Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: వలిమై

మూవీ రివ్యూ: వలిమై

టైటిల్: వలిమై
రేటింగ్: 1.5/5
తారాగణం: అజిత్ కుమార్, కార్తికేయ గుమ్మకొండ, హుమా కురేషి తదితరులు 
కెమెరా: నీరవ్ షా
ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి
సంగీతం (నేపథ్యం): గిబ్రాన్
సంగీతం (పాటలు): యువన్ శంకర్ రాజా
నిర్మాత: బోనీ కపూర్
దర్శకత్వం: హెచ్. వినోద్
విడుదల తేదీ: 24 ఫిబ్రవరి 2022

తమిళంలో "వలిమై" అంటే శక్తి అని అర్థం. చాలాకాలం తర్వాత బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నేరుగా ఒక తమిళ సినిమాని నిర్మించారు. తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదల చేసారు. 

అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని ప్రచారం కావడం, అజిత్ హీరోగా పోస్టర్ మీదుండడం కారణంగా తెలుగు ప్రేక్షకులకి కూడా దీని మీద ఆసక్తి కలిగింది. ట్రైలర్ కూడా యాక్షన్, క్రైం అంశాలతో గ్రిప్పింగ్ గా ఉండడం వల్ల చూడాలన్న ఆలోచన కూడా రేకెత్తించింది. పైగా ఆరెక్స్ హండ్రెడ్ ఫేం కార్తీక్ గుమ్మకొండ ఇందులో విలన్ గా చేసాడు. 

ఇన్ని అంశాలు, అంచనాల నడుమ హల్లోకి వెళ్తే ఎలా ఉందో చూద్దాం. 

అప్పట్లో "మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్" అని ఒక సినిమా వచ్చింది. సినిమా మొత్తం చేసింగ్ సీన్లే. బహుశా అలాంటి సినిమాలకి అభిమానయ్యుంటాడు ఈ చిత్ర దర్శకుడు. 

ముగ్గురు కొడుకుల్లో మధ్యలో వాడు ప్రయోజకుడయ్యి పోలీసాఫీసరవుతాడు. పెద్దవాడు తాగుబోతు, మూడో వాడు క్రిమినల్. ఈ సెటప్పులో మదర్ సెంటిమెంటు. ఇక పోలీసాఫీసర్ ట్రాకులో విసుగెత్తిచ్చేటన్ని చేసింగ్ సీన్లు. అదీ కథ. 

మనసుని తాకే సన్నివేశం గానీ డయలాగ్ కానీ ఒక్కటి లేదిందులో. మదర్ సెంటిమెంటు పేరుతో అరవ పైత్యం కనిపించింది. 

పాత సినిమాల్లోలాగా హీరోగారి ఫ్యామిలీ మొత్తాన్ని క్లైమాక్స్ సీన్లో విలన్ ఎక్కడో ఫ్యాక్టరీలో కట్టేసి ఉంచడం...హీరో వచ్చి ఫైటింగ్ చేసి విడిపించుకోవడం..! ఎన్ని దశాబ్దాలుగా చూశాం ఇలాంటి సీన్లు?! పైగా ఇంతోటి కథ మూడు గంటల్లో చెప్పడం. 

అసలీ సినిమాకి రూ 150 కోట్లు ఖర్చయ్యాయని ప్రచారం చేసేసారు. హీరో అజిత్ రెమ్యునరేషను రూ 130 కోట్లైతే ఆ ప్రచారాన్ని నమ్మొచ్చు. 

ఖరీదైన పెద్ద క్యాస్టింగేదీ లేదు. లేడీ ఆఫీసర్ గా హుమా కురేషీ కనిపించింది. కానీ ఆమెని హీరోయిన్ అనలేం. అసలు అజిత్ కి ఇందులో హీరోయినే లేదు. 

విలన్ గా కార్తికేయ చేత శరీరదారుఢ్య ప్రదర్శన చేయించారు తప్ప క్యారెక్టర్ పరంగా బలమైన సన్నివేశాలేవీ తన మీద తీయలేదు.

మిగతా నటీనటుల మొహాలు కూడా ఎక్కడా చూసినట్టు అనిపించదు. 

నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయని చెప్పాలి. యాక్షన్ సన్నివేశాలు ఘనంగానే తీసారు. అలాగని అద్భుతమని అనిపించవు. ఇలాంటివి గతంలో చాలానే చూసేశాం. 

ఎడిటింగ్ మాత్రం అస్సలు పదును లేదు. బహుశా దర్శకుడి బలవంతం మీద ఎడిటర్ పనితనం ఇలా ఉందేమో అనిపించింది. ఎందుకంటే కథని ముందుకు తీసుకెళ్ళని ఒకేలాంటి సన్నివేశం గానీ డయలాగ్ గానీ మళ్లీ మళ్లీ వస్తుంటే నిర్దాక్షిణ్యంగా కట్ చేసి ఒకటే ఉంచాలి. ఆ బేసిక్ కామన్ సెన్స్ కూడా ఎడిటింగులో వాడలేదు. హీరో అన్నయ్య తన తాగుబోతు ఫ్రెండ్ ని పరిచయం చేసే సీనులో ఒకే మ్యాటర్ మూడు సార్లు పెట్టి విసిగించారు. అలాగే గ్రాఫిటీని స్కాన్ చేసి డ్రగ్ పెడలింగ్ చేసే వాళ్లని కూడా అదే పనిగా మూడు నాలుగు సార్లు చూపించి కథ కదలడంలేదేమిటన్న ఫీలింగ్ తెప్పించారు. 

అలాగే హీరో ఇంట్రడక్షన్ సీన్స్ కూడా రెండు మూడున్నట్టుగా అనిపించింది. ఒక సారి బిల్డప్పయ్యాక మళ్లీ మళ్లీ ఎందుకా అనిపిస్తుంది. 

నేపథ్య సంగీతం బాలేదు. ద్వితీయార్థంలో కాస్త పర్వాలేదనిపించినా మొదటి సగంలో మాత్రం చాలా పేలవంగా ఉంది. ఇక పాటలైతే పాత తనానికి నిలువెత్తు చిరునామా అని చెప్పాలి. ఒక్క పాట కూడా క్యాచీగా లేకపోగా అలవాటులేకపోయినా బయటికెళ్లి సిగెరెట్ తాగాలనిపించేలా ఉన్నాయి. 

ఈ రకం సినిమాని థియేటర్లో దాదాపు మూడు గంటలపాటు భరించడం కష్టం. లైటర్ మొమెంట్స్ లేకుండా, రొమాన్స్ లేకుండా సినిమాని ఇష్టపడాలంటే కట్టి పరేసే సస్పెన్స్ అయినా ఉండాలి, థ్రిల్ ఎలిమెంట్స్ అయినా ఉండాలి. అవేవీ లేవిందులో. మధ్యలో అరగంట నిద్రపోయినా మిస్సయ్యే కథేదే ఉండదు. 

ఓటీటీలో అయితే ల్యాగుల్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని చూసే వెసులుబాటుంటుంది. థియేటర్లో ఆ పరిస్థితి లేక వైరాగ్యం ముంచుకొస్తుంది. 

అజిత్ వయసుకి తగ్గ పాత్రే చేసాడు. అయితే మొదటి పాటలో హెవీగా కనిపించాడు. డ్యాన్స్ మూవ్మెంట్స్ కూడా స్పార్క్ లేదు. ఇక మదర్ సెంటిమెంటు ఎంత దయనీయంగా ఉందంటే ప్రేక్షకుడికి అసలా తల్లి క్యారెక్టర్ చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటుంది కాదా అనిపిస్తుంది. 

ఫార్ములాని ఫాలో అయ్యి కుళ్లిపోయిన మూస పద్ధతిలో తీసిన సినిమా ఈ "వలిమై". సినిమా ఎలా ఉందని అడిగితే నిర్మాత బోనీకపూర్ పేరులో ఆఖరి రెండక్షరాలు చూపించాలి. 

బాటం లైన్: బాబోయ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?