బాలీవుడ్ లో ఐటమ్ గాల్స్ అంటూ.. ప్రత్యేకమైన పేర్ల ప్రస్తావన ఉన్న ట్రెండ్ అది. ఐటమ్ సాంగ్స్ లో నర్తించడానికి కొందరు నటీమణులు ఉండే వారు. బాలీవుడ్ లో దశాబ్దాల పాటు ఆ ట్రెండ్ కొనసాగింది. ప్రత్యేకించి 90 ల ఎండింగ్, 2000 సమయంలో కొందరు ఐటమ్ పాటల కోసమే ఉండేవారు. అదే వారి కెరీర్ అన్నట్టుగా ఉండేది.
సినిమాల్లో హీరోయిన్లుగా అవకాశాలు పొందుతున్న వారు అలా సింగిల్ పాటలో నర్తించడానికి నో చెప్పేవారు. అది తక్కువ తనం అనే భావన. 80లలో క్లబ్ సాంగ్స్ చాలా సినిమాల్లో ఉండేవి. వాటిల్లో నర్తించే వారిని బీ గ్రేడ్ నటీమణుల్లా చూసే సంప్రదాయం సర్వత్రా ఉండేది. 90లలో కూడా అదే ట్రెండే సాగింది. అరుదుగా మాత్రమే ఒకరిద్దరు హీరోయిన్లు ఒక పాటలో నర్తించే పరిస్థితి ఉండేది.
అలాంటి సమయంలో హీరోయిన్ గా తనకు అవకాశాలు ఉన్నా.. సింగిల్ సాంగ్స్ లకు సై అన్న తొలి తార సుస్మితా సేన్. మిస్ వరల్డ్ గా ఇమేజ్, హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నా.. కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అననీయండి, స్పెషల్ సాంగ్స్ అననీయండి..వాటిని చేస్తూ వచ్చింది సుస్మిత. ఈ విషయంలో అస్సలు వెనక్కు తగ్గలేదు.
సౌత్ లో కూడా షకలక బేబీ అంటూ సుస్మిత ఆడి, పాడింది. బాలీవుడ్ లో పలు ఐటమ్ సాంగ్స్ చేసింది. ఆ సమయంలో సుస్మిత కెరీర్ ను పాడు చేసుకుంటోందనే అభిప్రాయాలు వినిపించాయి. అదే సమయంలో బాలీవుడ్ ను కొందరు ఐటమ్ గాల్స్ ఏలారు. సౌత్ లో కూడా ఐటమ్ గాల్స్ గా కొంతమంది కెరీర్ చూసుకున్నారు. ప్రధాన పాత్రలు దక్కే హీరోయిన్లు మాత్రం వాటి జోలికి వెళ్లేలేదు.
ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ తో మొదలుకుని, టాలీవుడ్ వరకూ.. హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. టాప్ హీరోయిన్లు కూడా వీటికి సై అంటున్నారు. ఐటమ్ గాల్స్ అంటూ వేరే లేకుండా పోయారిప్పుడు! ఈ ట్రెండ్ కు మొదట స్వాగతం చెప్పింది సుస్మితనే! హీరోయిన్ గానే చేస్తా.. అనే ఇది లేకుండా, ఇప్పుడు టాప్ హీరోయిన్లు కూడా ఆలోచిస్తున్న తరహాలోనే ఇరవై యేళ్ల కిందటే ఆలోచించింది సుస్మిత.