ప్రధాని మోడీపై, బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడుతున్న తెలంగాణా సీఎం తాజాగా ప్రోటోకాల్ వివాదంలో ఇరుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వం దీని మీద సీరియస్ గా ఉన్నట్లు సమాచారం వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కంగారు పడుతోంది. ప్రోటోకాల్ వివాదం ఏమిటో జనాలకు తెలుసు. అతి పెద్ద జాతరగా పేరు పొందిన మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు సీఎం కేసీఆర్ అసలు వెళ్ళలేదు.
బీజేపీకి వ్యతిరేక కూటమిని నిర్మించే పనిలో ముంబై వెళ్లాల్సిన పనిలో ఉన్న కేసీఆర్ జాతరకు అటెండ్ అవలేదు. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. అయితే జాతర చివరి రోజున మేడారానికి వెళ్లిన రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి మంత్రులుగానీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ గానీ స్వాగతం పలకలేదు. రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గవర్నర్ కు స్వాగతం పలుకక పోవడమంటే ఆమెను అవమానించినట్లే కదా. కానీ ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఇప్పటివరకు కేసీఆర్ గానీ, మంత్రులుగానీ, జిల్లా ఉన్నతాధికారులుగానీ ఏమీ మాట్లాడలేదు.
అంతకుముందు టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు మేడారం జాతరను కేంద్రం జాతీయ హోదా కల్పించలేదని, నిధులు ఇవ్వలేదని దుమ్మెత్తి పోశారు. ముచ్చింతల్ ఆశ్రమానికి వచ్చిన ప్రధాని మోడీకి కేసీఆర్ స్వాగతం పలకలేదు. ఆయన అటెండ్ అయింది ప్రైవేటు కార్యక్రమం కాబట్టి స్వాగతం పలకలేదని టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. గవర్నర్ అటెండ్ అయింది కూడా ప్రైవేటు కార్యక్రమం అనుకొని ప్రోటోకాల్ పాటించలేదేమో తెలియదు. లేదా గవర్నర్ కూడా బీజేపీ వ్యక్తి కాబట్టి స్వాగతం పలకలేదేమో.
మోడీకే స్వాగతం పలకలేదు కాబట్టి గవర్నర్ ఎంత అనుకున్నారేమో చెప్పలేం. గవర్నర్ కు స్వాగతం చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నది ఎవరు? కేసీఆర్ చెబితే ఈ పనిచేశారా లేదా మంత్రులు, ఉన్నతాధికారులు వాళ్లకు వాళ్ళే నిర్ణయం తీసుకున్నారా? కేంద్రం నుంచి ఏం సంకేతాలు అందాయో తెలియదుగానీ ఈ వివాదం మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కంగారు పడుతున్నారు. ఒకవేళ కేంద్రం సంజాయిషీ అడిగితే జవాబు చెప్పాల్సింది సోమేశ్ కుమారే. అందుకే దీనిపై ములుగు జిల్లా కలెక్టర్ ను, ఎస్పీని వివరణ కోరారు.
గవర్నర్ కు ఎందుకు స్వాగతం చెప్పలేదని అడిగారు. ఈ వివాదాన్ని రాష్ట్ర బీజేపీ ఆయుధంగా చేసుకుంది. కేసీఆర్ మీద దాడి చేస్తోంది. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రోటోకాల్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రానికి తొలి పౌరురాలు అయిన గవర్నర్‌కు ఇంత అవమానమా? అంటూ ప్రశ్నించారు. మహిళ అని కూడా చూడకుండా అవమానిస్తారా? అంటూ వ్యాఖ్యలు చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా స్పందించారు. ఆ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సంస్కార హీనమైన సంప్రదాయానికి కేసీఆర్ తెర తీశారని ఆరోపణలు చేశారు. సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడే కేసీఆర్.. ఆయన సంస్కారం ఏంటో ఈ ఘటనతో అర్థమవుతోందని అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. వ్యక్తులు కాదు, వ్యవస్థలు ముఖ్యమని కేసీఆర్‌కు గుర్తుచేస్తున్నా అన్నారు.
జాతరకు సీఎం కేసీఆర్ వెళతారని చెబుతూ గవర్నర్ కు హెలికాప్టర్ సౌకర్యాన్ని ప్రొటోకాల్ విభాగం తిరస్కరించింది. దీంతో రోడ్డు మార్గాన ఆమె మేడారం జాతరకు వెళ్లారు. ప్రొటోకాల్ ప్రకారం అక్కడి కలెక్టర్, ఎస్పీ రిసీవ్ చేసుకోవాలి. కానీ, ఆ విధంగా ఆహ్వానం లేకపోవడంతో రాజ్ భవన్ వర్గాలు విస్మయానికి గురయ్యాయి. అంతేకాదు, గవర్నర్ కు జరిగిన అవమానంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.మేడారం జాతరలో గవర్నర్ తమిళిసైకి ప్రొటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ తప్పనిసరిగా హాజరై ఆహ్వానించాల్సి ఉంది.
కానీ, వాళ్లిద్దరూ గైర్హాజర్ కావడం వివాదానికి కేంద్ర బిందువైంది..ఇటీవల ప్రగతిభవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ పెరిగింది. గవర్నర్ కార్యాలయం ముందు ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయడం కేసీఆర్ సర్కార్ కు ఏ మాత్రం నచ్చలేదు. కోవిడ్ పేరుతో జనవరి 26 వేడుకలను రాజ్‌భవన్‌కు మాత్రమే పరిమితం చేయడం మరో వివాదంగా ఉంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారం పర్యటన సందర్భంగా ఉన్నతాధికారులు ప్రొటోకాల్‌ను విస్మరించిన అంశం ఢిల్లీకి చేరింది.
మహాజాతరలో చివరి ఘట్టమైన దేవతల వనప్రవేశం రోజున దర్శనానికి గవర్నర్ ముందుగానే షెడ్యూల్ ఇచ్చారు. గవర్నర్ పర్యటనకు కొద్దిగంటల ముందే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ కృష్ణఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఇతర అధికారులు మేడారం ‘సక్సెస్ మీట్’నిర్వహించారు. ఆ తర్వాత మేడారం చేరుకున్న గవర్నర్ తమిళిసైకి జాయింట్ కలెక్టర్ ఇలాత్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు.
మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతంలో గవర్నర్ పర్యటనను తేలికగా తీసుకోవడంపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.