ఏపీ నేత‌లు గ‌ప్‌చుప్‌…ఇత‌ర నేత‌ల రియాక్ష‌న్స్ అదుర్స్‌!

క‌ర్నాట‌క‌లో బీజేపీ ఓట‌మిపై ఏపీ రాజ‌కీయ నేత‌లు త‌ప్ప‌, వివిధ రాష్ట్రాల ప్ర‌ముఖులు త‌మ‌దైన రీతిలో స్పందించారు. బీజేపీకి ఏపీ నేత‌లు సాగిల‌ప‌డిన సంగతి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దీంతో బీజేపీ ఓట‌మిపై…

క‌ర్నాట‌క‌లో బీజేపీ ఓట‌మిపై ఏపీ రాజ‌కీయ నేత‌లు త‌ప్ప‌, వివిధ రాష్ట్రాల ప్ర‌ముఖులు త‌మ‌దైన రీతిలో స్పందించారు. బీజేపీకి ఏపీ నేత‌లు సాగిల‌ప‌డిన సంగతి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దీంతో బీజేపీ ఓట‌మిపై ఏం మాట్లాడితే ఏమ‌వుతుందోన‌నే భ‌యంతో గ‌ప్‌చుప్ అంటూ మౌనాన్ని ఆశ్ర‌యించారు. తెల్లారి లేచిన‌ప్ప‌టి నుంచి ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌ర‌స్ప‌రం దూషించుకుంటుంటారు.

కానీ క‌ర్నాట‌క‌లో బీజేపీ ఓట‌మి, కాంగ్రెస్ విజ‌యంపై వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన నేత‌లెవ‌రూ స్పందించ‌డానికి ధైర్యం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. క‌ర్నాట‌క‌లో 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ 136, బీజేపీ 64, జేడీఎస్ 20, ఇత‌రులు నాలుగు స్థానాల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. కర్నాట‌క‌లో హంగ్ వ‌స్తుంద‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కర్నాట‌క ప్ర‌జానీకం స్ప‌ష్ట‌మైన మెజార్టీ ఇవ్వ‌డం విశేషం. ఈ నేపథ్యంలో బీజేపీయేత‌ర పార్టీల ముఖ్య నేత‌లు స్పంద‌న ఆస‌క్తిక‌రంగా వుంది.  

ముందుగా కాంగ్రెస్ పార్టీకి త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ అభినంద‌న‌లు తెలిపారు. సోద‌రుడు రాహుల్‌గాంధీపై అన‌ర్హ‌త వేటు, విప‌క్ష స‌భ్యుల‌పై ద‌ర్యాప్తు సంస్థ‌ల్ని ఉసిగొల్ప‌డం, హిందీ భాష‌ను బ‌ల‌వంతంగా రుద్ద‌డం, అవినీతి త‌దిత‌ర అంశాలు కన్న‌డ ప్ర‌జానీకంలో బీజేపీపై తీవ్ర వ్య‌తిరేక‌త నింపాయ‌న్నారు. బీజేపీకి గుణ‌పాఠం చెప్ప‌డం ద్వారా క‌న్న‌డిగుల పౌరుషాన్ని నిల‌బెట్టార‌ని ప్ర‌శంసించారు. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ స‌మ‌ష్టిగా గెలుపు కోసం ప‌ని చేద్దామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

విభ‌జ‌నవాద‌ రాజ‌కీయాల‌ను తిర‌స్క‌రించిన క‌ర్నాట‌క వాసుల‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట‌ర్ వేదిక‌గా కృత‌జ్ఞ‌తలు చెప్పారు. హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు మ‌ధ్య ఆరోగ్య‌క‌ర పోటీ ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్ష‌లు చెప్పారు.

ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ బీజేపీ ఓట‌మిపై సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు. మార్పు దిశ‌గా నిర్ణ‌యాత్మ‌క తీర్పు ఇచ్చిన క‌న్న‌డిగుల‌కు ఆమె సెల్యూట్ చెప్పారు. క్రూర‌మైన నిరంకుశ రాజ‌కీయాలు ఓడిపోయాయ‌ని ఆమె అభివ‌ర్ణించారు. ఇది రేప‌టికి గుణ‌పాఠం అని ఆమె పేర్కొన‌డం విశేషం.

వీరే కాకుండా ప‌లువురు విప‌క్షాల నేత‌లు బీజేపీ ఓట‌మిపై స్పందిస్తూ… దేశంలో రానున్న రోజుల్లో రాజ‌కీయ మార్పున‌కు నాందిగా అభివ‌ర్ణించారు. బీజేపీ ఓట‌మిని వామ‌ప‌క్షాల నేత‌లు, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఒమ‌ర్ అబ్దుల్లా త‌దిత‌రులు స్వాగ‌తించారు. బీజేపీ మ‌త రాజ‌కీయాలు ఈ ప్ర‌జాతీర్పు చెంప‌పెట్టు అని పేర్కొన్నారు. ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు మాత్ర‌మే క‌ర్నాట‌క రాజకీయాల‌తో త‌మ‌కు సంబంధం లేన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం.