కర్ణాటక ఎన్నికల ఫలితాలు రేపు (శనివారం)వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక కొత్త సీఎం ఎవరవుతారనేది ఆసక్తిదాయకమైన అంశంగా నిలుస్తోంది. బహుశా ఎన్నికల ఫలితాల నాడు ఏ పార్టీ వైపు ప్రజల మొగ్గు ఉందో తెలిసినా.. సీఎం ఫేస్ ఎవరనేది తేలకపోవచ్చు!
హంగ్ తరహా ఫలితాలు వస్తాయనే అంచనాలు ఇందుకు ఒక కారణం. మరోవైపు బీజేపీ ఏం గేమ్ అయినా ఆడనూ గలదు! ఇలాంటి నేపథ్యంలో కర్ణాటక ఇప్పటి వరకూ చూడని కొత్త ముఖాన్ని సీఎంగా చూడవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కేస్ 1.. కాంగ్రెస్ కు పూర్తి మద్దతు దక్కితే.. ఇద్దరు సీఎం అభ్యర్థులున్నారు. వారిలో ఒకరు మాజీ సీఎం సిద్ధరామయ్య, మరొకరు డీకే శివకుమార. వీరిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపినా మరొకరు అసంతృప్తులుగా తయారు కావడంలో వింత లేదు. డీకేశివకుమార ఒక్కలిగ నేత. ఆర్థికంగా బలవంతుడు. సీబీఐ కేసులున్నాయి. ఇక సిద్ధరామయ్య కురుబ సామాజికవర్గానికి చెందిన మాజీసీఎం. గతంలో జేడీఎస్ నేత. కాంగ్రెస్ లోకి వచ్చి సీఎం స్థాయికి ఎదిగాడు. గతంలో ఐదేళ్ల పాటు సీఎంగా వ్యవహరించాడంటే అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోగల దాసుడని అర్థం. అయితే కాంగ్రెస్ కు సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దక్కితే వీరిద్దరి మధ్యన పోటీ ఉంటుంది. వీరిని రాజీ చేసి ఎవరో ఒకరిని కాంగ్రెస్ సీఎంగా ఒప్పించాలి. మరి ఒప్పుకోకపోతే.. మరొకరు అసంతృప్తుడిగా మారి కొంతమంది ఎమ్మెల్యేలను ఎగరేసుకుని బీజేపీ వద్దకు వెళ్లే ఛాన్సులూ ఉంటాయి. వాటిని బీజేపీ ఆమోదిస్తుంది కూడా! అదంతా వేరే కథ.
కేస్ 2.. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం. బీజేపీని కట్టడి చేయాలనే లెక్కలతో కాంగ్రెస్-జేడీఎస్ లు చేతులు కలిపితే.. కచ్చితంగా కొత్త సీఎం అభ్యర్థి తెరపైకి వస్తారు. జేడీఎస్ కు 25 లోపు సీట్లు వచ్చి కాంగ్రెస్ కు వంద ఎమ్మెల్యేల బలం వరకూ వస్తే.. అటు డీకేశి, ఇటు సిద్దరామయ్య కాకుండా.. కాంగ్రెస్ అధిష్టానం జేడీఎస్ ఆమోదం కూడా పొందిన మరొకరిని సీఎంగా చేయవచ్చు. సిద్దరామయ్య జేడీఎస్ నుంచి వచ్చిన వాడు. తమను కాదని వెళ్లిన సిద్దరామయ్య అంటే కుమారస్వామికి, దేవేగౌడకు కోపం. ఇక డీకేశి – కుమారస్వామిలు ఒకే సామాజికవర్గం. ఒక్కలిగలపై దేవేగౌడ కుటుంబ ఆధిపత్యానికి గండికొట్టింది డీకేశినే. బెంగళూరులో కనకపుర వైపు జేడీఎస్ వైభవానికి డీకేశి గండి కొట్టాడు. అలాంటి డీకేశిని సీఎంగా చేసి.. మరింత పైకి ఎదగడానికి జేడీఎస్ ఫస్ట్ ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. దీంతో జేడీఎస్ ఆమోదం ఉన్న కాంగ్రెస్ నేతను సీఎంగా చేయాల్సి ఉంటుంది కాంగ్రెస్ హైకమాండ్.
కేస్ 3.. బీజేపీ, జేడీఎస్ .. ఈ రెండు పార్టీలూ చేతులు కలిపే అవకాశాలూ ఉండనే ఉన్నాయి. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే నయా బీజేపీ సిద్ధాంతం కాబట్టి.. ఎంఐఎం దోస్తీ అయిన జేడీఎస్ తో కూడా ఆ పార్టీ స్నేహం చేయగలదు. జరిగినన్ని రోజులు జరిపి వీలైతే జేడీఎస్ ఎమ్మెల్యేలను తన వైపుకు లాక్కొని కుమారస్వామిని ఇంటికీ పంపగలదు! మహారాష్ట్రలో షిండేను సీఎం సీట్లో కూర్చోబెట్టినట్టుగా బీజేపీ కుమారస్వామికి అవకాశం ఇచ్చి, బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేయనూగలదు.
కేస్ 4.. బీజేపీ సోలోగా ప్రభుత్వం. ఈ ఛాన్సులు అయితే పెద్దగా ఉన్నట్టుఆ లేవు. షెడ్యూల్ వచ్చే సమయానికే బీజేపీ పై వ్యతిరేకత అనే విశ్లేషణలు బాగా వినిపించాయి. పోస్ట్ పోల్ సర్వేలు కూడా బీజేపీకి ఛాన్సులు తక్కువ అంటున్నాయి. సోలోగా అయితే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవచ్చు. అయితే గవర్నర్ ఎలాగూ అనుకూలంగా ఉంటారు కాబట్టి.. ముందుగా బీజేపీ ఎవరో ఒకరి చేత సీఎంగా ప్రమాణస్వీకారం చేయించవచ్చు. ఆ తర్వాత విశ్వాస పరీక్ష సమయానికి జేడీఎస్ నో, కొంతమంది ఎమ్మెల్యేలనో తన వైపుకు తిప్పుకునే బేరసారాలు చేయవచ్చు. అయితే ఆదిలోనే బేరసారాలకు ఎమ్మెల్యేలు దొరికే ఛాన్సులు తక్కువ.
ఎంత ఎమ్మెల్యేలను కొనాలన్నా.. ఏడాదో రెండేళ్లో సమయం పడుతుంది బీజేపీకి. 2018లో ఇలాగే చేశారు. ముందుగా యడియూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే విశ్వాస పరీక్షలో నెగ్గలేక రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏడాదిన్నర కు కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేలను బయటకు లాగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సారి కూడా బీజేపీ అలాంటి అవకాశాల కోసమే చూస్తూ కర్ణాటక రాజకీయాన్ని భ్రష్టు పట్టించడం తప్ప వేరే అవకాశాలు లేనట్టున్నాయి! అయితే ఈ సారి సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదా అయినా బీజేపీకి దక్కుతుందా అనేది ఇంకా ప్రశ్నార్థకమే. అది కూడా దక్కకపోతే గౌరవంగాప్రతిపక్షంలో కూర్చోవడం బీజేపీకి మర్యాద. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే కలల్లో బీజేపీ ఇలాంటి గౌరవాలను పట్టించుకోవడం లేదు!