ఒక కుక్కను చంపాలంటే దానిపై పిచ్చిది అని ముద్ర వేయడం చంద్రబాబు, ఈనాడుల ఉమ్మడి సిద్ధాంతం. ఈ విషయంలో తనమన అనే తేడాలుండవని, ఆఖరికి టీడీపీ నుంచి నేతలను బయటకు పంపాలన్నా.. వారి విషయంలో కూడా ఇదే సిద్ధాంతం అమలు చేస్తారనేది పాత కథ. ఇలాంటి గేమ్స్ తో చాలా మంది అడ్రస్ ను గల్లంతు చేసిన ఘనత పచ్చ బ్యాక్ ఉండనే ఉంది.
మరి ఇప్పుడు వీరి టార్గెట్ లో జగన్ ఉన్నాడు. జగన్ పాలనను తప్పు పట్టాలి, అది కూడా 365 రోజులూ. గతంలో అయితే ఇలాంటివి ఈనాడు అండ్ కో కు వెన్నతో పెట్టిన విద్య. సారా ఉద్యమంతో మొదలుపెడితే ప్రత్యర్థుల కూసాలు కదిల్చేందుకు లెక్కలేనన్ని వ్యూహాలు అమలు పెట్టి.. ప్రభుత్వాలను కూల్చాలన్నా, మార్చాలన్నా తామే అని రామోజీరావు చిద్విలాసంగా నవ్వేవారట! పాత తరం ఈనాడు జర్నలిస్టులే ఈ మాట చెబుతూ ఉన్నారు.
మరి ఇలాంటి ఈనాడు అస్త్రాలు అంటే.. ఒక్కో దశలో ఒక్కోరు. ఈనాడు అనుకుంటే ఎవరినైనా మేధావిని చేయగలదు, ఏ మేధావిని అయినా మూర్ఖుడని చూపించనూగలదు. ఇలా ఈనాడు మలిచిన హీరోలెంతో మంది ఉన్నారు. గత రెండు దశాబ్దాల్లో కూడా రామోజీ చేసిన హీరోలుగా లోక్ సత్తా జేపీ, సీబీఐ లక్ష్మినారాయణ వంటి వారు నిలిచారు. రాఘవులు, నారాయణ వంటి వారిని కూడా అవసరానికి వాడారు. ఇంకా అవసరం పడితే.. చంద్రబాబును లేపడానికి ఢిల్లీ నుంచి మనుషులను పురమాయించే వారు. అదంతా ఒక భ్రమల లోకం.
మరి అలాంటి వ్యూహకర్తల నుంచి మరీ జీవీ రావు లాంటి క్యారెక్టర్ ఏమిటో మరి. ఇతడేమో ఆర్థికవేత్త అని ఈనాడు చెబుతుంటే గూగుల్ లో గాలిస్తే రకరకాల వార్తలు వస్తున్నాయి. అలాగే సినిమాల్లో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అని అర్థం అవుతోంది. మరీ ఇలా గాలిగన్నారావుల్లాంటి వాళ్లు ఈనాడు మార్కు ఆయుధాలు అయినట్టుగా ఉన్నారు.
ఒకానొక దశలో తమకు నచ్చని ప్రభుత్వాలను కూల్చడానికి, తమకు నచ్చిన ప్రభుత్వాలను నిలబెట్టేందుకు వాడుకోవడానికి అనుగుణంగా చాలా మంది మేధావులను తయారు చేసిన రామోజీ రావుకు అవసాన దశలో జీవీ రావు లాంటి వాళ్లే మిగిలినట్టుగా ఉన్నారు. మరీ టిక్ టాక్ బ్యాచ్ తో పనవుతుందా!