కొత్త ఆంక్షల్లేవ్ పవన్! రెచ్చిపోతే, పరువుపోతుంది!!

‘‘కావాలంటే మీరు నామీద కక్ష సాధించండి.. అంతే తప్ప ఇండస్ట్రీని బలిపెట్టే ప్రయత్నాలు చేయవద్దు’’ అని హీరో పవన్ కల్యాణ్ చాలా తరచుగా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. ‘‘నేను ఒక్కడినీ ధైర్యంగా మాట్లాడుతున్నాను.. మీరు…

‘‘కావాలంటే మీరు నామీద కక్ష సాధించండి.. అంతే తప్ప ఇండస్ట్రీని బలిపెట్టే ప్రయత్నాలు చేయవద్దు’’ అని హీరో పవన్ కల్యాణ్ చాలా తరచుగా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. ‘‘నేను ఒక్కడినీ ధైర్యంగా మాట్లాడుతున్నాను.. మీరు నా వెంట రాకపోతే, ముందు ముందు మీరే నష్టపోతారు’’ అంటూ ఇండస్ట్రీలోని మిగిలిన వారిని ఉద్దేశించి వెటకారమూ చేస్తుంటారు. 

అలాంటి పవన్ కల్యాణ్ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది. 25వ తేదీన భీమ్లానాయక్ థియేటర్లలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విధించిన ఆంక్షలు మళ్లీ ఒకసారి చర్చనీయాంశం అవుతున్నాయి. 

భీమ్లానాయక్ చిత్రం విడుదలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించిందంటూ వార్తలు వచ్చాయి. ఈ చిత్రం బెనిఫిట్ షో, అదనపు షోలు వేయరాదని ఆదేశించారు. టికెట్ రేట్లు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాల్సిందేనంటూ థియేటర్లకు నోటీసులు ఇచ్చారు. తహసీల్దార్లు, రెవెన్యూ అధికార్ల నిఘా ఉంటుందనికూడా వెల్లడించారు. జరిగింది ఇంతే. 

ఇందులో పవన్ కల్యాణ్ సినిమా కోసం ఏపీ ప్రభుత్వం ‘కొత్తగా’ విధించిన ఆంక్షలు ఏమున్నాయో అర్థం కావడం లేదు. బెనిఫిట్ షోలు, అదనపు షోలపై నిషేధం ఏపీలో ఎప్పటినుంచో అమల్లో ఉంది. తెలంగాణలో కూడా అంతే. అదనపు షోలు కావాలంటే.. ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలి. తెలంగాణలో చిత్ర యూనిట్ ఆ పని చేసింది. ఏపీలో ఆ ప్రయత్నం చేయలేదు. ఈగోకు పోయింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలనడం కూడా కొత్త సంగతి కాదు. ఎప్పటినుంచో ఉన్న రూల్ ను గుర్తు చేయడం మాత్రమే. 

అయితే మీడియా మాత్రం.. పవన్ కల్యాణ్ సినిమాపై ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లుగా సిగ్గుమాలిన రాతలు రాస్తుండడం గమనార్హం. పవన్ కల్యాణ్ సినిమా గనుక.. కొత్త ఆంక్షలు పెట్టి, ఇబ్బందిపెట్టాలని ప్రభుత్వం ఏ పనీ చేయడం లేదు. ఆ సంగతి అందరూ తెలుసుకోవాలి. ప్రజలకు ఇది అర్థం కాదు అనుకుని.. తన సినిమాను తొక్కేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదంటూ పవన్ కల్యాణ్ రెచ్చిపోయి, మెడ తోముకునే డైలాగులు మాట్లాడితే గనుక.. ఆయన పరువే పోతుంది తప్ప.. ఉపయోగం ఉండదు. 

పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ ధరలు పెంచుకునే విషయంలో సినీ ప్రతినిధుల రాయబారం తరువాత.. ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి ఉంది. పవన్ కల్యాణ్ కు.. నిర్మాతకు దక్కే ఆర్థిక ప్రయోజనం కంటె తన ఈగో ముఖ్యం గనుక.. అప్పటిదాకా ఆగకుండా రిలీజ్ చేయిస్తున్నారు. 

సో, ఆ సినిమా విషయంలో ధరల పెంపు సంగతి మరచిపోవాల్సిందే. అదనపు షో వేసుకోవాలని ఉంటే.. తెలంగాణలో లాగానే ఏపీలో కూడా ప్రభుత్వానికి ఒక వినతిపత్రం ఇచ్చి ఉండాల్సింది. వీరు అడిగి- ప్రభుత్వం తిరస్కరించి ఉంటే వారు ఆక్రోశం వెలిబుచ్చవచ్చు. అలాంటిదేమీ లేకుండానే.. ‘భీమ్లానాయక్ చిత్రంపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు’ అంటూ మీడియా తలాతోకా లేని వార్తలు రాస్తే.. అవి చూసి పవన్ రెచ్చిపోతే.. ఆయనకే పరువు తక్కువ.