వచ్చే సారి రాష్ట్రపతి ఎన్నికల్లో బిహార్ సీఎం నితీష్ కుమార్ ను తమ అభ్యర్థిగా నిలపాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ అంశంపై లేటు లేకుండా స్పందించారు నితీష్ కుమార్. తనను రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తున్నారనే వార్తలపై ఆయన స్పందిస్తూ.. తనకు ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదని తేల్చారు.
ఇటీవలే ప్రశాంత్ కిషోర్, నితీష్ ల సమావేశం నేపథ్యంలో ఊహాగానాలు మొదలయ్యాయి. మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ స్పందన కూడా నితీష్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించనున్నారనే ఊహాగానాలకు ఊతం ఇచ్చింది. బీజేపీతో బంధాన్నితెంచుకుని వస్తే నితీష్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించడానికి సిద్ధమనే సంకేతాలను ఈ కూటమి నేతలు ఇస్తున్నారు. అయితే.. నితీష్ మాత్రం తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.
ఇక ఈ అంశంపై జేడీయూ నేతలు మాట్లాడుతూ.. నితీష్ లాంటి బడా నేతపై ఇలాంటి చర్చ సాగడం సహజమే అంటున్నారు. తద్వారా నితీష్ కు అలాంటి అర్హత ఉందని వీరు చెప్పదలిచినట్టుగా ఉన్నారు. తద్వారా ఊహాగానాలకు తెరదించే ఉద్దేశం జేడీయూకు లేనట్టుగా ఉందనే క్లారిటీ వస్తోంది.
ఇంతకీ రాష్ట్రపతి ఎన్నికల గురించి బీజేపీ స్ట్రాటజీ ఇంకా వెలుగులోకి రావడం లేదు. ప్రతిపక్ష కూటమి నుంచి మాత్రం ఇందుకు రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. గతంలో శరద్ పవార్ పేరు, ఇప్పుడు నితీష్ కుమార్ పేరు ఈ అంశంపై తెర మీదకు వచ్చింది.