ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య ప్రారంభం అయ్యింది. ఉక్రెయిన్ లోని రెండు నగరాల్లోకి రష్యన్ సైన్యం ప్రవేశించింది. మిస్సైళ్ల దాడి ద్వారా సైనిక చర్యను మొదలుపెట్టింది రష్యా.
ఈ సందర్భంగా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించాడు. ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే, అది ఎన్నడూ చూడనంత తీవ్రమైన ప్రతిస్పందనను ఎదుర్కొనాల్సి ఉంటుందని కూడా పుతిన్ హెచ్చరించడం గమనార్హం.
ఇక రష్యన్ సైనిక చర్యను యూరోపియన్ దేశాలు తప్పు పడుతున్నాయి. ఈ అంశంపై ఈయూ స్పందిస్తూ ఉక్రెయిన్ వైపు నుంచి ఎలాంటి ఉద్రిక్తత లేకపోయినా, ఉక్రెయిన్ రెచ్చగొట్టకపోయినా రష్య ఈ సైనిక చర్యకు దిగడాన్ని ఈయూ తప్పు పట్టింది.
ఈ అంశంపై బ్రిటన్ ప్రధాని స్పందిస్తూ… తక్షణమే తమ స్పందన ఉంటుందన్నారు. మిత్రపక్షదేశాలతో చర్చించి ఈ అంశంపై తమ స్పందన ఉంటుందని ప్రకటించారు.
మరోవైపు ఉక్రెయిన్ మాత్రం ధీమా స్పందించింది. రష్యా దాడిని ఎదుర్కొంటామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అన్నారు. తాము అన్నింటికీ సన్నద్ధంగా ఉన్నామని, తాము గెలుస్తామనే ధీమాను కూడా ఆయన వ్యక్తీకరించారు.