జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆవేద‌న‌

ఒమిక్రాన్ ప్ర‌భావంపై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మొద‌టి వేవ్‌లోని వేరియంట్ కంటే ప్ర‌స్తుతం ఒమిక్రాన్ వేరియంట్ చాలా ఇబ్బంది పెడుతోంద‌ని, ఈ సంద‌ర్భంగా స్వీయ అనుభ‌వాన్ని…

ఒమిక్రాన్ ప్ర‌భావంపై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మొద‌టి వేవ్‌లోని వేరియంట్ కంటే ప్ర‌స్తుతం ఒమిక్రాన్ వేరియంట్ చాలా ఇబ్బంది పెడుతోంద‌ని, ఈ సంద‌ర్భంగా స్వీయ అనుభ‌వాన్ని ఆయ‌న పంచుకున్నారు. సుప్రీంకోర్టులో పూర్తిస్థాయిలో భౌతిక‌ విచార‌ణ‌లు ప్రారంభించాల‌ని సుప్రీంకోర్టు బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు వికాస్ సింగ్ విజ్ఞ‌ప్తి చేశారు.

ఇప్పుడు ఒమిక్రాన్ వైర‌ల్‌గా మారింద‌ని వికాస్ సింగ్ అన్నారు. ప్ర‌జ‌లు త్వ‌ర‌గా కోలుకుంటున్నార‌ని, అందువ‌ల్ల సుప్రీంకోర్టులో పూర్తిస్థాయి భౌతిక విచార‌ణ‌లు ప్రారంభించాల‌ని చీఫ్ జ‌స్టిస్‌ను సుప్రీంకోర్టు బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కోరారు. ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒమిక్రాన్ ప్ర‌భావం త‌గ్గిన‌ప్ప‌టికీ, దాని ల‌క్ష‌ణాల‌తో ఇంకా ఇబ్బంది ప‌డుతున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భంగా త‌న స్వీయ అనుభ‌వాన్ని ఆయ‌న చెప్పారు.

“నేను ఒమిక్రాన్ వేరియంట్ బారిన ప‌డ్డాను. నాలుగు రోజుల్లోనే త‌గ్గింది. కానీ ఇంకా నాపై దాని ప్ర‌భావం ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ సైలెంట్ కిల్ల‌ర్ లాంటిది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లో నేను మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డాను. త్వ‌ర‌గా కోలుకున్నా. ప్ర‌స్తుతం థ‌ర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ బారిన ప‌డి 25 రోజులు గ‌డుస్తున్నా, ఇంకా వైర‌స్ అనంత‌ర ప్ర‌భావంతో బాధ‌ప‌డుతున్నా” అని జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ చెప్పుకొచ్చారు.

ప్ర‌స్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు న‌మోదువుతున్నాయ‌న్నారు. ఇవాళ ఒక్క‌రోజే దేశ వ్యాప్తంగా 15 వేల కేసుల‌కు పైనే న‌మోదు కావ‌డాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఈ నేప‌థ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌భావంపై స‌మీక్షించి త్వ‌ర‌లో పూర్తిస్థాయిలో భౌతిక విచార‌ణ‌ల‌పై నిర్ణ‌యం తీసుకుందామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. 

జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ చెప్పిన‌ట్టు ఒమిక్రాన్ కేవ‌లం నాలుగైదు రోజులు మాత్ర‌మే ప్ర‌భావం చూపుతుంద‌న్న‌ది నిజం. కానీ దాని ప్ర‌భావం వ‌ల్ల ద‌గ్గు రోజుల త‌ర‌బ‌డి ఇబ్బంది పెట్ట‌డంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఒమిక్రాన్ ప్ర‌భావం అనంత‌రం క‌నీసం మూడు వారాల‌కు త‌క్కువ కాకుండా వైర‌స్ క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. 

స్వ‌యంగా బాధితుడైన జ‌స్టిస్ ఎన్వీ థ‌ర్డ్ వేవ్‌పై చేసిన హెచ్చ‌రిక‌లు ఎంతో విలువైన‌వ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే ఆ ఇబ్బందిని అనుభ‌వించిన వారెవ‌రైనా మ‌రోసారి మ‌హ‌మ్మారి బారిన ప‌డాల‌ని అనుకోరు.