కాదేదీ కవితకనర్హం అన్నట్టు, సినిమాల విషయంలో కూడా వివాదానికి ఏదీ అనర్హం కాదు అన్నట్టు మారింది పరిస్థితులు. ఒకప్పుడు సినిమాలో కంటెంట్ తో వివాదాలు పుట్టేవి. కానీ ఇప్పుడు జనం అంతవరకు కూడా ఆగట్లేదు. పోస్టర్ పడ్డమే ఆలస్యం, వివాదం చుట్టుముడుతోంది. అదొక సెన్సేషన్ అయిపోయింది. ఈ సీజన్ లో అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సినిమాలు వివాదాస్పదమవ్వడం ఆశ్చర్యం.
2 రోజుల కిందటి సంగతి. ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న టైమ్. ఊహించని విధంగా ఈ సినిమా పోస్టర్ వివాదాస్పదమైంది. పైన పవన్ కల్యాణ్ ఫొటో పెట్టి, ఆయన బూటు కాళ్ల కింద ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ప్రింట్ చేశారు.
సాధారణంగా ఈ పోస్టర్ లో ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలు కనిపించవు. కానీ పూనమ్ కౌర్ కు మాత్రం అందులో తప్పు కనిపించింది. భగత్ సింగ్ పేరును పవన్ కాళ్ల కింద పెట్టడం ఏంటి? నిర్లక్ష్యమా, అహంకారమా? అని సూటిగా ప్రశ్నించింది. దీనిపై సహజంగానే పవన్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. మరోసారి పూనమ్ కౌర్ ను టార్గెట్ చేశారు. అయితే యూనిట్ మాత్రం వెంటనే అలర్ట్ అయింది. పూనమ్ సూచనను పరిగణలోకి తీసుకుంది. టైటిల్ ను కింద కాకుండా పైన లేదా పక్కన పెట్టి కొత్త పోస్టర్లు రిలీజ్ చేసింది.
ఇలాంటిదే మరో వివాదం విజయ్ దేవరకొండ కొత్త సినిమాపై నడిచింది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ కూడా పెట్టలేదు. కాన్సెప్ట్ పోస్టర్ అంటూ ఓ స్టిల్ రిలీజ్ చేశారు. అయితే అది హాలీవుడ్ మూవీ ఆర్గో పోస్టర్ ను కాపీ కొట్టేలా ఉంది. దీంతో సోషల్ మీడియాలో దీనిపై చాలా విమర్శలు చెలరేగాయి. ఒక దశలో నిర్మాత నాగవంశీ ఈ అంశంపై స్పందించాల్సి వచ్చింది. అది కాకతాళీయం తప్ప కాపీ కాదంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఇలాంటిదే మరో వివాదం ఈమధ్య ఇంకాస్త ఘాటుగా నడిచింది. అది కూడా విజయ్ దేవరకొండ సినిమానే. సమంత హీరోయిన్ గా, విజయ్ దేవరకొండ హీరోగా ఖుషి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తాజా పోస్టర్ లో 'ది దేవరకొండ' అని ప్రింట్ చేశారు. దీనిపై అనసూయ పరోక్షంగా స్పందించింది. ఈ పైత్యం మనకు అంటకుండా జాగ్రత్తపడాలంటూ సెటైర్లు వేసింది. దీంతో 'రౌడీ బాయ్స్' భగ్గుమన్నారు. అనసూయపై విరుచుకుపడ్డారు. ఆ వివాదాన్ని దశలవారీగా అలా కొనసాగిస్తూనే ఉంది అనసూయ. అటు ఫ్యాన్స్ కూడా తగ్గేదేలే అంటున్నారు.
ఇలా ఒకే టైమ్ లో 3 పోస్టర్లు వివాదాస్పదమవ్వడం ఆశ్చర్యం కలిగించే అంశమే. దీనితో అర్థమైంది ఏంటంటే, ఇకపై పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా మేకర్స్ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిది.