టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేశ్ విశాఖ వేదికగా శపథం చేశారు. తన తల్లి కోసం ఆయన శపథం చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. లోకేశ్ చిరుతిండి కోసం లక్షలాది రూపాయలను నాటి చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసిందంటూ జగన్ సొంత పత్రిక ప్రచురించిన కథనంపై ఆయన విశాఖ కోర్టులో దావా వేశారు. పరువు నష్టం దావా కేసులో ఇవాళ ఆయన కోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో లోకేశ్ మాట్లాడుతూ తన తల్లిని అవమానించిన వారికి మరోసారి ఘాటు హెచ్చరికలు చేశారు. తన తల్లిని అసెంబ్లీ సాక్షిగా కించపర్చిన ఏ ఒక్కరినీ విడిచి పెట్టే ప్రశ్నే లేదని ఆయన హెచ్చరించారు. 2024 తర్వాతైనా తన తల్లికి క్షమాపణ చెప్పేంత వరకూ విడిచిపెట్టనని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తన తల్లి కోసం చేస్తున్న శపథంగా అభివర్ణించడం గమనార్హం.
వైఎస్ విజయమ్మ, భారతి, వారి పిల్లల గురించి తాము మాట్లాడితే, ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని లోకేశ్ హితవు చెప్పారు. కానీ అది తమ సంస్కృతి కాదని లోకేశ్ స్పష్టం చేశారు. ఓ తల్లి బాధ ఎలా వుంటుందో కొడుకుగా ప్రత్యక్షంగా చూశాన న్నారు. తన తల్లి బాధ మరో తల్లికి రాకూడదని ఆయన ఆకాంక్షించారు. అందుకే తన తల్లిని అవమానించిన వారి భరతం పడతానని లోకేశ్ చేసిన హెచ్చరికలు చర్చనీయాంశమయ్యాయి.
అలాగే సాక్షి మీడియా తన వ్యక్తిగత జీవితంపై బురదజల్లిందని విమర్శించారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సాక్షి మీడియా ప్రయత్నించిందన్నారు. అలాంటి వాటికి తాను భయపడనని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు రాస్తే చట్ట ప్రకారం ముందు కెళ్తానన్నారు.