ఎన్నికల ప్రచారం, పోలింగ్ పూర్తి కాగానే వెనువెంటనే సింగపూర్ కు వెళ్లడం కుమారస్వామి హాబీ లాగుంది. గత పర్యాయం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే సింగపూర్ ఫ్లైట్ ఎక్కిన కుమారస్వామి, ఇప్పుడూ అదే చేశారు. పోలింగ్ పూర్తి కాగానే ఆయన చలో సింగపూర్ అన్నారు.
మరోవైపు కర్ణాటకలో ఎటు తిరిగీ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ఆరాటంతో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ లు కుమారస్వామి వైపు ఆశగా చూస్తున్నట్టుగా ఉన్నాయి. కనీస మెజారిటీ ఈ రెండు పార్టీలకూ దక్కని పక్షంలో, మెజారిటీకి పది, ఇరవై సీట్లు అవసరం అయితే జేడీఎస్ మద్దతు తీసుకోవడానికి ఆ పార్టీలు మొగ్గుచూపుతున్నాయి.
గత పర్యాయం అయితే కుమారస్వామికి సీఎం సీటును సైతం ఇచ్చేసింది కాంగ్రెస్. అయితే అప్పుడు జేడీఎస్ వద్ద 37 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే ఈ సారి జేడీఎస్ కు కనిష్టంగా 13, గరిష్టంగా 24 అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్ . కాంగ్రెస్ పరిస్థితి మెరుగవ్వచ్చని చెబుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. జేడీఎస్ కు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాటా ఇవ్వొచ్చు కానీ సీఎం సీటు కాదు.
ఇక ఎన్నికల్లో జేడీఎస్ వాళ్లు ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని బరిలో దిగారు. జేడీఎస్-ఎంఐఎంలు భాయీభాయీ అని ఆ పార్టీ వాళ్లు చాన్నాళ్లుగా చెబుతున్నారు. ముస్లింలు కాంగ్రెస్ కు ఓటేయొద్దని జేడీఎస్ కే వేయాలని అసద్ చెబుతూ వచ్చారు. మరి ఇప్పుడు అలాంటి ఎంఐఎం పొత్తుతో బరిలోకి దిగి సీట్లను సాధించిన జేడీఎస్ తో పొత్తుకు బీజేపీ సై అంటుందా అంటే.. ఇప్పటికే బీజేపీ నేతలు ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నారట!
అధికారానికి కాస్త దూరంలో కాదు, ఎంత దూరంలో నిలిచినా తనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది బీజేపీ సిద్ధాంతం. ఇలాంటి నేపథ్యంలో ఎలాగూ కనీస మెజారిటీ దక్కదని సర్వేలన్నీ చెబుతున్న నేపథ్యంలో జేడీఎస్ మద్దతును బీజేపీ పట్టుబట్టి అయినా సాధించుకోగలదు.
పోలింగ్ వరకూ మత రాజకీయం చేసినా, ఇప్పుడు ఎంఐఎం సన్నిహితురాలైన జేడీఎస్ బీజేపీకి సన్నిహితురాలు కాకుండా పోదు. అధికారం బీజేపీ అవసరం. అందుకోసం జేడీఎస్ ను మొన్నటి వరకూ ఎన్ని తిట్టినా అది కుటుంబ పార్టీ, వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం, జేడీఎస్ అవినీతి పార్టీ అంటూ ఎన్ని చెప్పినా… ఇప్పుడు కుమారస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాల్లో ఉందనేది బెంగళూరు టాక్.