ప‌వ‌న్ రాజ‌కీయ నాయ‌కుడేనా?

రాజ‌కీయ వ్య‌వ‌స్థ చెడిపోయింద‌నే మాట నిజం. రాజ‌కీయాల్లో హూందాత‌నం లేద‌న్న‌ది వాస్త‌వం. డ‌బ్బు లేనిదే రాజ‌కీయాలు చేయ‌డం అసాధ్య‌మ‌న్న‌ది కూడా వాస్త‌వ‌మే. రాజ‌కీయాలు కులం కంపు కొడుతున్నాయ‌నేది కాద‌న‌లేని ప‌చ్చి నిజం. అవ‌కాశ‌వాద రాజ‌కీయాలే…

రాజ‌కీయ వ్య‌వ‌స్థ చెడిపోయింద‌నే మాట నిజం. రాజ‌కీయాల్లో హూందాత‌నం లేద‌న్న‌ది వాస్త‌వం. డ‌బ్బు లేనిదే రాజ‌కీయాలు చేయ‌డం అసాధ్య‌మ‌న్న‌ది కూడా వాస్త‌వ‌మే. రాజ‌కీయాలు కులం కంపు కొడుతున్నాయ‌నేది కాద‌న‌లేని ప‌చ్చి నిజం. అవ‌కాశ‌వాద రాజ‌కీయాలే త‌ప్ప‌, సేవాదృక్ప‌థం కొర‌వ‌డింద‌న్న‌ది వాస్త‌వం. అయితే పూట‌కో మాట‌, రోజుకో న‌డ‌క అనే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌న‌సేనాని చేస్తున్నవి కూడా రాజ‌కీయాలే అనుకునే దుస్థితి ఉందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

“మళ్లీ ఓడిపోవడానికి నేను సిద్ధంగా లేను. త్రిముఖ పోటీలో జనసేన బలికావడానికి సిద్ధంగా లేదు. పొత్తులపై ఇంకా చర్చలు జరగలేదు. కానీ నేను సిద్ధం. కచ్చితంగా పొత్తులే ఉంటాయి”

నిజంగా రాజ‌కీయం తెలిసిన వాడు, చేయాల‌ని అనుకున్న నాయ‌కుడు మాట్లాడాల్సిన మాట‌లేనా ఇవి? ఏంటీ గంద‌ర‌గోళం? పొత్తుల‌పై ఇంకా చ‌ర్చ‌లు జ‌రగ‌లేదంటూనే, మ‌రోవైపు అవి లేకుండా చ‌చ్చినా నేను ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నని బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. ఇంత‌కంటే రాజ‌కీయ అజ్ఞాని ఎక్క‌డైనా వుంటారా? ప్ర‌తి మాట ఆయ‌న అజ్ఞానాన్ని ప్ర‌ద‌ర్శించింది.

2019 ఎన్నిక‌ల్లో 30 – 40 స్థానాల్లో గెలిచి వుంటే ఇవాళ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి వ‌చ్చి తీరేద‌న్నారు. ఓట్లు వేయ‌కుండా మీరెలా మాట్లాడ్తార‌ని ఆయ‌న ద‌బాయింపు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఎక్క‌డైనా అభ్య‌ర్థిస్తే ఓట్లు వేస్తారే త‌ప్ప‌, కోప‌గించుకుంటే భ‌య‌ప‌డి ఆద‌రిస్తారా? ముందు త‌నకు ఓట్లు వేసి మాట్లాడాల‌ని ఆయ‌న అన‌డం ఏంటి? హైద‌రాబాద్‌లో కేవ‌లం ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మైన ఎంఐఎం, ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తోంద‌ని, కానీ ఇంత జ‌నాద‌ర‌ణ ఉండి, క‌నీసం ప‌ది సీట్లు గెల‌వ‌క‌పోతే ఏం చేయ‌గ‌లం? అని ప్ర‌శ్నించ‌డం ద్వారా త‌న మూర్ఖ‌త్వాన్ని బ‌య‌ట పెట్టుకున్న‌ట్టైంది.

త‌న పార్టీకి ప్ర‌జాద‌ర‌ణ లేక‌పోవ‌డానికి కార‌ణం తానేన‌ని ప‌వ‌న్ ఎప్పుడు తెలుసుకుంటారు? తెలంగాణ‌లో ఎంఐఎం ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోకుండా సొంతంగా రాజ‌కీయాలు చేస్తున్న విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తించ‌క‌పోవ‌డం ఎవ‌రి త‌ప్పు? త‌న‌లాగా ఇత‌ర పార్టీల పొత్తుల‌పై ఎంఐఎం రాజ‌కీయ పునాదులు వేసుకోవాల‌ని ఎప్పుడూ భావించ‌లేదు. అంతెందుకు, అసెంబ్లీలో కేసీఆర్ స‌ర్కార్ త‌ప్పుల్ని ఎత్తి చూప‌డంతో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం అంద‌రికీ తెలిసిందే.

అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్‌, అలాగే మంత్రి కేటీఆర్‌, అక్బ‌రుద్దీన్ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవ‌డం చూసైనా ప‌వ‌న్ గుణ‌పాఠం నేర్చుకుని వుంటే, ఇవాళ జ‌న‌సేనానికి ఈ దుస్థితి ఏర్ప‌డేదా? ఇంత ప్ర‌జాద‌ర‌ణ ఉండి కూడా ప‌ట్టుమ‌ని ప‌ది సీట్ల‌లో కూడా గెల‌వ‌లేక‌పోతే ఏం చేయ‌గ‌లం? అని ప‌వ‌న్ మ‌రెవ‌రినో ప్ర‌శ్నించ‌డం కాదు, త‌న రాజ‌కీయ పంథాపై అంత‌రాత్మ‌ను నిలదీయాలి. పార్టీ ర‌థ సార‌థిగా ముఖ్యంగా త‌న ఓటు బ్యాంక్‌లో న‌మ్మ‌కం క‌లిగించాలి. ఆ ప‌ని గ‌త ప‌దేళ్లుగా ప‌వ‌న్ ఎప్పుడూ చేయ‌లేదు. అందుకే త‌న‌ను క‌నీసం ఒక్క చోట కూడా గెలిపించ‌లేద‌ని గ్ర‌హించాలి.

చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోయ‌డానికే ఉన్నాన‌ని ప‌దేప‌దే చెబుతుంటే, ఆత్మాభిమానం మెండుగా ఉన్న అభిమానులు, కాపులు మాత్రం ఎలా వెంట న‌డుస్తార‌ని అనుకుంటున్నారు? జ‌న‌సేన అనే పార్టీని, చంద్ర‌బాబు భ‌జ‌న సేన‌గా మార్చి, త‌న‌కు ఓట్లు వేయ‌లేదంటూ నిందిస్తున్న ప‌వ‌న్‌ను రాజ‌కీయ నాయ‌కుడిగా గుర్తించేంత చైత‌న్య‌ర‌హితంగా స‌మాజం లేదు. చివ‌రికి అభిమానించే వాళ్లు కూడా అస‌హ్యించుక‌నే రోజు అతి ద‌గ్గ‌ర‌లోనే ఉన్న సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. దీన్ని తెలుసుకుని అప్ర‌మ‌త్తంగా ఉండాల్సింది ప‌వ‌న్‌క‌ల్యాణే.