అయ్యప్పన్ కోషియుం సినిమా తో పోలికను అధిగమించడం భీమ్లా నాయక్ కు సాధ్యం అయ్యే పని కాదు. ఎంత వద్దన్నా పోలిక రానే వస్తుంది. ఈ పోలికను ఖాతరు చేయక టైటిల్ దగ్గర నుంచినే ఈ సినిమా వన్ మ్యాన్ షో గా మారింది. మలయాళం టైటిలే ఇద్దరి హీరోల పేర్ల కలయిక కాగా, తెలుగులో పవన్ కల్యాణ్ పాత్ర పేరే టైటిలైంది. రెండో పాత్ర మరుగైంది.
ఇక డ్యూయెట్లు, ఫ్యాన్సీ డ్రస్సింగ్ లూ ఇవన్నీ కూడా ఒరిజినల్ వెర్షన్ తో పోల్చి విమర్శలకు గురి అయినవే. ఇప్పుడు ట్రైలర్ కు కూడా మలయాళంతో పోలిక తప్పడం లేదు.
ఒరిజినల్ వెర్షన్ ను రెండేళ్లుగా తెలుగు వాళ్లు విపరీతంగా చూశారు. చాలా మందికి మలయాళీ వెర్షన్ బాగా నచ్చింది. మలయాళీ వెర్షన్ కల్ట్ హిట్ అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో భీమ్లా నాయక్ ట్రైలర్ ను చూసి.. అయ్యప్పన్ ఫ్యాన్స్ నుంచి పెదవి విరుపులు తప్పడం లేదు!
మలయాళీ ట్రైలర్ సినిమా సోల్ ను ప్రజెంట్ చేస్తుంది. పులి పడుకుంది.. వంటి డైలాగులు ఉండవందులో! అలాగే రారా నా కొడక.. అంటూ బూతులు, లౌడ్ డైలాగులకు కూడా స్థానం లేదు మలయాళీ వెర్షన్ లో.
రెండు పాత్రలూ పరస్పరం తలపడతాయి, కలహించుకుంటాయి. అయితే బూతులతో కాదు! అయితే బూతులు, గట్టిగా అరవడం, పులి, సింహం.. అనుకోవాల్సిందేనేమో తెలుగు సినిమా అంటే!
మలయాలీ ట్రైలర్ లో పాత్రల ఉద్వేగాలు కనిపిస్తే, తెలుగు ట్రైలర్లో మాటలు మాత్రమే వినిపించాయి! ఈ అంశంపై సోషల్ మీడియాలో ట్రోల్ సాగుతోంది.
మలయాళీ వెర్షన్ ట్రైలర్ కు ఆమడ కాదు, సుదూరంగా ఉంది తెలుగు వెర్షన్ ట్రైలర్. ఈ విషయాన్నే పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కనిపిస్తున్నాయి.