ఊహాగానాలే ఇప్పుడు అసలు సిసలు వార్తలు

గతంలో పుకార్లను పత్రికల్లో ప్రచురించాలంటే యాజమాన్యాలు ఆలోచించేవి. ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టి వేసేవారు. కొన్నాళ్ల తర్వాత ఎవరో గాలి గన్నారావు అన్నాడని పుకార్లు ప్రచురించేవారు. ఇప్పుడు కాలం మారింది. సోషల్ మీడియాతో…

గతంలో పుకార్లను పత్రికల్లో ప్రచురించాలంటే యాజమాన్యాలు ఆలోచించేవి. ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టి వేసేవారు. కొన్నాళ్ల తర్వాత ఎవరో గాలి గన్నారావు అన్నాడని పుకార్లు ప్రచురించేవారు. ఇప్పుడు కాలం మారింది. సోషల్ మీడియాతో పోటీ పడాలంటే పత్రికల్లో కూడా ఊహాగానాలే వార్తలవుతున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా చీకట్లు అలముకున్నాయి, కరెంట్ పోతోంది అనేది కూడా ఈ టైపు వార్తే. ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రభుత్వ ఉద్యోగులెవరికీ జీతాలు పడవని, కేంద్రం నిఘా పెట్టిందని.. ఇలా రకరకాల ఊహాగానాలన్నీ మెయిన్ పేజీ హెడ్డింగులైపోతున్నాయి. అందుకే ఇప్పుడు పత్రికల్లో వచ్చేవి వార్తలు కాదు, పరువునష్టం కేసులకి మూలాలు. ఊహాగానాలకు ఊతమిచ్చే వాక్యాలు.

తాజాగా లోకేష్ విశాఖ కోర్టుకి వస్తున్నారు. తనపై సాక్షి పత్రికలో అసత్య కథనం వచ్చిందని 75కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేశారు లోకేష్. ఆ కేసు విచారణ కోసం ఆయన విశాఖలోని 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టుకు హాజరు కాబోతున్నారు. పాతిక లక్షల టిఫిన్ బిల్లులు పెట్టడం నిజంగా విచిత్రమే. దానిపై వార్తలు రావడం విశేషమేమీ కాదు. 

కానీ అవి కేవలం ఆరోపణలేనా, దానికి సంబంధించిన ఆధారాలున్నాయా అనేది అనుమానం. ఎవరివో వాట్సప్ ఫార్వార్డ్ మెసేజ్ లు, ఏదో ఒక వెబ్ సైట్ రాసేస్తే, దాన్ని పత్రికలు హైలెట్ చేసి వార్తలు ఇస్తున్నాయి. తీరా ఇలా కేసులు, రాజకీయ కక్షలు అంటూ కొనసాగింపు ఎపిసోడ్ లు మొదలవుతున్నాయి.

ఏపీలో అంధకారం అలముకుంటోంది, చీకట్లు కమ్ముకున్నాయి, దీనికి కారణం జగనేనంటూ టీడీపీ అనుకూల మీడియా కోడై కూసింది. సాంకేతిక కారణాలతో కృష్ణపట్నం, విజయవాడ, విశాఖ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పనిచేయకపోవడం వల్ల 2 రోజుల పాటు ఏపీ ప్రజలు ఇబ్బంది పడినమాట వాస్తవమే, అయితే ఆ తర్వాత కూడా కథనాలు ఆగలేదు. దీంతో ప్రభుత్వ అధికారులు ఈనాడు, ఆంధ్రజ్యోతిపై కేసు వేస్తామని హెచ్చరించారు. మళ్లీ ఇక్కడ రాజకీయ వేధింపులంటూ గొడవ మొదలైంది.

గతంలో పరువునష్టం కేసులనేవి ఎప్పుడో నూటికో కోటికో వెలుగు చూసేవి. కానీ ఇప్పుడు పత్రికలు విలువల్ని గాలికొదిలేశాయి, గాలి వార్తలతోనే కాలం గడుపుతున్నాయి. ఆ మాటకొస్తే.. ప్రతి వార్తపై ఇప్పుడు పరువునష్టం కేసు వేయొచ్చు, ప్రత్యేక కథనాల పేరుతో వండివార్చేవన్నీ ఇలాగే ఉంటున్నాయి. ఈ సంస్కృతి ఇక్కడితో ఆగుతుందా..?  ఇంకా పత్రికలు, నాయకులు మరింత దిగజారుతారా..?