మోడీజీ విషం విత్తితే వికటించింది!

మోడీ జీ పాఠం నేర్చుకోవాలి. విష బీజాలు విత్తితే, అందమైన రుచికరమైన యాపిల్ పండ్ల మొక్కలు మొలవవు.. అనే సంగతి ఆయన గ్రహించాలి. నిర్దిష్టమైన అభివృద్ధి ప్రణాళికలతో ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలే తప్ప.. మాయ…

మోడీ జీ పాఠం నేర్చుకోవాలి. విష బీజాలు విత్తితే, అందమైన రుచికరమైన యాపిల్ పండ్ల మొక్కలు మొలవవు.. అనే సంగతి ఆయన గ్రహించాలి. నిర్దిష్టమైన అభివృద్ధి ప్రణాళికలతో ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలే తప్ప.. మాయ మాటలు చెప్పినంత మాత్రాన ఫలితం ఉండదని ఆయన తెలుసుకోవాలి.  

'దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడానికి మిఠాయి రాజకీయాలు నడిపిస్తున్నాయి' అంటూ.. ఒకవైపు ఎగతాళి చేస్తూ, అదే సమయంలో కన్నడ సీమలో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మాత్రం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అనే తరహా బిస్కెట్ రాజకీయాలు ప్రయోగిస్తే నమ్మి మోసపోవడానికి ప్రజలు అంత అమాయకులు కాదని కూడా మోడీ తెలుసుకోవాలి.  

ప్రధానంగా మతాన్ని ట్రంప్ కార్డు లాగా వాడుకుంటూ ప్రజల హృదయాల్లో మతవిద్వేష బీజాలను నాటడం ద్వారా విజయాలను నమోదు చేయగల రోజులు గతించిపోయాయి అని కూడా మోడీజీ తెలుసుకోవాలి.

రాముడిని వాడుకుని ఎన్నికల్లో నెగ్గడం అలవాటు చేసుకున్న కమల దళానికి హనుమ అస్త్ర ప్రయోగం వర్కవుట్ కాలేదు. “హనుమంతుడు అంటే మీకు ఎందుకంత ద్వేషం” అంటూ నాటకీయ డైలాగులతో మోడీజీ ప్రసంగాలు సాగిపోయాయి. ఆయన భావజాలాన్ని ఆదరించే సభికుల మధ్య అవి రక్తికట్టాయి. కానీ నిష్ఫలం అయ్యాయి. సభలో చప్పట్లు కొట్టడానికి హాజరు కాని ప్రజల మీద అవి పని చేయలేదు. మతం సెంటిమెంటు మీద తన రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ ను భూతంగా చూపించడానికి మోడీ వేసిన ఎత్తులు పారలేదు. 

కన్నడ ప్రజలకు బిజెపి ప్రభుత్వ అవినీతి మాత్రమే విశ్వరూపంలో కనిపించింది. కుయుక్తులను వారు పట్టించుకోలేదు. కమలదళం అలవాటు చేసుకున్న ఆకర్ష రాజకీయాలకు కూడా ఆస్కారం ఇవ్వకుండా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మోడీజీ కన్నడ తీర్పు నుంచి పాఠాలు నేర్చుకుని పద్దతి మార్చుకుంటే 3.0 దిశగా వెళ్లడం సులువు అవుతుంది.