తిరుమలేశుని దర్శనానికి వచ్చే భక్తుల్లో కొందరు మాత్రమే పాల్గొనే ఆర్జిత సేవల టికెట్ల ధరలను పెంచాలని టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. అమల్లోకి తేలేదు. అయితే అప్పుడే ఈ నిర్ణయాన్ని తప్పు పట్టడం మొదలైంది.
టీటీడీ బోర్డు సమావేశం వీడియోలను ట్రోల్ చేస్తూ, ధరలు పెంచడాన్ని అడ్డగోలుగా విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్ ను గమనిస్తే.. ఎవరైనా సరే.. టీటీడీ భక్తులను ఎడాపెడా దోచేసుకుంటున్నదని అనుకునే ప్రమాదం కూడా ఉంది. కానీ టీటీడీ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. సమర్థించదగినది.
ఇందులో వాస్తవాలు ఏంటంటే..
తిరుమల వేంకటేశ్వర స్వామివారిని ప్రతినిత్యం సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకుంటారు. వీరిలో ఆర్జితసేవలకు వెళ్లే భక్తులు కనీసం పదిశాతం మంది కూడా ఉండరు. సుప్రభాతం, అర్చన, తోమాల సేవల టికెట్లు అనేవి సామాన్యులకు బ్రహ్మపదార్థమే. వీటిని కౌంటర్ ద్వారా పొందే సామాన్య భక్తులు చాలా పరిమితంగా మాత్రమే ఉంటారు. అయితే.. ట్రోలింగ్ లు మాత్రమే చూస్తున్న వాళ్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ టికెట్ల ధరలను టీటీడీ పెంచడం లేదు.
సుప్రభాతం, అర్చన, తోమాల టికెట్లను సిఫారసు ఉత్తరాల ద్వారా పొందే భక్తులే వేలల్లో ఉంటారు. వీరందరూ ‘తాము వీఐపీలు’ అని అనుకుంటున్న వాళ్లు. ఎమ్మెల్యేల నుంచి, బోర్డు మెంబర్ల నుంచి, మంత్రులనుంచి ప్రత్యేకించి సిఫారసు ఉత్తరాలు తెచ్చుకుంటారు. ఇలా సిఫారసు ఉత్తరాల ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందాలనుకుంటున్న వారికి మాత్రమే టికెట్ ధరలను పెంచాలనేది ప్రస్తుతం టీటీడీ బోర్డు నిర్ణయం.
సుప్రభాతం టికెట్ ను రూ. 2000 చేయాలని, అర్చన, తోమాల టికెట్లను రూ.5000 చేయాలని టీటీడీ నిర్ణయించింది. కల్యాణోత్సవం టికెట్లను కూడా భారీగా పెంచాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా సిఫారసులతో వచ్చే వీఐపీలకు మాత్రం టికెట్ ధర పెంచితే.. అందరూ విలపించడం ఎందుకు? అక్కడికేదో స్వామివారి సామాన్య భక్తులకు ద్రోహం జరిగిపోతున్నట్లుగా గగ్గోలు పెట్టడం ఎందుకు?
తమకు కొమ్ములు వచ్చాయని, సామాన్య భక్తుల్లాగా క్యూలో నిల్చుని టికెట్లు తీసుకునే స్థాయి తమది కాదని, తాము మహానుభావులం అని, మంత్రులు/ ఎమ్మెల్యేలు తమకోసం సిఫారసు ఉత్తరాలిస్తే.. అడ్డదారిలో వెళ్లి భగవంతుడిని సేవించుకోవచ్చునని వాళ్లు తమ గురించి తాము అనుకుంటే తప్పులేదు. వాళ్లు గొప్పవాళ్లే కావొచ్చు. కానీ.. గొప్పవాళ్లు కాస్త ఎక్కువ ఖరీదు పెట్టి టికెట్లు కొనుగోలు చేస్తే ఏమవుతుంది? టికెట్ ధర ఎక్కువ అనిపిస్తే.. ఎంచక్కా క్యూలైన్లో వెళ్లి అత్యంత తక్కువ ధరకే ఆర్జిత సేవల టికెట్లు పొందవచ్చు కదా. అదికూడా దండగ అనిపిస్తే.. అంతకంటె సులువుగా 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి, ఉచిత దర్శనానికి కూడా వెళ్లవచ్చు. భగవంతుడు మారిపోడు.
భగవంతుడు సమదృష్టిగలవాడు. అందరినీ సమానంగానే చూస్తాడు. ఆర్జితసేవలకు వచ్చిన భక్తులను ప్రత్యేకంగా, ఉచిత క్యూలైన్లో వచ్చిన వాళ్లని చీప్ గా చూసే అలవాటు భగవంతుడికి ఉండదు. తాము వీఐపీలు అనుకునే వాళ్లు, సిఫారసు ఉత్తరాలు తెచ్చుకునే వాళ్లు దానికి తగ్గట్టుగా పెద్దమొత్తాలను చెల్లించడానికి కూడా సిద్ధపడాలే తప్ప.. టీటీడీ నిర్ణయాన్ని తప్పు పట్టకూడదు.
సంపన్నులే అయినప్పటికీ.. దేవుడి టికెట్ కోసం ఖర్చు పెట్టడానికి మాత్రం ఏడ్చే వారికి మాత్రమే ఈ నిర్ణయం తప్పు అనిపిస్తుంది. సామాన్యుల దృష్టికోణంలో చూసినప్పుడు.. టీటీడీ సిఫారసు ఉత్తరాల ద్వారా పొందే ఆర్జితసేవల టికెట్ ధరలను పెంచడం అనేది సబబు అనే అందరూ ఒప్పుకుంటారు.