విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి తీరాల్సిందే. ఎందుకో ఈసారి పంతం పట్టినట్లుగా ఉన్నారు పోలీసులు. అందుకే పశ్చిమ గోదావరి నల్లజర్ల నుంచి ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలతో సహా వచ్చి మరి రెండు రోజులుగా నర్శీపట్నంలో మకాం వేశారు.
తమతో పాటు తీసుకువచ్చిన 41ఏ నోటీసుకుని కూడా అయ్యన్న ఇంటి వద్ద అంటించి మరీ ఆయన కోసం వేచి చూస్తున్నారు. అయ్యన్న ఇంట్లో లేడని కుటుంబ సభ్యులు చెప్పారు, పీఏతో ఫోన్ కలపాలని చూసినా ఆయన స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మొత్తానికి చూస్తే అయ్యన్న ఎక్కడ ఉన్నారో మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోయారు.
అయ్యన్న కనుక ఎదురుపడితే అరెస్ట్ చేసి తమతో పాటు నల్లజర్లకు తీసుకెళ్ళడానికి మొత్తం ప్రిపేర్ అయి పోలీసులు వచ్చారని అంటున్నారు. ఒక రాత్రి అంతా అయ్యన్న ఇంటి వద్దనే పోలీసులు పంతం పట్టి కూర్చున్నా అయ్యన్న అయిపూ అజా లేదు మరి. ఇంకో వైపు అయ్యన్న ఇంటికి క్యాడర్ తో పాటు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాత్రి అంతా జాగారం చేశారు. అటు పోలీసులు, ఇటు టీడీపీ కార్యకర్తల హడావుడితో నర్శీపట్నంలో ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది.
ఇక రెండవ రోజు కూడా పట్టువదలని విక్రమార్కులు మాదిరిగా పోలీసులు అయ్యన్న కోసం వేచి చూస్తున్నారు. ఇంతకీ ఈసారి అయినా పోలీసుల పంతం నెరవేరుతుందా, అయ్యన్నను అరెస్ట్ చేస్తారా. మొత్తానికి చూస్తే ఎంతో మంది టీడీపీ బిగ్ షాట్స్ ని చిటికెలో అరెస్ట్ చేసి జైలుపాలు చేసిన పోలీసులకు అయ్యన్నను అరెస్ట్ చేయడం ఎందుకో కుదరడంలేదనుకోవాలి. అయినా ఈసారి సంచలనం నమోదు చేయడానికి పోలీసులు కూడా రెడీగానే ఉన్నారని అంటున్నారు.
సో ఏపీ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టానికి ఏ క్షణమైనా తెర లేవవచ్చు అంటున్నారు. ఏం జరుగుతుంది అంటే వేచి చూడాల్సిందే.