దేశంలో ఇప్పటి వరకూ జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య డెబ్బై ఆరు కోట్లను దాటేసింది. కోవిడ్ ఇండియాలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరీక్షల నంబర్ ఇది. దేశ జనాభాలో సగం స్థాయి కన్నా ఎక్కువగానే పరీక్షలు జరగడం గమనార్హం.
అయితే వీటిల్లో అవసరాన్ని, సింప్టమ్స్ ను బట్టి రెండుమూడు సార్లు పరీక్షలు చేయించుకున్న వారు కూడా ఉంటారు. అలాగే పరీక్షల వరకూ వెళ్లకుండా కోవిడ్ ట్రీట్ మెంట్ పొందిన వారు కూడా దేశంలో కోట్ల మంది ఉండవచ్చు.
ప్రయాణాలకూ, కొన్ని రకాల ఎంట్రీల కోసం కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో కూడా ఇప్పటికీ దేశంలో భారీ ఎత్తున కోవిడ్ పరీక్షలు జరుగుతున్నాయి. గత 24 గంటల్లో కూడా 11 లక్షలకు పైగా టెస్టులు జరిగాయని కేంద్రం ఇస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం 15 వేల స్థాయిలో ఉంది.
గత కొన్నాళ్లుగా క్రమం తప్పకుండా తగ్గుముఖం పడుతూ ఉంది థర్డ్ వేవ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య 15 వేల స్థాయికి తగ్గింది. రెండో వేవ్ పూర్తయిన దశలో రోజువారీ కేసుల సంఖ్య పది వేల లోపు స్థాయికి చేరింది. ఏడెనిమిది వేల స్థాయిలో రోజువారీగా కరోనా కేసులు కనిష్ట స్థాయిలో రికార్డయ్యాయప్పుడు.
మూడో వేవ్ దాదాపు ముగిసిందనుకుంటున్న తరుణంలో ఇప్పుడు రోజువారీ కేసులు 15 వేల స్థాయిలో ఉన్నాయి. గ్రాఫ్ అవరోహణ మార్గం దిశగా వేగంగా సాగుతుండటంతో మరో వారం రోజుల్లోపే థర్డ్ వేవ్ కేసుల సంఖ్య పూర్తి కనిష్ట స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.