కాలు దువ్వుతున్న కేసీఆర్ కు జగన్ తో చెక్?

కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారుపై ఒంటికాలితో లేస్తున్న కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఓవైపు థర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్ రాజకీయ సమీకరణాలు చేస్తుంటే, ఇటు బీజేపీ తమకు…

కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారుపై ఒంటికాలితో లేస్తున్న కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఓవైపు థర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్ రాజకీయ సమీకరణాలు చేస్తుంటే, ఇటు బీజేపీ తమకు అనుకూలంగా ఉన్న పార్టీలతో పాటు ప్రస్తుతం తటస్థంగా ఉన్న పార్టీలను అక్కున చేర్చుకునే వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు, ఏపీ నుంచి జగన్ ను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో కేంద్రం ఉన్నట్టు కనిపిస్తోంది. 

కేసీఆర్-జగన్ కలవకుండా చేయడమే ప్రస్తుతం బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. దీని కోసమే ఢిల్లీ నుంచి ఫీలర్లు వదులుతోంది. మార్చి 10వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు అంటూ లీకులిస్తోంది. ఇదే కనుక నిజమైతే అది జగన్ కు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరం. సరిగ్గా ఇక్కడే జగన్ మంచి నిర్ణయం తీసుకోవాలి. పోలవరం పెండింగ్ నిధులతో పాటు.. ఏపీకి కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలి. అవసరమైతే కేంద్రంతో ప్రత్యేక హోదాపై ఓ ప్రకటన కూడా చేయిస్తే, ఇక జగన్ కు తిరుగుండదు.

శత్రువు బలపడేలోగా.. అతడి బలహీనత తెలుసుకుని దెబ్బకొట్టాలనే రాజతంత్రం బాగా తెలిసిన వారు బీజేపీ అధిష్టానంలో ఉన్నారు. మోదీ-షా ద్వయం ఇప్పటి వరకూ అన్ని విజయాల్ని ఇలాగే సొంతం చేసుకుంది. కొన్నిచోట్ల విజయం దక్కకపోయినా తమ వ్యూహాలతో తమదే పైచేయి అని నిరూపించుకుంది. ఈసారి కేసీఆర్ రూపంలో బీజేపీకి ప్రమాదం పొంచి ఉంది. 

కేసీఆర్ తెలివిగా థర్డ్ ఫ్రంట్ అంటూనే, కాంగ్రెస్ తో సయోధ్య కోరుకుంటున్నారు. కుదిరితే థర్డ్ ఫ్రంట్, లేకపోతే కాంగ్రెస్ తో కూడిన బీజేపీయేతర ఫ్రంట్.. ఇదీ కేసీఆర్ వ్యూహం. అంటే ఎన్నికల ముందు వరకూ ఎవరు కొట్టుకున్నా.. ఎన్నికల తర్వాత మాత్రం అందరూ కలసిపోతారు, బీజేపీని వ్యతిరేకిస్తారు.

ఈ వ్యూహంతో బీజేపీకి పెద్ద చిక్కొచ్చిపడింది. థర్డ్ ఫ్రంట్ అనేది బీజేపీ, కాంగ్రెస్ కి సమదూరంలో ఉంటే.. కమలనాథులకు భలే సంతోషం. కానీ కేసీఆర్ అంతకు మించి ప్లాన్ వేశారు, అందుకే బీజేపీ నేతలు కూడా దానికి విరుగుడు కనిపెడుతున్నారు. జగన్ లాంటి వారిని దువ్వేందుకు రెడీ అవుతున్నారు.

జగన్ అంత అమాయకుడా..?

మరీ బీజేపీ బుట్టలో పడేంత అమాయకుడు కాదు జగన్. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్నిసార్లు బీజేపీ వైపు ఉండాల్సిన అవసరం కూడా రావొచ్చు. అందులోనూ ఇప్పుడు ఏపీ ఆర్థిక కష్టాల్లో ఉంది. దీన్నుంచి బయటపడాలన్నా, మౌలిక సదుపాయాల కోసం కేంద్రం నిధులివ్వాలన్నా, బీజేపీకి దగ్గరవ్వాల్సిందే. దీని వల్ల ఏపీలో బీజేపీకి లాభం లేకపోయినా, కేసీఆర్ ని ఎదుర్కోవడానికి కావాల్సిన బలం చేకూరుతుంది.

17 లోక్ సభ స్థానాలున్న తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్, బీజేపీని టార్గెట్ చేస్తే.. 25 ఎంపీ సీట్లున్న ఏపీకి సీఎం గా ఉన్న జగన్ తో చెక్ పెట్టాలని చూస్తోంది బీజేపీ. ఈ ప్లాన్ ఎవరికి లాభం, ఎంత లాభం.. అనేదానిపై ముందు ముందు మరింత క్లారిటీ వస్తుంది.