సీబీఐ అంటే.. దేశంలోనే అత్యున్నత స్థాయిగల నేరవిచారణ సంస్థ. అదే సమయంలో- తెలుగు రాష్ట్రాల్లోనే ఇటీవలి కాలంలో అత్యంత సంచలనమైన హత్య- మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యోదంతం. ఇంత సంచలనమైన హత్య గురించి, అంత పెద్ద విచారణ సంస్థ స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తు సాగిస్తూ ఉంటే.. ఎంతో పకడ్బందీగా, ఏం జరుగుతున్నదో ఎక్కడా రెండో కంటికి కూడా తెలియకుండా, రెండో చెవికి కూడా వినిపించకుండా సాగుతూ ఉంటుందని సాధారణంగా ఎవరైనా అనుకుంటారు?
కానీ, అదేంటోగానీ.. సీబీఐ విచారణలో సేకరిస్తున్న అంశాలన్నీ.. చాలా ఈజీగా ‘లీకైపోతున్నాయి’! పత్రికల్లో ప్రతిరోజూ ఒక కథనం వస్తుంది. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సీబీఐ విచారణలో ఎవరు ఏం చెప్పారో జస్ట్ ఇప్పుడే మాకు తెలిసిందంటూ.. ఏవో కొన్ని వివరాలను అందులో ప్రచురిస్తారు. అవన్నీ కూడా ఎంపీ అవినాష్ రెడ్డిని హత్యకు సూత్రధారిగా వేలెత్తి చూపించేలా ఉంటాయి.
అవినాష్ రెడ్డి తెరవెనుక నుంచి ఈ హత్యను చేయించారా? స్వయంగా ఈ హత్య చేశారా? అనేది ఎటూ విచారణలో తేలుతుంది. విచారణను తేల్చే పనిలో దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. అసలు ఇంతగొప్ప అత్యున్నత నేర విచారణ సంస్థ సీబీఐ దర్యాప్తులో వారికి అందుతున్న వివరాలు అంత ఈజీగా మీడియాకు ఎలా లీకైపోతున్నాయి.
ఈ విషయం సీబీఐ దర్యాప్తుకు సారథ్యం వహిస్తున్న ఘనులకు సిగ్గు వేయడం లేదా? సీబీఐ దర్యాప్తు స్వరూపానికే ఒళ్లంతా తూట్లు, బొక్కలు ఉన్నాయా? వారి దర్యాప్తులో ఎవరు ఏం చెప్పినా సరే.. ఏ వాంగ్మూలం ఇచ్చినా సరే.. ఆ సమాచారం వీజీగా బయటకు వెళ్లిపోతుంటుందా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. సీబీఐ తీరు మీదనే అనుమానాలు రేకెత్తేలా ఈ వ్యవహారాలు మారుతున్నాయి.
వివేకానందరెడ్డి హత్య వ్యవహారం మీద సీబీఐ దర్యాప్తు చేయించాలని జగన్ అప్పట్లోనే కోరారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తనే దర్యాప్తుకు ఆదేశించారు.
సీబీఐ దర్యాప్తు జరుగుతున్న సమయంలో అంతా పకడ్బందీగానే జరుగుతున్నట్టుగా అనిపించింది. కడప సెంట్రల్ జైలు ప్రాంగణంలో ఒక భవనాన్ని వారు విచారణ కేంద్రంగా మార్చుకుని ఈ హత్యోదంతానికి సంబంధించిన వారినందరినీ అక్కడకు పిలిపించి మాట్లాడారు. ఆ వ్యవహారం చాలా పకడ్బందీగా, గట్టి నిఘా మధ్య జరిగింది.
సీబీఐ ఉన్న భవనం పరిసరాల్లోకి కనీసం.. ఆ జైలు సిబ్బంది కూడా వెళ్లే అవకాశం కూడా ఇవ్వకుండా చాలా బాగానే నిర్వహించారు. వాంగ్మూలాలు వివరాలుసేకరించారు. అంతా బాగానే ఉంది. మరి అంత గొప్ప దర్యాప్తు సంస్థ సేకరించిన వివరాలు.. ఇంత ఈజీగా ఏదో డెయిలీ సీరియల్ లాగా.. ప్రతిరోజూ కొన్ని పేజీలు ఎలా బయటకు వస్తున్నాయి. పచ్చ మీడియాకు మాత్రమే ఆ వివరాలు ఎలా అందుతున్నాయి. ఇదే అసలైన సస్పెన్స్!
సీబీఐ చాలా నిజాయితీగానే దర్యాప్తు చేసి ఉండొచ్చు. నికార్సుగా నేరం చేసిన వాళ్లెవరో వాళ్లు తేల్చవచ్చు. కానీ.. ఇలా అధికారికంగా వాళ్లంతగా దర్యాప్తు పత్రాలు బయటపెట్టకుండా వివరాలు ‘లీక్’ అవుతూ ఉంటే.. సీబీఐ అనే వ్యవస్థకే సిగ్గు చేటు అని వారు తెలుసుకోవాలి. వారి చిత్తశుద్ధి ప్రజల్లో నవ్వుల పాలు అవుతుందని కూడా తెలుసుకోవాలి. నేరం చేసింది ఎవరనే అనుమానాలు తర్వాత.. అసలు దర్యాప్తు చేసేవారి మీదనే ప్రజల్లో అనుమానాలు పుట్టే పరిస్థితి రాకూడదు.