సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ ఎప్పటికైనా వస్తుందో రాదో తెలియదు కానీ, ముందుగా ఓ సినిమాలో కృష్ణ పాత్ర కనిపించబోతోంది. కేవలం కృష్ణ పాత్ర మాత్రమే కాదు విజయనిర్మల పాత్ర కూడా. అంతే కాదు మహేష్ బాబు ప్రస్తావన కూడా.
ఇదంతా ఎక్కడ అంటే..మళ్లీ పెళ్లి సినిమాలో. విజయనిర్మల తనయుడు, సీనియర్ నరేష్ తన స్వంత స్టోరీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తన పెళ్లి, విపలం కావడం, పవిత్రా లోకేష్ తో ప్రేమలో పడడం, ఆమె వ్యక్తిగత, వైవాహిక జీవితం, చివరకు ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఇవన్నీ మళ్లీ పెళ్లి చిత్రంలో వుంటాయి.
అయితే సూపర్ స్టార్ కృష్ణ తన రిటైర్డ్ లైఫ్ అంతా విజయనిర్మల ఇంట్లోనే వున్నారు. నరేష్ కూడా అక్కడే వుండేవారు. అందుకే ఈ సినిమాలో కృష్ణ-విజయనిర్మల కూడా పాత్రలు కావాల్సి వచ్చింది సీనియర్ నటులు శరత్ బాబు-జయసుధ ఈ రెండు పాత్రలు పోషించారు. అయితే నేరుగా కృష్ణ-విజయ నిర్మల అనకుండా వేరే పేర్లు వాడారు. అలాగే నరేష్ పేరు కూడా నరేంద్ర అని వాడారు.
కృష్ణ-విజయనిర్మల పాత్రలను తెరపైకి తెచ్చినా మహేష్ పాత్రను తేలేదు. జస్ట్ డైలాగుల్లో ప్రస్తావించారంతే. ఎం ఎస్ రాజు డైరక్షన్ లో తయారవుతున్న ఈ సినిమాకు ఇప్పటికే మాంచి క్రేజ్ వచ్చింది. ఈ నెల 26న విడుదలవుతోంది.