బాలకృష్ణకు ఉన్న ధైర్యం.. పవన్ కి లేదా..?

ఆమధ్య బాలకృష్ణ.. ఏపీ సీఎం మీటింగ్ కి ఎందుకెళ్లలేదంటే.. నాకవసరం లేదన్నారట. పైగా అన్ని ఆంక్షలు పెట్టినా, టికెట్ రేట్లు తక్కువగా ఉన్న టైమ్ లోనే నా అఖండ హిట్టైంది, ఇక నాకెందుకీ గొడవ…

ఆమధ్య బాలకృష్ణ.. ఏపీ సీఎం మీటింగ్ కి ఎందుకెళ్లలేదంటే.. నాకవసరం లేదన్నారట. పైగా అన్ని ఆంక్షలు పెట్టినా, టికెట్ రేట్లు తక్కువగా ఉన్న టైమ్ లోనే నా అఖండ హిట్టైంది, ఇక నాకెందుకీ గొడవ అంటూ లైట్ తీసుకున్నారు. మరిప్పుడు పవన్ కల్యాణ్ చేస్తున్నదేంటి..? అఖండ టైమ్ కి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి..? అఖండ హిట్ కొడితే, భీమ్లా హిట్ కొట్టలేదా..? రెండు సినిమాలూ హిట్ అయితే కలెక్షన్లలో తేడా ఎందుకొస్తుంది..? ఏపీ ప్రభుత్వంపై పవన్ ఏడుపు ఎంతవరకు నిజం..?

బెనిఫిట్ షో ల ట్రెండ్ ఇటీవల మొదలైంది. బెనిఫిట్ షో లు లేకపోతే, వారం రోజులపాటు టికెట్ రేట్లు అధికారికంగా పెంచుకునే వెసులుబాటు లేకపోతే సినిమా నిర్మాతకు ఇబ్బంది అనే ప్రచారం మొదలైంది. అంటే పరోక్షంగా దోపిడీకి ప్రభుత్వమే అనుమతివ్వాలా..? రోజుకి నాలుగు ఆటలు, ఒకటే టికెట్ రేట్లు ఉన్నప్పుడు సినిమాలు ఆడలేదా, నిర్మాతలు బతకలేదా..? మొన్నటిదాకా పైరసీ అన్నారు, ఇప్పుడు పైరసీ కూడా అక్కర్లేదు, ఓటీటీలకి నిర్మాతలే అమ్మేసుకుంటున్నారు. మరిక్కడ లాభాలు పెరగలేదా..? ఇంకా జనం జేబులో నుంచి తేరగా డబ్బులు రావాలంటే ఎలా..? అభిమానుల కష్టార్జితాన్ని పిండేసుకోవాలనుకోవడం ఎందుకు..?

బెనిఫిట్ షో లు లేకపోతే అభిమానులు బాధపడతారని, థియేటర్ల వద్ద గొడవలైపోతాయని, అసలు ప్రపంచమే ఆగిపోతుందన్న స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఎంత పెద్ద హిట్ సినిమా అయినా వారం తర్వాత థియేటర్ల ఓనర్లు ఈగలు తోలుకునే పరిస్థితి..? ఆమాత్రం సినిమాలకు అంత హడావిడి ఎందుకు..? కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసేది లాభాల కోసమే కానీ, ప్రజల్ని ఉద్ధరించడానికి కాదు కదా..? మరిక్కడ టికెట్ రేట్లు అడ్డదిడ్డంగా పెంచుకుంటామనడంలో లాజిక్ ఏంటి..?

ఇప్పటికే చిరంజీవి టీమ్ సీఎం జగన్ ని కలిసింది. టికెట్ రేట్ల వ్యవహారంలో ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. కొత్త సినిమా వస్తుంది కాబట్టి, థియేటర్ల వద్ద అధికారులు తనిఖీలు చేపట్టారు. అందులో వింత లేదు, విశేషం లేదు. అధికారులు తమ పని తాము చేసుకుంటే దాన్ని కక్షసాధింపు అనే కోణంలో ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు పవన్ కల్యాణ్.

నిజంగా అభిమానులపై ప్రేమ ఉంటే, జనసేన పార్టీ కోసం కష్టపడేవారిపై గౌరవం ఉంటే.. తన సినిమాని జనసేన కార్యకర్తలకి, వారి కుటుంబాలకి ఉచితంగా చూపించొచ్చు కదా. కానీ ఇక్కడ కష్టపడకుండా ఓట్లు రావాలి, అటు సినిమాలతో తనకి కోట్లు కావాలి. ఇదీ జనసేనాని సిద్ధాంతం. సరిగ్గా సినిమా టైమ్ లో మళ్లీ రాజకీయ రచ్చ మొదలవుతోంది. ప్రజల్లోని భావోద్వేగాల్ని రెచ్చగొట్టి సినిమాకి పబ్లిసిటీ పెంచుకుంటున్నారు పవన్.

అఖండ సినిమా రిలీజైనప్పుడు ఏపీ థియేటర్లలో ఎలాంటి పరిస్థితులున్నాయో, ఇప్పుడు అవే పరిస్థితులున్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు కరోనా ఆంక్షలు కూడా లేవు. మరి పవన్ ఎందుకు భయపడుతున్నారు?