Advertisement

Advertisement


Home > Politics - Opinion

సినిమాలతో సినిమా చూపిస్తున్న మోదీ

సినిమాలతో సినిమా చూపిస్తున్న మోదీ

ఆ మధ్యన కాశ్మీర్ ఫైల్స్, ప్రస్తుతం కేరళ స్టోరీ- ఈ రెండు సినిమాలూ అత్యంత వివాదాస్పద చిత్రాలుగా ముద్రవేయబడ్డాయి. ఈ సినిమాల వల్ల దేశంలో మతవిద్వేషాలు చెలరేగుతాయని నమ్మిన వారు, నమ్ముతున్నవారు ఉన్నారు. మరో పక్కన కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడికి చుట్టూ భద్రతాసిబ్బందిని పెట్టింది కేంద్రప్రభుత్వం. ఇప్పుడు కేరళ స్టోరీ నిర్మాత విపుల్ షా, దర్శకుడు సుదీప్తో సేన్, నటి అదా శర్మ టీవీల్లో రకరకాల డిబేట్లలో పాల్గొన్న విడియోలు వైరలవుతున్నాయి. 

ఇక వెస్ట్ బెంగాల్ ప్రభుత్వమైతే కేరళస్టోరీని బ్యాన్ చేసేసింది. అల్లర్లు చెలరేగుతాయని భయమట. తమిళనాడులో మల్టీప్లెక్స్ వాళ్లు స్వచ్ఛందంగా ఈ సినిమాకి దూరంగా ఉన్నారు. థియేటర్స్ మీద దాడులు జరగవచ్చని అనుమానమట. 

ఇదిలా ఉంటే బీజేపీ ప్రభుత్వమున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ చిత్రానికి పన్ను మినహాయింపుని ప్రకటించాయి. పన్నులుండవు కాబట్టి తక్కువ ధరలకే టికెట్ అమ్మి ఎక్కువ మందికి చూపించమంటున్నాయి ఆ రాష్ట్ర ప్రభుతాలు. మొన్నటి వరకు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ ఆ చిత్రాన్ని చూసి తీరాలని దేశానికి పిలుపునివ్వడం జరిగింది. 

ఇంత జరుగుతున్నా ఏ ముస్లిం గ్రూపులూ ఏ సినిమా హాలు మీదా దాడి చేయలేదు. ఒక చోట కాకపోతే మరొక చోటైనా ఏదో ఒక అలజడి జరిగుండాలి కదా! అదీ జరగలేదు. సినిమా చూసొచ్చిన జనం ఎమోషనలయ్యి మీడియా బైట్స్ ఇస్తున్నారు. అధికశాతం ముస్లిం సోదరులు మాత్రం పట్టించుకోనట్టే ఉన్నారు. 

తప్పదు కాబట్టి అసదుద్దీన్ ఒవైసీ వంటి వాళ్లు అడిగినప్పుడు  "కేరళా స్టోరీలో ఉన్నదంతా అబద్ధమే. అది నిజమని నిరూపిస్తే కోటి రూపాయలిస్తా" అన్నాడు. దానికి బదులుగా, "ఇందులో ఉన్నది నిజం కాదని నిరూపిస్తే పదికోట్లిస్తానని ఒక హిందూ మిత్రుడు ప్రకటించాడు. నిజంగా అంత నిరూపించే శక్తే ఉంటే ఒవైసీ అతని దగ్గరకెళ్లి పదికోట్లు సంపాదించుకోవచ్చు" అని ఎద్దేవా చేసాడు కేరళ స్టోరీ నిర్మాత విపుల్ షా. 

కొందరు ముస్లిం ప్రవచనకారులు యూట్యూబులో కేరళ స్టోరీలో చూపబోయేదంతా అబద్ధమని చెబుతూ కొన్ని చిన్న చిన్న వీడియోలున్నాయి. అయితే అవన్నీ అధికశాతం సినిమా విడుదలకి ముందు వచ్చినవే. 

ఇలా మాటలు, అభిప్రాయాల వెల్లడి తప్ప ఎటువంటి అరాచకం జరగకపోవడం దేశం యొక్క అదృష్టం. 

అయితే దీనికి కారణమేమిటి? 

1. ముస్లిం సోదరులు సాత్వికంగా ఉంటూ సంయమనం పాటిస్తున్నారా?

2. అనవసర ప్రచారం ఇవ్వడం దేనికని ఊరుకున్నారా?

3. ఇది టెర్రరిజానికి వ్యతిరేకంగా తీసిన సినిమా తప్ప ఇస్లాం కి వ్యతిరేకంగా కాదని గ్రహించారా? 

4. దాడులు చెస్తే మోదీప్రభుత్వం ఊరుకోదని భయపడుతున్నారా?

5. ఆ చిత్రం తమని ఎలా చూపించినా తమ శక్తిని చాటిందని సంతృప్తి చెందుతున్నారా?

6. దీనిపై వ్యతిరేకంగా మాట్లాడితే ఉగ్రవాదసానుభూతిపరులుగా ముద్ర పడుతుందని జంకుతున్నారా? 

ఇవన్నీ కారణాలు కావొచ్చు. ఒక్కో ముస్లిం సోదరుడు ఒకలా తీసుకుని ఉండొచ్చు. 

ఒక్కో పాయింట్ చర్చించుకుందాం. 

1. ముస్లిముల్లో శాంతికామకులు చాలామంది ఉన్నారు. మతంతో సంబంధం లేకుండా సాటి మనిషికి సాయం చేయాలనే దృక్పథంతో ఉంటూ, వేళకి నమాజు చేసుకుంటూ పరమత సహనంతో జీవించేవాళ్లు అనేకం. ప్రపంచంలో ఈ సంఖ్యే ఎక్కువుంటారు. కానీ వీళ్లు మీడియాలో కనపడరు. ఎందుకంటే మీడియాకు వీళ్లక్కర్లేదు. వీళ్లనే కాదు...శాంతికాముకుల వల్ల ఎప్పుడూ వార్తలు పుట్టవు. ఈ రకం ముస్లిములు ఆ సినిమాలో ఏం చూపించారో తెలుసుకోవడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. "ఏదో సినిమా అట. తీసుకుంటే తీసుకున్నారులే" అని అనుకుంటూ ఉండొచ్చు. 

2. కొందరికి ఈ చిత్రం ఇబ్బంది అవ్వొచ్చు. కానీ దీనిపై స్పందించి అనవసర ప్రచారం కల్పించడమెందుకని అనుకోవచ్చు. ఇంతిలా ఆలోచించి సంయమనం పాటించే వారి సంఖ్య బహుతక్కువ. 

3. కేరళ స్టోరీ యాంటీ ముస్లిం కాదు, కేవలం యాంటి టెర్రరిజం చిత్రం అని గ్రహించి ఉండొచ్చు. నిజంగానే సినిమాలో కూడా అలాగే చూపించారు. "మతానికి తప్పు అర్ధం చెప్పి ఎలా మోసం చేస్తున్నారో చూడండి" అనే అర్ధం వచ్చేలా ఒక లైన్ కూడా ఉంది పాటలో. అలాగే ముస్లిములంతా కఠినాత్ములు కాదని చూపిస్తూ ఆఫ్ఘనిస్తాన్ లో ఒక మహిళ ప్రధానపాత్రధారిణి పట్ల ఎలా మానవత్వం చూపిస్తుందో చూపారు. కనుక సినిమాలో అల్లాను కానీ, ప్రవక్తను, యావత్ ముస్లిం జాతిని కాని అగౌరవపరిచే అంశాలు లేవు. 

4. ఎక్కువగా ఆలోచించకుండా, సినిమా చూడకుండా నేరుగా సినిమా హాళ్ల మీద దాడులు చేసే యువత దేశవ్యాప్తంగా ఉండొచ్చు. ఆ అనుమానంతోనే హైద్రాబాదులో కూడా విడుదల రోజు ప్రతి హాలు వద్ద పోలీసుల్ని పెట్టింది ప్రభుత్వం. కానీ ఏ సంఘటనా జరగలేదు. బహుశా అటువంటి దాడులకి పాల్పడితే మోదీ ప్రభుత్వం ఉపేక్షించదన్న భయంతో కొందరు ముస్లిములు తగ్గి ఉండొచ్చు. 

5. ఇక ఆఖరి వర్గం భిన్నమైనది. వీళ్లు జీహాదీ పక్షపాతులు కావొచ్చు. ఉగ్రవాదులు కాకున్నా ఐ.ఎస్.ఐ.ఎస్ పట్ల సానుకూల వైఖరి ఉండొచ్చు. సినిమాలో ఇస్లామిక్ స్టేట్ భావజాలాన్ని నెగటివ్ గా చూపించామని తీసినవాళ్లు అనుకున్నా, చూసిన ఈ వర్గం వాళ్లు తమ శక్తిని చాటిని సినిమాగా భావించి ఉండొచ్చు. ఎందుకంటే ఈ చిత్రం బాధితుల బాధలతో ముగుస్తుంది తప్ప విలన్స్ ని చంపే హీరో ఉండడు. 32000 మంది ముస్లిమేతర స్త్రీలని మతమార్పిడి చేసారన్న ఆరోపణని కూడా వీళ్లు హీరోయిక్ గా తీసుకుని ఉండొచ్చు. ఆ విధంగా ఎవరైతే అత్యంత ప్రమాదకరమో వాళ్లు ఈ సినిమాలో తమని తాము హీరోలుగానే చూసుకుంటున్నారనిపిస్తోంది. అంటే ఈ సినిమా అధికశాతం హిందువుల్లో యాంటి-ముస్లిం భావజాలం నాటగలిగినా ముస్లింస్ ని రెచ్చగొట్టే పని చెయ్యలేకపోయింది. 

6. ఈ చిత్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉగ్రవాద సానుభూతి పరులుగా ముద్ర వేయబడొచ్చు. నిజంగా ఇది నిజం. ఈ కారణం వల్ల కూడా ముస్లిములు మౌనం వహించి ఉండొచ్చు. 

ఇలా కారణమేదైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం దేశవాసుల అదృష్టం.

ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం. మోదీ 2014లో సోషల్ మీడియాని విస్తృతంగా వాడుకుని సింహాసమెక్కడం జరిగింది. ఈ సారి సినిమాల మీద కూడా ఆధారపడినట్టు కనిపిస్తోంది. అందుకే కాశ్మీర్ ఫైల్స్ కి, కేరళా స్టోరీకి ప్రధాని స్థాయి ప్రచారం లభించింది. 

స్మృతి ఇరాని కూడా - "బెంగాల్లో "కేరళ స్టోరీ" బ్యాన్ ని నిరసిస్తూ, మమతా బెనర్జీ షారుఖ్ ఖాన్ ని పిలిపించుకుని తన రాష్ట్రంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి స్పీచులు ఇప్పించుకుంటారు కానీ "కేరళా స్టోరీ" విషయంలో ఆమెకి ఆ స్వేచ్ఛ ఇవ్వాలనిపించలేదు" అని దెప్పి పొడిచింది. 

2022, 2023 సంవత్సారాల్లో సినిమాకి మతం రంగు అంటుకుంది. పర్లేదు...దేశానికి నిప్పు అంటుకోకుండా ఉంటే చాలు. అందరూ ఇలా ఎవరి భావస్వేచ్ఛ వారిది అనుకుంటే దేశంలో శాంతి పరిఢవిల్లుతూనే ఉంటుంది. 

- శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?