మాజీ మంత్రి వివేకా హత్య కేసులో రోజుకో మలుపు. థ్రిల్లర్ సినిమాను తలపించేలా ట్విస్టులు. వివేకా హత్య కేసు విచారణలో ఎత్తుకు పైఎత్తులు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన నాలుగో నిందితుడు దస్తగిరి వరుస వాంగ్మూలాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో బాధితులు, నిందితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కుడిఎడమ అన్నట్టు, సొంత వాళ్లు కావడం విశేషం.
వివేకా కేసును అడ్డం పెట్టుకుని జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు సహజంగా ప్రత్యర్థులు అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఇందుకు సీబీఐ విచారణ పరోక్షంగా సహకరిస్తోందన్న అభిప్రాయాలు లేకపోలేదు. దస్తగిరి, వాచ్‌మన్ రంగయ్య స్టేట్మెంట్లకు తోడు, గత రెండు రోజులుగా సీఐ శంకరయ్య, డీఎస్పీ ఆర్.వాసుదేవన్ వాంగ్మూలాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా సీఐ శంకరయ్య వాంగ్మూలం జగన్ వ్యతిరేకులకు ఆయుధంగా మారింది.
సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ ఉద్దేశపూర్వకంగానే తమకు నష్టం కలిగించేలా రాజకీయ నేతలా విచారిస్తున్నారని వైసీపీ పెద్దలు ఆరోపిస్తున్నారు. మరోవైపు సాక్షి పత్రిక తన వంతు బాధ్యతగా రామ్‌సింగ్ పోకడలపై ఇవాళ ఆసక్తికర కథనాలు రాసుకొచ్చింది. సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ తాను చెప్పినట్టు విచారణలో ఒప్పుకోవాలని బెదిరిస్తున్నారని సీఐ శంకరయ్య, డీఎస్పీ వాసుదేవన్‌లు ఏకంగా కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారనే సంగతుల్ని నేడు వెలుగులోకి తేవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘నిన్ను ఉరి తీయాలి.. నీపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తా’ అంటూ గతంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్యను సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ బెదిరించారని సాక్షి రాసుకొచ్చింది. అయితే తాను చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు సీఐ నిరాకరించడంతోనే రామ్‌సింగ్ బెదిరింపులకు పాల్పడ్డారని సదరు కథనంలో ప్రస్తావించారు. అయినా సరే, సీఐ చెప్పినట్టుగా తమకు నచ్చిన విషయాలను స్టేట్మెంట్గా రాసుకున్నారని కథనంలో పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది.
రామ్‌సింగ్ వేధింపులతో విసిగిపోయిన సీఐ శంకరయ్య ఆయనపై కడప జిల్లా ఎస్పీకి 2021, అక్టోబర్ 7న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని జగన్ అనుకూల పత్రిక రాయడం గమనార్హం. అయితే తాము సీఐని బెదిరించిన విషయాన్ని, ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని దాచివేసి.. సీఐ పేరిట తాము రాసుకున్న స్టేట్మెంట్ను సీబీఐ మంగళవారం మీడియాకు లీకు ఇచ్చి హడావుడి చేసింది. ఇదిలా వుండగా గత ఏడాది అక్టోబర్‌లో కడప ఎస్పీకి ఫిర్యాదు చేస్తే… నాడు ఎందుకని కనీసం తన సొంత పత్రికలో కూడా రాయలేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
సీబీఐ అధికారి ప్రవర్తనతో తీవ్ర మనస్తాపం చెందిన డీఎస్పీ వాసుదేవన్ ఈ విషయంపై కడప ఎస్పీకి 2021, అక్టోబర్ 10న ఫిర్యాదు చేశారని కథనంలో పేర్కొన్నారు. సీబీఐ అధికారి రామ్‌సింగ్ నిజాలను నిగ్గుతేల్చడం మీద కాకుండా.. తాను ముందుగా అనుకున్నదే చెప్పించేందుకే యత్నిస్తున్నారని వైసీపీ ఆరోపణ. మరి కడప ఎస్పీకి రామ్‌సింగ్‌పై సీఐ, డీఎస్పీల ఫిర్యాదులను ఇంత కాలం దాచి పెట్టడానికి కారణం ఏంటి?
ఇప్పుడు తెరపైకి తేవడం ద్వారా వాటికి విశ్వసనీయత ఎంత? ముఖ్యంగా తమ వాంగ్మూలను సీఐ, డీఎస్పీ నేడు ఎందుకు ఖండించడం లేదు? వారు జగన్ ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారులే కదా? ఈ నేపథ్యంలో ఎల్లో మీడియాలో వివేకా మర్డర్‌కు సంబంధించి వస్తున్న కథనాలకు కౌంటర్ ఇచ్చేందుకు సాక్షి రాస్తున్న కథనాల్లో లాజిక్ మిస్ అవుతోంది. మర్డర్ కేసులో అధికారి పార్టీలో పూర్తిగా వ్యూహం లోపించినట్టు… ప్రభుత్వ పెద్దలు, సాక్షి కథనాలు చదవుతుంటే అర్థమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.