ అప్ప‌గించాల్సింద‌ని కొంద‌రు మాజీ లు వాదించారు. అయితే పంత్ కు ఆ అవ‌కాశం ద‌క్క‌లేదు.

క‌నీసం రోహిత్ కు డిప్యూటీ గా కూడా పంత్ కు అవ‌కాశం ద‌క్క‌లేదు. ఇప్పుడు జ‌ట్టుకు వైస్ కెప్టెన్ గా బుమ్రా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో ఈ 28 యేళ్ల ఆట‌గాడు ముందు ముందు టీమిండియా కెప్టెన్ అవుతాడా.. అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం.

టీమిండియాకు క‌పిల్ త‌ర్వాత ఏ బౌల‌ర్ కూడా పూర్తి స్థాయిలో కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌లేదు. అనిల్ కుంబ్లే అనుసంధానంగా కొన్నాళ్ల పాటు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు. ద్రావిడ్ త‌ప్పుకున్న త‌ర్వాత ధోనీ చేతుల్లో జ‌ట్టును పెట్టే ముందు కుంబ్లే కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు. 

ఇటీవ‌లే ఆస్ట్రేలియా పూర్తి స్థాయి కెప్టెన్ గా ఒక ఫాస్ట్ బౌల‌ర్ కు ప‌గ్గాలిచ్చింది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ ల‌కు పేస్ బౌల‌ర్లు కెప్టెన్లుగా వ్య‌వ‌హ‌రించిన చ‌రిత్ర ఉంది. టీమిండియాకు మాత్రం ఫాస్ట్ బౌల‌ర్ల‌లో క‌పిల్ త‌ర్వాత అలాంటి పోటీకి కూడా ఎవ్వ‌రూ రాలేదు. మ‌రి బుమ్రా ఆ లోటును భ‌ర్తీ చేసే స్థాయికి ఎదుగుతాడేమో!