మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ జరుపుతున్న సీబీఐకి షాక్ తగిలింది. ఏకంగా సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్‌పై కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇంత వరకూ విచారణ పేరుతో పలువురు ముఖ్యుల్ని పిలిపించుకోవడం, అలాగే చార్జిషీట్‌ల పేరుతో ప్రముఖ రాజకీయ నేతలకు సీబీఐ షాక్ ఇవ్వడం చూశాం. అలాంటి సీబీఐకి దిమ్మతిరిగేలా పులివెందుల నివాసి ఉదయ్‌కుమార్‌రెడ్డి చేశాడు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు విచారణ దాదాపు ముగింపు దశకు చేరింది. ఇప్పటికే ఐదుగురిని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసింది. వారంతా కడప జైల్లో ఉన్నారు. ఈ కేసులో నాల్గో నిందితుడైన వివేకా డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. దీంతో కేసు కీలక మలుపు తిరిగింది. అతని నుంచి రెండోసారి వాంగ్మూలం తీసుకోవడం గమనార్హం. ఇందులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి.
ఇదిలా వుండగా విచారణ పేరుతో తనను సీబీఐ అధికారి రామ్‌సింగ్ వేధిస్తున్నట్టు పులివెందుల నివాసైన యురేనియం కార్పొరేషన్ ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆరోపించాడు. అంతేకాదు, ఇటీవల జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్లి ఏఆర్ అదనపు ఎస్పీకి వినతిపత్రం అందజేశాడు. అలాగే కడప కోర్టులో పిటిషన్ వేశాడు.
ఈ పిటిషన్‌లో వివేకా హత్యకు సంబంధించి సీబీఐ అధికారులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని పేర్కొన్నాడు. వారు చెప్పినట్టు చెప్పకపోతే కుటుంబం మొత్తాన్ని కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని ప్రస్తావించాడు. ఆఫీసులో, ఇంటి వద్ద అవమానించారని రామ్‌సింగ్ వేధింపులపై అతను పిటిషన్ దాఖలు చేశాడు. విచారించిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కడప కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేసినట్టు రిమ్స్ పోలీసులు వెల్లడించారు. ఇది ఒక రకంగా వివేకా హత్య కేసులో కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఉదయ్‌కుమార్‌రెడ్డి పిటిషన్, విచారణాధికారిపై కేసు నేపథ్యంలో సీబీఐ వైఖరి ఎలా ఉంటుందో అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. అనేక ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాల్సి వుంది.