ఇదేం భద్రత.. పెన్ కెమెరా కాదు సెల్ ఫోనే!

చిన్న వయసులోనే భక్తి భావంతో ఉన్న 19 ఏళ్ల కుర్రవాడు కేవలం అత్యుత్సాహంతో, ఆకతాయితనంతో తనిఖీ చేసే అధికారుల కళ్ళుగప్పి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలోనికి తన మొబైల్ ఫోన్ ను…

చిన్న వయసులోనే భక్తి భావంతో ఉన్న 19 ఏళ్ల కుర్రవాడు కేవలం అత్యుత్సాహంతో, ఆకతాయితనంతో తనిఖీ చేసే అధికారుల కళ్ళుగప్పి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలోనికి తన మొబైల్ ఫోన్ ను తీసుకు వెళ్ళాడట! తిరుమల పోలీసులు కేసు తేల్చేశారు. నిందితుడిని కూడా అరెస్టు చేశారు. 

ఒకవైపు అతని మీద చర్యలు తప్పవని అంటూనే.. చిన్నవయసులోనే భక్తి భావం ఉన్న కుర్రవాడు అంటూ అతనిని కీర్తించారు. తద్వారా తప్పు చేసిన కుర్రవాడికి అతి తక్కువ శిక్ష పడేందుకు వీలుగా పోలీసులే ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. ఇదంతా బాగానే ఉంది. కానీ తనిఖీ అధికారుల కళ్ళు కప్పి అతను మొబైల్ ఫోన్ గుడిలోకి తీసుకువెళ్తే అధికారులు కళ్ళు మూసుకుని ఎలా ఉండగలిగారు? విధుల్లో ఉన్న యావత్తు పోలీసు తనిఖీలకు సంబంధించిన అధికారులపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఇదే ఇప్పుడు కీలకమైన చర్చనీయాంశం.

తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆనంద నిలయం వీడియో వైరల్ గా బయటకు వచ్చింది. గుడి లోపలి నుంచే షూట్ చేసినట్లుగా ఆ వీడియో స్పష్టంగా తెలియజేసింది. మొబైల్ ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కూడా ఆలయంలోకి అనుమతించకుండా టిటిడి విజిలెన్స్ అధికారులు, పోలీసులు కలిసి ఏర్పాటుచేసిన మూడంచెల తనిఖీ, భద్రత వ్యవస్థ నిఘాను ఈ వీడియో పరిహాసం చేసింది. 

అయితే తమ నిఘా యంత్రాలు, స్కానర్లు తమ సిబ్బంది ప్రతిభ వీటిని దాటుకుని ఒక మొబైల్ ఫోన్ ఆలయంలోకి వెళ్ళిందని ఒప్పుకోవడానికి వారికి ఈగో అడ్డు వచ్చింది. ఆనంద నిలయం వీడియో పెన్ కెమెరాతో చిత్రీకరించినట్లుగా ఉన్నదని బుకాయించే ప్రయత్నం చేశారు. తనిఖీల సమయంలో పట్టుపడకుండా పెన్ కెమెరా నిఘా సిబ్బందిని మభ్యపెట్టి ఉంటుందని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అసలు బండారం బయటపడింది. కరీంనగర్ కు చెందిన సీఏ చదువుతున్న 19 ఏళ్ల కుర్రాడు తన మొబైల్ ఫోన్ ను అధికారుల కళ్ళుగప్పి ఆలయంలోనికి తీసుకు వెళ్లినట్టు తెలుస్తోంది.

తాను ఏ ఆలయానికి వెళ్ళినా ఇలా దాని వీడియో తీసి తన స్టేటస్ లో పెట్టుకోవడం అతనికి అలవాటుట! అతని నేరం మరీ పెద్దది కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ భద్రతా సిబ్బంది వైఫల్యం మాత్రం చాలా పెద్ద నేరం. ఒక మొబైల్ ఫోన్ ఒక ప్రాంతంలో ఉంటే దాని ద్వారా బాంబు పేలుళ్లని నడిపిస్తున్న ఆధునిక ఉగ్ర సాంకేతికత ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించి ఉంది. అలాంటిది నిఘా సిబ్బంది కళ్ళు కప్పి ఆలయంలోకి ఒక మొబైల్ ఫోన్ వెళ్ళింది అంటే అది వారి చేతగానితనానికి నిదర్శనం.

ఆలయ భద్రతను వారు ఎంతగా ప్రమాదంలోకి నెడుతున్నారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేని సందర్భం ఇది. ఇలాంటి నిర్లక్ష్య సిబ్బందికి అధికారులకు శిక్ష లేకపోతే ఎలాగా ఈ విషయం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.