అడుక్కుంటున్న తెలంగాణా ఉద్యమ నాయకుడు

తెలంగాణా ఉద్యమ నాయకులు ఎందరో ఉన్నారు. వారు వీరోచితంగా పోరాడారు. ప్రాణాలకు తెగించి కొట్లాడారు. కానీ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించి, గతంలో ఎవరూ వినని, కనని పోరాట రూపాలను ప్రజలకు పరిచయం చేసిన,…

తెలంగాణా ఉద్యమ నాయకులు ఎందరో ఉన్నారు. వారు వీరోచితంగా పోరాడారు. ప్రాణాలకు తెగించి కొట్లాడారు. కానీ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించి, గతంలో ఎవరూ వినని, కనని పోరాట రూపాలను ప్రజలకు పరిచయం చేసిన, తెలంగాణ ఉద్యమాన్ని అలుపెరుగకుండా నడిపిన నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం.

తెలంగాణా ఉద్యమం మహా భారత యుద్ధం అనుకుంటే అందులో కోదండ రామ్ పోషించింది శ్రీకృష్ణుడి పాత్ర అనుకోవచ్చు. కేసీఆర్ ఢిల్లీలో లాబీయింగ్ చేస్తుంటే, కోదండ రామ్ రాష్ట్రంలో ఉండి వివిధ రూపాల్లో ఉద్యమాన్ని నడిపించారు. ఉద్యమంలో కీలకమైన మిలియన్ మార్చ్ ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. తెలంగాణా వచ్చాక కోదండ రామ్ వైభవం అంతరించింది. ఆయనకు, కేసీఆర్ కు మధ్య విభేదాలు వచ్చాయి.

కేసీఆర్ ఆయన్ని పూచికపుల్ల మాదిరిగా తీసిపారేశాడు. క్రమంగా ప్రజలూ మర్చిపోయారు. ఆయన సొంత పార్టీ పెట్టినా రాజకీయంగా విజయవంతం కాలేదు. కొన్ని ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. చివరకు కోదండరాం అడుక్కునే స్థితికి దిగజారారు. అడుక్కోవడం అంటే తిండి లేక అడుక్కోవడం కాదు. రాజకీయంగా అడుక్కోవడం అని అర్థం.

తెలంగాణలో గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే, అదృష్టం బాగుంటే అధికారంలోకి వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తుండటంతో తమ పార్టీకి ఆరు సీట్లు ఇవ్వాలని కోదండ రామ్ ప్రతిపాదించారు. తాము కాంగ్రెస్ పార్టీ గుర్తు మీదనే పోటీ చేస్తామని కూడా చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలుసుకున్నారు. తెలంగాణా ఇంచార్జి థాక్రేను కూడా కలిసి మాట్లాడారు.

కాంగ్రెస్ హై కమాండ్ కు కోదండ రామ్ 12 సీట్ల జాబితా ఇచ్చి అందులో ముంచి ఆరు సీట్లు ఇవ్వాలని కోరారు. ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయనని అంటున్నారు. మరి కోదండ రామ్ ప్రపోజల్ మీద కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో !