ప‌ని చేయ‌ని మోడీ మ్యాజిక్..!

క‌ర్ణాట‌క‌లో మోడీ మ్యాజిక్ ప‌ని చేయ‌లేదు! దాదాపు నెల రోజులు ప‌నుల‌న్నీ మానుకుని క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీని గెలిపించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుని.. ఏకంగా అటు ఇటుగా ఇర‌వై ర్యాలీలు, ఎన్నిక‌ల స‌భ‌లు, రోడ్…

క‌ర్ణాట‌క‌లో మోడీ మ్యాజిక్ ప‌ని చేయ‌లేదు! దాదాపు నెల రోజులు ప‌నుల‌న్నీ మానుకుని క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీని గెలిపించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుని.. ఏకంగా అటు ఇటుగా ఇర‌వై ర్యాలీలు, ఎన్నిక‌ల స‌భ‌లు, రోడ్ షోలు నిర్వ‌హించారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది చెప్ప‌కుండా, య‌డియూర‌ప్ప‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టి.. అంతా మోడీ అనే అన్న‌ట్టుగా బీజేపీ ప్ర‌చారం సాగింది. 

క‌నివీనీ ఎర‌గ‌ని రీతిలో బీజేపీ ప్ర‌చార ప‌ర్వం సాగింది క‌ర్ణాట‌క‌లో. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగుస్తున్న ద‌శ‌లో మోడీ చేప‌ట్టిన ఏకంగా పాతిక కిలోమీట‌ర్ల పై ర్యాలీ ఈ ప్ర‌చారంలో ప‌రాకాష్ట‌. మ‌రి ఇంత జేసినా క‌ర్ణాట‌క‌లో బీజేపీ ప‌రువైతే నిల‌వ‌డం లేదు.

బీజేపీ క‌నీసం 80 సీట్ల‌లో విజ‌యం సాధించ‌డం గ‌గ‌నంలా ఉంది ప‌రిస్థితి. అన్నింటికీ మించీ బీజేపీకి మెజారిటీ ద‌క్క‌క‌పోతే క‌నీసం హంగ్ అయినా అనుకుంటే.. కాంగ్రెస్ పార్టీ స్ప‌ష్ట‌మైన మెజారిటీ దిశ‌గా ప‌య‌నిస్తోంది. హాఫ్ వే మార్కును దాటేసి కాంగ్రెస్ పార్టీ ముందంజ‌లో ఉంది. బీజేపీ ఏ డెబ్బై సీట్ల‌కో ప‌రిమితం అయినా పెద్ద ఆశ్చ‌ర్యం లేని ప‌రిస్థితి. 

మ‌రి మోడీ, అమిత్ షాల మంత్రాంగం ఫ‌లించ‌లేదు. మోడీ 26 ర్యాలీలు, స‌భ‌లు, రోడ్ షోల్లో అమిత్ షా ఏకంగా 31 ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో స్వ‌యంగా పాల్గొన్నారు. మోడీ.. మోడీ.. అనే మాట త‌ప్ప క‌ర్ణాట‌క‌లో మ‌రో మాట వినిపించ‌లేదు ప్ర‌చార‌ప‌ర్వంలో. మ‌రి ఇంత జేస్తే బీజేపీకి భారీ ఓట‌మే మిగులుతోంది. 

మోడీ మ్యాజిక్ ద‌క్షిణాది పూర్తిగా ప్ర‌శ్నార్థ‌కం అవుతోంది క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో. సౌత్ లో బీజేపీకి ఆశ‌లేవైనా ఉంటే అది క‌ర్ణాట‌క‌లోనే. ఇప్పుడు స్వ‌యంగా మోడీనే ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పోరాడిన చోట ఉన్న అధికారాన్ని కూడా బీజేపీ నిల‌బెట్టుకోలేక‌పోతోంది. 

అందులోనూ ఇక్క‌డ విజ‌యం కోసం మోడీ అన్ని అస్త్రాల‌నూ సంధించారు. టీ కొట్టు స్థాయి రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. ఆఖ‌రికి అదేదో ది కేర‌ళ స్టోరీ అనే సినిమాను కూడా వాడుకున్నారు. అయితే ఇవేవీ ప‌నికి రాలేదు. ముస్లింలో వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దు, హిజాబ్ వివాదం.. ఇలాంటివి కూడా బీజేపీ మెజారిటీని ఇవ్వ‌లేదు. 

మ‌రి ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా క‌ర్ణాట‌క‌లో మ‌రోసారి బీజేపీ దొడ్డిదారిని వెదుక్కోవ‌చ్చు. అందుకు అక్క‌డ అవ‌కాశాలు ఉండ‌నే ఉంటాయి. కాంగ్రెస్ లో అంత‌ర్గ‌త క‌ల‌హాల‌నో, లేక జేడీఎస్ నో అడ్డు పెట్టుకుని బీజేపీ అధికారం కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. అయితే ప్ర‌జ‌లు బీజేపీని తిర‌స్క‌రించారు. అది కూడా పూర్తిగా. అధికారానికి ఆమ‌డ‌దూరంలో పెట్టారు. మ‌రి దొడ్డిదారిలో అధికారాన్ని అందుకుంటే అది బీజేపీ గొప్ప‌ద‌నం కాబోదని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.