కొంపముంచిన యాడ్.. స్టార్ బక్స్ పై ట్రోలింగ్

కాస్త రిచ్ గా కాఫీ తాగాలంటే స్టార్ బక్స్ కు వెళ్లాల్సిందే. పేజ్-3 జనాలకు కేరాఫ్ అడ్రస్ ఈ కాఫీ షాప్. టాటా గ్రూప్ కు చెందిన ఈ కాఫీ షాప్స్ పై ఇప్పటివరకు…

కాస్త రిచ్ గా కాఫీ తాగాలంటే స్టార్ బక్స్ కు వెళ్లాల్సిందే. పేజ్-3 జనాలకు కేరాఫ్ అడ్రస్ ఈ కాఫీ షాప్. టాటా గ్రూప్ కు చెందిన ఈ కాఫీ షాప్స్ పై ఇప్పటివరకు ఎలాంటి వివాదాల్లేవు. ఊహించని విధంగా ఈ కంపెనీ చేసిన పనితో, తనకుతానే వివాదానికి కేంద్రబిందువుగా మారింది ఈ కంపెనీ. తాజా వివాదానికి కారణం, స్టార్ బక్స్ యాడ్.

నిజానికి ఈ బ్రాండ్ కు ప్రమోషన్ అక్కర్లేదు. వీళ్లకు ఫిక్స్ డ్ కస్టమర్లు ఉన్నారు. అయినప్పటికీ కొత్త వినియోగదారుల్ని ఆకర్షించేందుకు ఈ కంపెనీ, ఓ యాడ్ రూపొందించి వదిలింది. ఆ యాడ్ లో తల్లిదండ్రులు తమ కొడుకు అర్పిత్ కోసం ఎదురుచూస్తుంటారు. కట్ చేస్త, అర్పిత్ స్థానంలో అర్పితా వస్తుంది. అంటే.. అర్పిత్ కాస్తా అర్పితాగా లింగమార్పిడి చేయించుకున్నాడన్నమాట.

కొడుకు, కూతురుగా మారినప్పటికీ తండ్రి యాక్సెప్ట్ చేశాడనేది యాడ్. ఫైనల్ సారాంశం ఏంటంటే.. మీరు ఎవరైనా, ఏలాగున్నా, స్టార్ బక్స్ మీకు సేవలందిస్తుంది. ‘ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ నేమ్’ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించింది. దీనిపై సోషల్ మీడియాలో పెను దుమారం చెలరేగుతోంది.

నిజానికి కాఫీలు అమ్ముకోడానికి, ఇలా లింగమార్పిడి కాన్సెప్ట్ పై యాడ్ తీయడానికి సంబంధం లేదు. ఎమోషనల్ గా కనెక్ట్ చేయడానికి సదకు యాడ్ ఏజెన్సీ ఈ కాన్సెప్ట్ ను ఎంచుకున్నప్పటికీ, దీన్ని చాలామంది నెటిజన్లు నిరసిస్తున్నారు. పాశ్చాత్య పోకడల్ని ఇండియాకు తీసుకొచ్చేలా తయారైన ఈ యాడ్ ప్రసారాన్ని నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. పనిలోపనిగా 'బాయ్ కాట్ స్టార్ బక్స్' అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడిస్తున్నారు. మీరు కాఫీలు అందిస్తే చాలు, పాశ్చాత్య పోకడల్ని కూడా అందించాల్సిన అవసరం లేదని కొందరు చురకలంటిస్తున్నారు.

తాజా నిరసనతో స్టార్ బక్స్ ఇరకాటంలో పడింది. నిజానికి యాడ్స్ అన్నీ సమకాలీన అంశాలపై తెరకెక్కుతుంటాయి. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు చర్చిస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం, చర్చనీయాంశమవ్వడంతో పాటు.. వివాదాస్పదమైంది. ఈ లింగమార్పిడి వెనక స్వలింగ సంపర్క వివాహాల ఎజెండా ఉందనేది చాలామంది ఆరోపణ.

మరికొంతమంది ఇందులో సామాజిక వర్గం కోణాన్ని కూడా చూస్తున్నారు. అర్పిత్-అర్పితా పేర్లు పెట్టి యాడ్స్ తీసిన ఆ జనం.. దమ్ముంటే మరో వర్గానికి చెందిన వ్యక్తుల పేర్లు పెట్టి ఇదే యాడ్ తీయగలరా అంటూ సవాల్ విసురుతున్నారు. ప్రతి ఒక్కరికి హిందూ మతం సాఫ్ట్ టార్గెట్ అయిపోయిందని, ఇకపై అలాంటివి సహించేది లేదంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు.

బాయ్ కాట్ స్టార్ బక్స్ అంటూ మొదలైన ఈ ఆన్ లైన్ ఉద్యమం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. దీనిపై సదరు కంపెనీ ఇంకా రియాక్ట్ అవ్వలేదు.