పవన్ కల్యాణ్ అభిమానులంటేనే అదో టైపు. తమ ప్రేమను పీక్స్ లో చూపిస్తుంటారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాళ్లు పట్టించుకోరు. అదేంటని అడిగితే పవనిజం అంటారు. జనసేనానిపై ఉన్న అభిమానం అలాంటిదంటారు.
మొన్నటిమొన్న పవన్ రోడ్ షో చేస్తే, వెనక నుంచి వచ్చిన ఓ అభిమాని అమాంతం కౌగలించుకునే ప్రయత్నం చేశాడు. ఆ టైమ్ లో పవన్ నేల మీద లేరు. కారు టాప్ పై నిల్చున్నారు. ఆ టైమ్ లో అలా చేస్తే ఆయనకు ప్రమాదం అని కూడా ఆలోచించకుండా ఎగిరి దూకేశాడు పిచ్చి అభిమాని. పాపం, పవన్ కాలుజారింది. బౌన్సర్లు ఉన్నారు కాబట్టి సరిపోయింది.
ఇలాంటివి పవన్ కు ఎన్నో అనుభవాలున్నాయి. పవన్ చెబితే వినే రకం కాదు ఆయన అభిమానులు. తమకు తోచింది చేసుకుంటూ పోతారంతే. గతంలో ఓసారి ఇలానే ఓ సినిమా ఫంక్షన్ లో పవన్ మాట్లాడుతుంటే, అందర్నీ దాటుకుంటూ, బౌన్సర్లను తప్పించుకుంటూ స్టేజ్ ఎక్కేశాడు ఓ అభిమాని. పవన్ చేయి పట్టుకొని గట్టిగా లాగాడు. ఆ వెంటనే బౌన్సర్లు తేరుకున్నారు. సదరు వ్యక్తికి దెబ్బలు తప్పలేదు, పవన్ చేతికి గాయాలు తప్పలేదు.
మొన్నటి రోడ్ షోలో కూడా పవన్ అభిమానుల్ని బౌన్సర్లు లాగి అవతల పడేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా పవన్ అభిమానలు తగ్గరు, పైపెచ్చు తమ ప్రేమను మరింత చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు భీమ్లానాయక్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వస్తోంది.
ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా ఫంక్షన్ ఓసారి వాయిదా పడింది కూడా. ఇలా భారీ హైప్ మధ్య ఏర్పాటుచేసిన ఈ ఫంక్షన్ లో పవన్ అభిమానులు రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి అభిమానులు ఎన్ని సిత్రాలు చూపిస్తారో.. ఇంకెన్ని వేషాలు వేస్తారో?
అటు పోలీసులు మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ గ్రౌండ్స్ వైపు వాహనాలు రాకుండా ట్రాఫిక్ మళ్లించారు. ఈరోజు మధ్యాహ్నం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. మంత్రి కేటీఆర్ ఈ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు.