విశాఖపట్నంలో ఉన్న రామానాయుడు స్టూడియో విషయంలో ముఖ్యమంత్రి జగన్ కి ముడిపెట్టి మరీ చాలా విమర్శలు చేసిన తెలుగుదేశం నేతలకు కోర్టు పరంగా షాక్ బాగానే తగిలింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు ప్రజా ప్రయోజనాలు అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీన్ని విచారించిన కోర్టు ఇందులో ప్రజా ప్రయోజనాలు ఎక్కడ ఉన్నాయంటూ కేసుని కొట్టేసింది. తమ ప్రభుత్వం ఇరవై ఏళ్ల క్రితం విశాఖలో 35 ఎకరాల భూమిని స్టూడియో నిర్మాణానికి ఇస్తే దాంటో నివాసిత లే అవుట్లు వేస్తున్నారని, దానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయలని పిటిషన్ లో కోరారు.
నిబంధలనకు ఇది విరుద్ధం అని అందులో పేర్కొన్నారు. అన్నీ పరిశీలించి విచారించిన కోర్టు అది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం ఇందులో పేదలకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. స్టూడియో యజమానికి సంబంధించిన భూమి అని కోర్టు పేర్కొంది. ఈ కేసులో న్యాయం స్థానం లే అవుట్లు వేయకుండా అనుమతులు ఇవ్వకుండా ఉత్తర్వులను రద్దు చేయలేదని చెబుతూ కేసుని కొట్టేసింది.
ఈ పరిణామం రామానాయుడు స్టూడియో విషయంలో రచ్చ చేస్తున్న తమ్ముళ్లకు షాక్ గానే మారింది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అయితే స్టూడియో తన భూముల్లో లే అవుట్లు వేస్తూంటే ముఖ్యమంత్రి జగన్ని కూడా తెచ్చి విమర్శలు చేశారు విశాఖలో భూములను జగన్ రాయించేసుకుంటున్నారు అని మండిపడ్డారు.
న్యాయపోరాటం చేస్తామని, ఎందాకైనా వెళ్ళి మరీ జీవీఎంసీ కమిషనర్ తో సహా బాధ్యులను బోనులో నిలబెడతామని బండారు ప్రకటించారు. ఆ మీదట టీడీపీ ఎమ్మెల్యే కేసు వేశారు. అయితే ఇందులో అసలు ప్రజా వాజ్యమే లేదని కోర్టు తేల్చింది. ఇంతలా టీడీపీ తమ్ముళ్ళు ఎందుకు రచ్చ చేశారు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖలో ఎక్క్కడ ఏమి జరిగినా జగన్ కి ముడిపెడుతూ విమర్శలు చేస్తున్నారని, ఇపుడు కోర్టు షాక్ ఇచ్చిందని అంటున్నారు. రామానాయుడు టీడీపీ ఎంపీ, ఆయన ఆ పదవిలో ఉండగానే విశాఖలో భూములను నాటి సీఎం చంద్రబాబు ఇచ్చారు.
అక్కడ స్టూడియో కట్టినా షూటింగులు అయితే జరగడంలేదు. స్టూడియో అధినేత అయిన సురేష్ బాబు ఖాళీగా ఉన్న స్టూడియో భూములలో రెసిడెన్షియల్ లే అవుట్లు వేయడానికి సిద్ధపడ్డారు. ఇందులో నిబంధనల ప్రకారం అన్నీ చూసి జీవీఎంసీ కమిషనర్ అనుమతించారు. అయినా సరే ఇందులో వైసీపీని లాగి రాజకీయం చేయాలని చూసిన తమ్ముళ్ళకు ఇపుడు కోర్టు ద్వారా చెక్ పడింది అని అంటున్నారు.