అహంకారం, నియంతృత్వం గురించి చంద్రబాబునాయుడు మాట్లాడ్డం, మనం వినాల్సి రావడం ఖర్మరా బాబూ అని నెత్తికేసి కొట్టుకోవాల్సిన పరిస్థితి. తాను ఏ విలువల గురించి బలంగా మాట్లాడుతారో, వాటిని అసలు పాటించని నాయకుడెవరైనా ఉన్నారా? అంటే… చంద్రబాబునాయుడే అని సమాధానం వస్తుంది. ప్రజాస్వామ్యం, అంబేద్కర్ రాజ్యాంగం అంటూ తెగ ఉపన్యాసాలు ఇస్తున్న చంద్రబాబునాయుడు, తన ఐదేళ్ల పాలనలో చేసిందేమిటి? ప్రజానీకం ఎందుకు ఘోరంగా ఓడించిందో ఆత్మ విమర్శ చేసుకున్న పాపాన పోలేదు. పైగా తనను ఓడించి ప్రజలే తప్పు చేశారనే బుకాయింపు చంద్రబాబులో చూశాం.
తాజాగా జీవో నంబర్-1పై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఈ జీవో తీసుకురావడానికి తానే కారణమని చంద్రబాబు విస్మరించినట్టున్నారు. ఎక్కువ జనసందోహాన్ని చూపించి , తన మీటింగ్లకు వెల్లువెత్తుతున్నారనే సంకేతాలను పంపేందుకు ఇరుకైన వీధుల్లో చంద్రబాబు సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు పాల్గొన్న సభల్లో వరుసగా పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.
బాబు అడుగు పెడితే చాలు శవాలు లేస్తాయనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. దీంతో ఇరుకు వీధుల్లో మీటింగ్లను అరికట్టి, ప్రాణ నష్టాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం జీవో నంబర్-1ను తీసుకొచ్చింది. ఈ జీవోను ఏపీ హైకోర్టు ఇవాళ కొట్టి వేసింది. దీనిపై చంద్రబాబు ట్విటర్ వేదికగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే…
“దేశంలో అంతిమంగా గెలిచేది… నిలిచేది అత్యున్నతమైన అంబేద్కర్ రాజ్యాంగమే. జగన్ లాంటి నాయకులు వస్తారని నాడే ఊహించి…భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారు. ప్రజాస్వామ్యమే ఉన్నతమైనదని….అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు దాని ముందు నిలబడవని మరోసారి స్పష్టమైంది. ప్రజలను, ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పై గొంతెత్తకుండా చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీ.ఓ. నెంబర్ 1 ను హైకోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం “
బషీర్బాగ్లో కాల్పులు జరిపి వామపక్ష కార్యకర్తల ప్రాణాలు తీసిన ఘన చరిత్ర తనదని చంద్రబాబు విస్మరించినట్టున్నారు. అలాగే సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన బాట పట్టిన అంగన్వాడీ మహిళా టీచర్లని కూడా చూడకుండా గుర్రాలతో తొక్కించి లాఠీ చార్జీ చేయించిన చరిత్ర తన పాలనకే దక్కిందని చంద్రబాబుకు గుర్తున్నట్టు లేదు. ఇలా ఒకటా, రెండా చంద్రబాబు అప్రజాస్వామిక పాలన గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు.
వైసీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను తన పార్టీలో చేర్చుకోవడం ఏ ప్రజాస్వామిక పరిరక్షణ పరిధిలోకి వస్తుందో ఆయనే చెప్పాలి. నీతులు చెప్పడానికి మాత్రం చంద్రబాబు ముందుంటారు. ఆచరణకు వచ్చే సరికి, ఇతరుల వైపు చేయి చూపిస్తారు. అదే చంద్రబాబుతో సమస్య. అందుకే చంద్రబాబు నీతులు చెబితే, వినలేక జనం పరుగులు తీస్తున్నారు.