కమల దళం నోరు మెదపడం లేదేంటో?

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీకి కూడా తానే పెద్దదిక్కు అని జనసేనాని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్టున్నారు. ప్రధాని నరేంద్రమోడీని నానా బూతులు తిట్టిన చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయడానికి, ఆయన…

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీకి కూడా తానే పెద్దదిక్కు అని జనసేనాని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్టున్నారు. ప్రధాని నరేంద్రమోడీని నానా బూతులు తిట్టిన చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయడానికి, ఆయన పల్లకీ మోయడానికి బిజెపి కూడా సిద్ధమేనని, పవన్ కల్యాణ్ ప్రకటించేశారు. 

ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీతో పొత్తు అంటే.. నిజానికి అది చాలా కీలకమైన విషయం. అది కూడా, ఒకసారి పొత్తు పెట్టుకుని విడిపోయిన ఆ పార్టీనుంచి నానా దూషణలు భరించిన తర్వాత.. మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది ఇంకా సీరియస్ సంగతి. 

సాధారణంగా బిజెపి లాంటి క్రమశిక్షణ పాటించే పార్టీల్లో రాష్ట్ర నాయకత్వం కూడా ఇంత కీలకమైన సంగతిని, తమంతగా స్వేచ్ఛ తీసుకుని ప్రకటించే పరిస్థితి ఉండదు. అలాంటిది.. ఆ పార్టీ కూడా తమతో కలిసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించేయడం తమాషాగా ఉంది. అదేసమయంలో.. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోబోతున్నదని తమ పార్టీ తరఫున పవన్ ప్రకటించిన తర్వాత కూడా బిజెపి నాయకులు ఇప్పటిదాకా ఎవ్వరూ నోరుమెదపకపోవడం ఇంకా తమాషాగా ఉంది. 

రాష్ట్ర బిజెపి నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. పోరాడుతూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే.. జగన్మోహన్ రెడ్డి కంటె చంద్రబాబునాయుడును వాళ్లు పెద్దశత్రువుగా పరిగణిస్తున్నారు. 

జగన్ రాజకీయంగా తొలినుంచి ఒంటరిగా మాత్రమే పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబునాయుడును తమకు అతిపెద్దశత్రువుగా రాష్ట్ర భాజపా పరిగణిస్తోంది. అవకాశవాది, ఆషాఢభూతి వంటి నాయకుడని చంద్రబాబు అంటే భయపడుతోంది. ఆయనకు అవసరం వచ్చినప్పుడు మంచిగా ఉండి తమతో చేతులు కలిపి పబ్బం గడుపుకుంటారని, అవసరం తీరిన తర్వాత కరివేపాకులా తీసిపారేస్తారని తమ స్వానుభవం ద్వారా వారికి చంద్రబాబు మీద నమ్మకం ఉంది. 

2014లో పొత్తు పెట్టుకుని, 2019 ఎన్నికలకు ముందు కూటమినుంచి బయటకు వచ్చి మోడీ మీద ఎన్ని నిందలు వేశారో వారింకా మర్చిపోలేదు. చంద్రబాబునాయుడుతో పొత్తు విషయంలో ఏపీ బిజెపిలో ఒక పెద్ద వర్గం వ్యతిరేకంగా ఉంది. ఆ పార్టీ నాయకులెవ్వరూ కూడా ఆ విషయంలో నోరెత్తడం లేదు. 

కాగా, ఆ పార్టీకి కూడా తానే బ్యాక్ సీట్ డ్రైవర్ అయినట్టుగా మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోవడం గ్యారంటీ అని పవన్ కల్యాణ్ ప్రకటించడం విశేషం. పవన్ కల్యాణ్ తమ ఎన్డీయే కూటమిలో భాగస్వామి పార్టీగా ఉన్నారు గనుక.. ఆయన చేసిన తొందరపాటు ప్రకటన విషయంలో బిజెపి ఆచితూచి స్పందించాలనుకుంటోంది.