పవన్ ను అర్థం చేసుకోరూ!

అదేదో సినిమాలో భానుప్రియ డైలాగు ఒకటి వుంటుంది. ‘అర్థం చేసుకోరూ’ అంటూ దీర్ఘం తీస్తూ వుంటుంది. పాపం, పవన్ కళ్యాణ్ అవస్థలు చూస్తే అలాగే అనిపిస్తోంది.  Advertisement ఒక్కసారిగా చెబితే రివర్స్ అవుతారేమో? మెలమెల్లగా…

అదేదో సినిమాలో భానుప్రియ డైలాగు ఒకటి వుంటుంది. ‘అర్థం చేసుకోరూ’ అంటూ దీర్ఘం తీస్తూ వుంటుంది. పాపం, పవన్ కళ్యాణ్ అవస్థలు చూస్తే అలాగే అనిపిస్తోంది. 

ఒక్కసారిగా చెబితే రివర్స్ అవుతారేమో? మెలమెల్లగా ప్రిపేర్ చేద్దాం అన్నది పవన్ ఆలోచన. కాపులను మెల్లగా బ్రెయిన్ వాష్ చేసి, నచ్చచెప్పి, కమ్మగా పల్లకీ మోయడానికి రెడీ చేయాలని ఆ మధ్య ప్రయత్నం ప్రారంభించారు. మీరు పెద్దలు, పెద్దన్న పాత్ర పోషించాలి అంటూ మెహర్బానీ కబుర్లు చెప్పారు. 

కొన్ని కొన్ని సార్లు, కొన్ని త్యాగాలు చేయాలి. కొన్ని వదిలేయాలి అంటూ చెప్పుకువచ్చారు. కానీ పవన్ ఎంత తెలివిగా చెప్పినా జనాలకు ఎలా అర్థం కావాలో అలాగే అర్థం అయింది. పవన్ తమను ఏ దిశగా తోలుకువెళ్లాలనుకుంటున్నారో చాలా మందికి క్లారిటీ వచ్చేసింది. అలా క్లారిటీ తెచ్చుకుంటారు తప్ప, పవన్ విస్తృత ఆలోచనను అర్థం చేసుకోరూ… అనాలనిపిస్తోంది.

సరే, ఆ అంకం ముగిసింది. మొన్నటికి మొన్న పొత్తుల గురించి మాట్లాడారు. తాను సిఎమ్ పదవికి పోటీ పడడం లేదు..తెలుగుదేశానికే సిఎమ్ పదవి వదిలేస్తున్నా పరోక్షంగా చెప్పేసారు. వైకాపాను ఓడించాలి. తనకు సిఎమ్ పదవి వద్దు అంటే ఇక మిగిలింది అదేగా. దాంతో అది పార్టీ జనాల్లో ఎంత నెగిటివ్ చేయాలో అంతా చేసింది, ఆ రోజు అంతా డ్యామేజ్ కంట్రోల్ కు ఎన్ని పిడిఎఫ్ స్టేట్ మెంట్ లు వదలాలో అన్నీ వదిలారు. బ్రాడ్ గా ఆలోచిస్తే తప్ప తన వ్యూహం అర్థం కాదు అని ఓ మాట విసిరారు. 

నిజమే పవన్ వ్యూహం ఎవరికీ అర్థం కాదు అని ఆయన అనుకుంటారు. పవన్ ఎన్ని రకాల పదాలు వాడినా, భాష వాడినా, ఎన్ని మొగ్గలు వేసినా ఆయన అసలు వ్యూహం చంద్రబాబును గద్దెనెక్కించడం తప్ప వేరు కాదని జనాలకు ఎప్పుడో అర్థం అయిపోయింది.

ఇంత డ్యామేజ్ అయింది కనుక ఇక పవన్ మళ్లీ మాట మార్చాల్సి వచ్చింది. ఎన్నికల తరువాత సిఎమ్ పోస్ట్ సంగతి చూద్దాం. ముందుగా తెేదేపా, భాజపా, జనసేన కలిసి పోటీ చేస్తాయి అని కుండబద్దలు కొట్టేసారు. కానీ ఇక్కడ కూడా భలే చిత్రంగా వుంది వ్యవహారం. 

తాను కనీసం పట్టుమది పాతిక ముఫై సీట్లలో పోటీ చేయరు. తేదేపా కనీసంలో కనీసం 130 స్థానాల్లో పోటీ చేస్తుంది. పోనీ పోటీ చేసిన స్థానాలు అన్నీ జనసేన గెల్చుకుంటుంది అనుకున్నా, మెజారిటీ స్థానాలు తేదేపా చేతిలోనే కదా వుంటాయి. అప్పుడు సిఎమ్ ఎవరు అన్నది ఇప్పుడే చెప్పేయగల సంగతి. 

అంటే పవన్ హంగ్ వస్తుందని కలగంటున్నారా? తలా యాభై స్థానాలు వస్తే, తాను కింగ్ పిన్ అవుతా అని కలలు కంటున్నారా? అలాంటి పరిస్థితే వస్తే ఒక్క ఎమ్మెల్యే పవన్ దగ్గర మిగలరు. ఎగరేసి, వేలం వేసి మరీ కొనేస్తాయి తేదేపా-వైకాపా పార్టీలు. ఇది అన్యాయం అని రాయడానికి ఒక్క మీడియా కూడా పవన్ కు వత్తాసు పలకదు ఆ రోజు.

ఇప్పుడు తేదేపాకు అనుకూలంగా వున్నారు కనుక, ఆ పార్టీ అనుకుల మీడియా పవన్ కు కవరేజ్ ఇస్తోంది. కొద్దిగా దూరం జరిగి చూస్తే తెలుస్తుంది. పవన్ కు, ఆ మీడియా వ్యతిరేక విశ్వరూపం. అయినా కూడా పవన్ ఇలాగే మాట్లాడుతున్నారంటే, ఎంత బలంగా, ఎంత స్థిరంగా, ఎంత నిబద్దతో వున్నారో కదా, చంద్రబాబును గద్దె నెక్కించాలని…అది జనం, జనసైనికులు అర్థం చేసుకోరూ.