కాపులు ఎప్పటికీ సిఎమ్ కాలేరా?

సిఎమ్ కావాలనే కోరిక జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు లేకపోవచ్చు. కానీ కాపులకు వుంది. చరిత్రలో కాపు వర్గం నుంచి ఒక్కరు అంటే ఒక్కరు కూడా సిఎమ్ కాలేదు. కాపు ఓట్ల కన్నా…

సిఎమ్ కావాలనే కోరిక జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు లేకపోవచ్చు. కానీ కాపులకు వుంది. చరిత్రలో కాపు వర్గం నుంచి ఒక్కరు అంటే ఒక్కరు కూడా సిఎమ్ కాలేదు. కాపు ఓట్ల కన్నా అతి తక్కువ ఓట్ల శాతం వున్న బ్రాహ్మణ, వైశ్య, వెలమ లాంటి వర్గాల నుంచి సిఎమ్ లు అయిన వారు వున్నారు. కానీ కాపులకు ఆ అవకాశం దక్కడం లేదు. 

కాంగ్రెస్ లేదా భాజపా కనుక అధికారం చేపడితే ఆ అవకాశం వుంటుంది. తెలుగుదేశం, వైకాపాల్లో ఆ అవకాశం అస్సలు వుండదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల. అద్భుతం జరిగి భవిష్యత్ లో వచ్చినా మళ్లీ గతంలో ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. ఇక మిగిలన ఆశ ఒక్క భాజపానే. కానీ పవన్ చేజేతులా ఆ అవకాశాన్ని చంపేసుకుంటున్నారు.

పోనీ మళ్లీ ఎవరైనా ప్రాంతీయ పార్టీ పెట్టి సిఎమ్ అవుతారేమో అనుకుంటే, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కన్నా చరిష్మా, ఆర్థిక మద్దతు వున్న వారు కాపుల్లో లేరు. అల్లు అర్జున్ లాంటి వాళ్లు భవిష్యత్ లో ట్రయ్ చేయాలేమో?

ఇలాంటి నేపథ్యంలో పవన్ ఐచ్ఛికంగా సిఎమ్ పోస్ట్ తనకు వద్దు అని చెప్పేసారు. గతంలో 7శాతం మాత్రమే ఓట్లు వచ్చినందున సిఎమ్ పోస్ట్ అడగలేనని తేల్చేసారు. ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగిందని చెబుతూనే, దాన్ని లెక్కలోకి తీసుకోలేదు. సరే ఇక ఇప్పుడు పరిస్థితి ఏమిటి? అయితే జగన్ లేదంటే చంద్రబాబు ఇదే కదా మిగిలిన ఛాయిస్. మరి అలాంటపుడు భవిష్యత్ ఎలా వుంటుంది. 

మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే అయిదేళ్ల పాటు జనసేనను కాపాడుకోవడం కష్టం. గెలిచిన వాళ్లను వుంచరు. జంప్ జిలానీలుగా మార్చేస్తారు. అది తప్పదు. మరో అయిదేళ్లు అంటే పవన్ కు 60 దగ్గరకు వచ్చేస్తాయి. ఇప్పుడున్నంత శక్తి, ఓపిక వుండదు. తిరిగి ఫైట్ చేసేంత సీన్ వుండకపోవచ్చు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చారు అనుకుందాం. అప్పుడు మరోసారి 2029లో అధికారం ఒదులుకోవడానికి సిద్దపడతారా? చినబాబు లోకేష్ ను గద్దె ఎక్కించడానికి చూస్తారు తప్ప. పొత్తు ధర్మం కాబట్టి ఎమ్మెల్యేలను లాక్కోకుండా వుండొచ్చు. కానీ యాంటీ గవర్నమెంట్ ఓటు ను పవన్ తీసుకోలేరు. అలా అని 2029లో చంద్రబాబుతో పొత్తు కటీఫ్ చేసుకుని పోరాడలేరు. ఓసారి పొత్తు..మరోసారి వద్దు..ఇంకోసారి పొత్తు..వేరొకసారి వద్దు అంటే జనం ఛీ అంటారు. అంటే రాజకీయంగా పవన్ కు ఆత్మహత్యాసదృశంగా వుంటుంది ఇతంతా.

తెలుగుదేశం బలాన్ని, బలగాన్ని, అనకూల మీడియాను తట్టుకుని నిలబడడం జగన్ వల్లనే కావడం లేదు. పవన్ వల్ల వన్ డే కూడా సాధ్యం కాదు. ఎప్పటికీ తెలుగుదేశాన్ని అంటిపెట్టుకుని వుండాలి. లేదా అస్త్రసన్యాసం చేసి ఇంట్లో కూర్చోవాలి. అలా కాకుండా ధైర్యం చేసి, ఈ ధపానే భాజపాతో కలిసి ఒంటరిపోరు సాగిస్తే అది వేరుగా వుంటుంది. అలా చేయడం వల్ల మళ్లీ జగన్ అధికారంలోకి రావచ్చు. 

తెలుగుదేశం ఖతమ్ అయిపోతుంది. అప్పుడు జగన్..పవన్ ఇద్దరే మిగులుతారు. యాంటీ ఓటును సాధించడానికి అయిదేళ్ల సమయం వుంటుంది. 2029లో భాజపా పొత్తుతోనే సిఎమ్ కావడానికి ఎక్కువ చాన్స్ వుంటుంది.

అలా కాకుండా తెలుగుదేశాన్ని బతికిస్తే పవన్ కు రాజకీయంగా ఉపయోగం ఏమి వుండదు. మహా అయితే కొన్ని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు మినహా. కానీ ఎప్పటికైనా తమ వర్గం నుంచి ఒకరు సిఎమ్ కావాలన్న కాపుల ఆకాంక్ష పూర్తిగా నీరుకారిపోతుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాపులకు చేసిన ఉపకారం ఏమిటయ్యా అంటే ఇదే. ఎప్పటికి వారి వర్గం నుంచి ఎవరో ఒకరు సిఎమ్ కాకుండా చేయడం.